సన్యాసి అలా ఎందుకన్నాడు ??

Sharing is Caring...

Supernatural powers……………………….

పూర్వం  ఒకాయన  అతీంద్రియ శక్తులు సాధించాలనుకున్నాడు. ఆయన అనేకమంది గురువుల వద్దకు వెళ్లాడు. కానీ ఎవరూ నేర్పడానికి అంగీకరించలేదు. చివరకు ఒకతను, ‘టిబెట్‌కు వెళ్లండి. అక్కడ ఓ ముసలి సన్యాసి ఉన్నాడు అని సలహా ఇచ్చాడు. ఈయన తక్షణమే టిబెట్‌కు ప్రయాణమయ్యాడు.

హిమాలయాలు దాటి ఆ బౌద్ధారామంలో ప్రవేశించాడు. ఏ బౌద్ధారామానికి వెళ్లినా, ‘మీరెక్కడి నుంచి వచ్చారు?’ అని ఎవరూ అడగరు. అది మిమ్మల్ని పట్టించుకోకపోవటం కాదు. వారి జీవితం మొత్తం ‘నేను ఎవరు?’ అనే విషయం తెలుసుకోవడం గురించే. అందువల్ల కొత్తగా వచ్చినవారిని అలా ప్రశ్నించి ఇబ్బంది పెట్టకూడదనేది వారి ఉద్దేశం.

అందుకే అక్కడెవ్వరూ ఆయనతో మాట్లాడలేదు. ఎవ్వరూ ఆయన్ని తినమని కూడా అడగలేదు. భోజనం టైమ్‌లో ఒక గంట మోగుతుంది. కావలసినవారు భోంచేయొచ్చు. మీరు భోజనం చేయకపోతే గనక, దానికి కూడా అక్కడ ఎంతో ఆదరణ! బౌద్ధ ధర్మంలో ఉపవాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ విచిత్ర పరిస్థితుల్లో ఆయన మరింత ఇబ్బందిపడ్డాడు.

ఒకరోజు, రెండు రోజులు, మూడు రోజులు… ఇక ఆకలి తట్టుకోలేక వెళ్లి భోజనం చేసేశాడు. మొత్తానికి అక్కడే ఉన్నాడు. మూడు వారాలు గడిచాయి. చివరకు ఒక ముసలి సన్యాసి ఆయన్ని పిలిచాడు.‘‘నీకు ఈ అతీంద్రియ శక్తులతో ఏం పని? అవి వద్దు కానీ నీకు ధ్యానం నేర్పుతా. దానితో నీవొక సఫలమైన జీవనం గడపగలవు’’ అన్నాడు.

కానీ మనవాడు ‘‘కాదు, నాకు అతీంద్రియ శక్తులే కావాలి’’ అన్నాడు. గత్యంతరం లేక, ‘‘సరే! రేపు తెల్లవారుఝామున నాలుగ్గంటలకు చన్నీళ్ల స్నానం చేసి రమ్మ’’న్నాడు. టిబెట్‌లో ఉష్ణోగ్రతలెప్పుడూ మైనస్ డిగ్రీల్లో ఉంటాయి. అయినా మనవాడు చన్నీటి స్నానం చేసి ఆయన ముందుకు వెళ్లి కూర్చున్నాడు.

ఆ సన్యాసి, ‘‘నీకు మూడు రహస్య మంత్రాలు నేర్పుతాను; బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. ఈ మూడు మంత్రాలనూ మూడుసార్లు ఉచ్ఛరిస్తే గనక అతీంద్రియ శక్తులన్నీ నీవే. కానీ మంత్రాలు జపించేటప్పుడు నువ్వు కోతుల్ని మాత్రం తలుచుకోకూడదు’’ అన్నాడు.

మనవాడు సంతోషంతో గంతులేసుకుంటూ బయటకు వచ్చాడు. ‘ఈ తెలివితక్కువ సన్యాసి నాకు రహస్యాలన్నీ చెప్పేశాడు. గురుదక్షిణ కూడా అడగలేదు. కేవలం కోతులను గుర్తుపెట్టుకోవద్దని మాత్రం చెప్పాడు. వాటితో నాకేం పని? అసలు వాటిని చూసి కూడా ఎన్నో యేళ్లయింది’ అనుకుంటూ స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. తెల్లవారి, చన్నీటి స్నానం చేసి కూర్చున్నాక… బుద్ధం – కోతి! మళ్లీ చన్నీటి స్నానం చేసి వచ్చి, బుద్ధం – కోతి! బుద్ధం- మళ్లీ కోతి!

ఆయన సాంతం – ‘బు’ అనకముందే మనసులోకి కోతులు వచ్చేస్తున్నాయి. ఒకవారం తీవ్ర సాధన తరువాత ఏ స్థితికి వచ్చాడంటే, ఆయన ఏమీ ఆలోచించకముందే మనసంతా ఎప్పుడూ కోతులే. ఈ అవస్థ పడలేక తిరిగి టిబెట్ వెళ్లి, ఆ బౌద్ధ సన్యాసితో, ‘‘నాకు అతీంద్రియ శక్తులేమీ అక్కర్లేదు. ముందు నా బుర్రలోంచి ఈ కోతుల్ని తీసేయండి’’ అని వేడుకున్నాడు.

చెప్పొచ్చేదేమిటంటే మనసు ఇలాగే ఉంటుంది. ‘ఏదైనా వద్దు’ అన్న మరుక్షణం నుంచీ ఇక మనసు అదే పనిచేస్తుంది. అందువల్ల మీరు మథనపడవద్దు. మీరు చూసినది మీ మనసులో వెనక ఎక్కడో ఉంది. దాన్ని అలా ఉండనిచ్చి, ఈ క్షణాన మీరు ఏం చేయాల్సివుందో అది చేయండి.

మీరు ఒక ఆలోచనలో పూర్తిగా మునిగిపోతే, మిగిలినవన్నీ వాటంతటవే మాయమైపోతాయి. అలాకాకుండా ముందు ఫలానాదాన్ని తొలగించాలని పంతంతో కూర్చుంటే, అది ఎప్పటికీ జరగదు. జరగకపోగా దాన్ని వదిలించుకోవడమే మీ పూర్తి స్థాయి వ్యాపకం అయిపోతుంది. 

———–  Raja 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!