Are there billions of civilizations in space?………..
ఖగోళశాస్త్రంలో ఫ్రాంక్ డ్రేక్ ద్వారా ప్రతిపాదించబడిన డ్రేక్ ఈక్వేషన్ ప్రకారం మనం చూడగలుగుతున్న అంతరిక్షంలో వేల కోట్ల కొలది నాగరికతలు విలసిల్లుతున్నాయి.
సనాతన ధర్మం – శాస్త్రీయ వైశిష్ట్యత : 7
దేవీభాగవతంలోని తృతీయ స్కంధంలో ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు . త్రిమూర్తులు ముగ్గురూ తమకు అప్పజెప్పిన పనిని ఎలా చేయాలో, ఎలా మొదలు పెట్టాలో తెలియక దేవి (శక్తి) ని శరణు వేడారు.
అప్పుడు ఆమె త్రిమూర్తులను సర్వలోక సందర్శనకు తీసుకువెళుతుంది. ఆయా లోకాల్లో త్రిమూర్తులు తమ లాంటి వాళ్ళను, తమ కన్నా శక్తిమంతులను, తాము చేయాల్సిన పనినే వారు చేస్తుండగా చూసి ఆశ్చర్య పోతారు. తరువాత నిస్పృహని వీడి కార్యోన్ముఖులౌతారు.
In astronomy, according to Drake equation coined in 1961 proposed by Frank Drake, in observable universe there are billions of civilizations.
మరి అలాంటి నాగరికతలను మన జీవితకాలంలో చూడగలమా? అంటే, అది చాలా కష్టమనే నా అభిప్రాయం. ఆ గ్రహాంతర వాసులే ఇక్కడికి వస్తే… అనే కోణాన్ని నేను స్పృశించడం లేదు. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. దానికి నేనిచ్చే వివరణ ఏమంటే… రోదసీ యాత్రలు చేసే మొత్తం టెక్నాలజీ పరంగా అసలు మనం సరైన ట్రాక్ లో లేమనిపిస్తోంది.
ఎందుకిలా అంటున్నానంటే, భూమి యొక్క ఎస్కేప్ వెలాసిటీ ని అధికమించి రోదసి లోకి వెళ్ళడం, దాని వల్ల అనేక ప్రయోజనాలు మనం పొందడం వరకూ బాగానే ఉంది. కానీ ఈ పరిజ్ఞానం అంతా అంతవరకే పరిమితం. కానీ దానితో మన సౌరకుటుంబాన్ని దాటి వెళ్ళి మరో లోకాలను వెతకడం అసంభవం.
మన సౌరకుటుంబానికి అతి దగ్గరలో ఉన్న నక్షత్రం Proxima Centauri. నిజానికి ఇది మూడు నక్షత్రాల సమూహం లోనిది. మిగతా రెండూ Alfa Centauri A & B. ఈ ప్రాక్జిమా సెంటురీ మనకి 4.24 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.
ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్న ఆధునిక రాకెట్ (వేగం గంటకు 45,000కి.మీ)లో అక్కడికి చేరడానికి 1,00,000 సంవత్సరాలు పడుతుంది. త్వరలో ప్రయోగించబోతున్న పార్కర్ సోలార్ ప్రోబ్ (వేగం గంటకు 7,00,000కి.మీ) లాంటిదైతే 6,300సంవత్సరాలు పడుతుంది. అందుకే ఇది సాధ్యమయ్యే పని కాదని నా భావన.
ఇక్కడ నేను టెక్నాలజీని తప్పు పట్టడం లేదు. కానీ మనం ఎంచుకున్న దారి సరైనది కాదని మాత్రమే చెప్తున్నాను. స్వల్ప లక్ష్యాల సాధనలో మనం కృతకృత్యులం అయ్యాం అనడంలో సందేహం లేదు. కానీ సుదూర లక్ష్యాలను చేరుకోవాలంటే ఖచ్చితంగా మనం మరో దారి వెతుక్కోవాల్సిందే. ఎందుకంటే ఇప్పటి ఆలోచనలతో మాత్రం అది కుదరని పని.
వార్మ్ హోల్స్ అనీ, ఇంటర్ స్టెల్లార్ ట్రావెల్ అనీ, అల్క్యుబియర్ర్ డ్రైవ్ అనీ రకరకాల ఐడియాలు ఉన్నా, అవన్నీ ఎటువంటి పురోగతి లేకుండా కేవలం ఐడియాల రూపంలో మాత్రమే ఉన్నాయి. చూద్దాం, భవిష్యత్తులో ఎలాంటి ఆవిష్కరణలతో ఇది సాధ్యమౌతుందో…!!!
చెణుకులు :
1) స్పేస్ అనేది భూఉపరితలం నుండి 100కి.మీ ఎత్తులో కార్మన్ లైన్ నుండి మొదలౌతుంది.
2) క్రీ. పూ 1440లో ఈజిప్టులో వెలుతురు వలయాలు ఎగురుతూ వెళ్ళినట్లు లిఖించబడిన అతి పురాతన (ఇప్పటి వరకూ…) ఆధారం ఉంది.
3) పీటర్ స్టర్రోక్ సర్వే ప్రకారం 1,356 మంది అంతరిక్ష శాస్త్రవేత్తలలో 62మంది, తాము భూమికి చెందని అనూహ్య సంఘటనలను చూశామని చెప్పారు.
4) రెండో ప్రపంచయుద్ధం తరువాత మొదలైన న్యూక్లియర్ రేస్ లో అనేక బేస్ ల వద్ద వింతైన, ఎగురుతున్న వాహనాలను చూశామని దాదాపు 160మంది మాజీ సైనికులు వెల్లడించారు.
5) మనం గ్రహాంతరవాసులతో గానీ, వారు మనతో గానీ కమ్యూనికేషన్ చేయలేని విధంగా గ్రేట్ ఫిల్టర్ అనే ఒక అనూహ్య అడ్డుగోడ ఉందని కొందరి అభిప్రాయం.
————– పులి ఓబుల్ రెడ్డి