హైదరాబాద్ నగరం అమ్మాయిల అక్రమ రవాణా కు కేంద్రంగా మారుతోంది. కరోనా నేపథ్యంలో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వ్యభిచారం చాపకింద నీరులా విస్తరించింది. బ్రోకర్లు, వ్యభిచార గృహాల నిర్వాహకులు ఇతర రాష్ట్రాల నుంచి.. విదేశాల నుంచి యువతుల్ని అక్రమంగా హైదరాబాద్‌కు తీసుకువచ్చి వారితో వ్యభిచారం చేయిస్తున్నారు.గతంలో కూడా ఇలాంటి కార్యకలాపాలు జోరుగా సాగాయి. మధ్య కాలంలో కొంత తగ్గుముఖం పట్టాయి. బంగ్లాదేశ్‌కు చెందిన కొంతమంది యువతులను ఉద్యోగాల పేరిట హైదరాబాద్‌కు తీసుకువచ్చి.. వారిని ఇక్కడ వ్యభిచార గృహాలకు అమ్మేసినట్టు ఎన్‌ఐఏ గుర్తించింది.
ఉగ్రవాదం, తీవ్రవాదంపై దృష్టిసారించే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కూడా తొలిసారి మానవ అక్రమ రవాణాపై దృష్టి సారించడం విశేషం. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన ముఠాపై కేసు కూడా బుక్ చేశారు. ఈ ఘటనతో హైదరాబాద్ మరల అక్రమరవాణాకు అడ్డాగా మారిందని అంటున్నారు. పోలీసులు అప్రమత్తమై వ్యభిచార ముఠాల గురించి కూపీ లాగుతున్నారు.
గత ఏడాది సెప్టెంబరులో పహాడీషరీఫ్ పోలీసులు.. జల్‌పల్లి, మహమూద్ కాలనీల్లోని వ్యభిచార గృహాలపై దాడిచేసి నిర్వహకులను అరెస్టు చేశారు. నలుగురు బంగ్లాదేశ్ యువతుల్ని రక్షించి.. వసతి గృహానికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి.. తర్వాత సీసీఎ్‌సకు బదిలీ చేశారు. అమ్మాయిలు విదేశీయులు కావడంతో అందులోను అక్రమ రవాణాకు సంబంధించిన అంశం కావడంతో కేసు ఎన్‌ఐఏకు బదిలీ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ అధికారులు 12 మంది నిందితులను అరెస్టు చేసి.. గత సెప్టెంబరులో చార్జిషీట్ దాఖలు చేశారు. సోనాయ్ నది మీదుగా.. బంగ్లా యువతుల్ని ఉద్యోగాల పేరుతో కోల్‌కతాకు తీసుకువచ్చి అక్కడి నుంచి హైదరాబాద్, ముంబై ఇతర ప్రాంతాల్లోని వ్యభిచార గృహాలకు తరలించినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది.
కాగా కొద్దిరోజుల క్రితం అబ్దుల్లాపూర్‌మెట్ స్టేషన్ పరిధిలో పోలీ్‌సలు దాడి చేసి నలుగురు వ్యభిచార గృహ నిర్వహకులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు బంగ్లాదేశ్ యువతుల్ని రక్షించి.. వసతి గృహానికి తరలించారు. దీంతో హైదరాబాద్‌లో బంగ్లాదేశ్ యువతుల అక్రమ నిర్బంధం వ్యవహారం మళ్ళీ వెలుగు లోకి వచ్చింది.ఇది కూడా అంతర్జాతీయ మానవ అక్రమ రవాణాకు కేసు కావడంతో ఎన్‌ఐఏ రంగంలోకి దిగనుంది.పోలీసులు కూపీ లాగితే బంగ్లాదేశీయులే అక్కడ నుంచి ఉద్యోగం, ఉపాధి పేరుతో యువతుల్ని అక్రమంగా ఇక్కడకు తీసుకొచ్చి వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని తేలింది.
బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన వారిలో కొందరు హైదరాబాద్‌లో ఉంటున్నారు. తమకు తెలిసిన పేద కుటుంబాల యువతుల్ని మభ్యపెట్టి హైదరాబాద్ కు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు బంగ్లాదేశీ ట్రాఫికింగ్ ముఠాల మూలాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. కోల్‌కతా కేంద్రంగా ఈ వ్యవహారం నడుస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు..వీరికి ఎవరెవరు సహాయపడుతున్నారు ? వారి వివరాలు ఏమిటో రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ట్రాఫికింగ్ ముఠాలు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ అమ్మాయిలను సరఫరా చేస్తున్నారని సమాచారం.
————–– KNM
ఇది కూడా చదవండి>>>>>>>>>>>>> వేట మొదలైంది!