ఈ ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు సుధాకరన్. ఇతగాడే ఒకనాటి తమిళనాడు సీఎం జయలలిత దత్త పుత్రుడు. జయ నెచ్చెలి శశికళ మేనల్లుడు. ఈ సుధాకరన్ సోదరుడే దినకరన్. ఈ ఇద్దరు శశికళ ద్వారానే జయలలితకు పరిచయమైనారు.1995 లో జయలలిత సుధాకరన్ ను తన దత్తపుత్రుడిగా ప్రకటించారు.
అంతేకాదు.. సుధాకరన్ పెళ్లి ప్రముఖ నటుడు శివాజీ గణేశన్ మనవరాలు సత్యలక్ష్మితో అంగరంగ వైభవంగా జరిపించారు. కొన్ని కోట్ల రూపాయలు ఈ పెళ్ళికి జయలలిత ఖర్చుపెట్టారనే ఆరోపణలు వచ్చాయి. ఇక అప్పట్లో సుధాకరన్ జయ వారసుడిగా రాజకీయాల్లోకి వస్తాడని కూడా ప్రచారం జరిగింది. కొన్నాళ్ళు ఆగినట్లైతే అదే జరిగేదేమో.
సుధాకరన్ జయ ఆర్ధిక వ్యవహారాలు కూడా చూసేవారు. వ్యాపార నిమిత్తం కోట్లాది రూపాయల సొమ్ము తీసు కున్నారని కూడా అంటారు. సుధాకరన్ 1996లో JJ టీవీని ప్రారంభించి, కొన్నాళ్లపాటు దానిని నిర్వహించాడు. ఈ టీవీ ఛానల్ ను పార్టీ ని ప్రమోట్ చేసేందుకు ఉపయోగించుకోవాలనుకున్నారు. ఈ లోగానే సుధాకరన్ ప్రభుత్వ వ్యవహారాల్లో తల దూరుస్తున్నారనే ఆరోపణలు రావడంతో జయ అతగాడిని పక్కన బెట్టారు.
తనకు తెలీకుండానే కీలకమైన వ్యక్తుల బదిలీలు జరగడం .. తన సంతకాలు ఫోర్జరీ కావడం వంటి అంశాలు జయ దృష్టికి రావడంతో ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. ఆ మరునాడే ఆగస్టు 25, 1996న సుధాకరన్ తన దత్త పుత్రుడు కాదని జయలలిత ప్రకటించారు. కానీ ఆ సందర్భంగా జయ సుధాకరన్ పై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. సింగల్ స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకున్నారు. తల్లి కొడుకులుగా వారి బంధం కనీసం ఏడాది కూడా నిలవలేదు. సుధాకరన్ పెళ్లి తర్వాత జయలలిత రాజకీయంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆమెపై కేసులు కూడా బుక్ అయ్యాయి. ధూమ్ ధామ్గా జరిపించిన పెళ్లి జయలలిత పతనానికి దారి తీసింది. కోట్లకు పడగలెత్తారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి తోడు జయలలిత, శశికళ నగలు పెట్టుకుని దిగిన చిత్రాలు బయటకు రావడంతో ఆమె పై ప్రజల్లో ఆగ్రహం పెరిగింది.
ఫలితంగా 1996 ఎన్నికల్లో జయలలిత ఓడిపోయి అవినీతి ఆరోపణలపై జైలుకెళ్లారు. వీటి అన్నింటి నుంచి తట్టుకుని నిలబడటానికి జయలలితకు చాలా సమయం పట్టింది. ఆ సమయంలో శశికళ జయ తో పాటే ఉంది. సుధాకరన్ ను బయటకు పంపినా శశికళ ఏమీ మాట్లాడలేదని అంటారు. దినకరన్ కూడా అపుడు పార్టీ లో చురుగ్గా ఉన్నారు.
ఆ తర్వాత 2001 లో సుధాకరన్ జయలలితపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసాడు. ఆ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే చెన్నైలోని సుధాకరన్ ఇంటిపై పోలీసుల దాడి జరిగింది. లైసెన్స్ లేని తుపాకీ, హెరాయిన్ ప్యాకెట్ స్వాధీనం చేసుకున్నారు. తనపై సుధాకరన్ రివాల్వర్‌తో దాడి చేసి బెదిరించాడని వ్యక్తిగత సహాయకుడు గోపి శ్రీధర్ ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆ కేసులో తనను అక్రమంగా ఇరికించారని సుధాకరన్ ఆరోపించాడు. ఆ కేసును పోలీసులు ప్రూవ్ చేయ లేకపోయారు. ఆ తర్వాత తన దగ్గర ఉన్న సొమ్ముతో సుధాకరన్ విలాసంగానే జీవించాడు. బయట ఉంటూనే చిన్నమ్మ తో మంతనాలు చేసేవాడని చెప్పుకునే వారు. 2016 లో చిన్నమ్మ తో జైలు కెళ్లిన వారిలో ఈ సుధాకరన్ కూడా ఉన్నాడు.