చిత్తమొచ్చిన చెత్త మాటలు !

Sharing is Caring...

అరేయ్  ఆ “చెత్త మాట”రెడీ అయిందా ? అడిగాడు ఇంచార్జ్ సుబ్బారావు సీనియర్ సబ్ ని
ఆ ఇద్దరూ  ఒరేయ్ తురేయ్ అనుకునేంత  జాన్ జిగ్రీ దోస్తులు.
ఏ పత్రికలోకెళ్ళినా  ఇద్దరు కలసి వెళ్తుంటారు. ఇద్దరు మంచి రాతగాళ్ళు.
ఏదైనా పాయింట్ చెబితే రాకెట్ స్పీడ్ తో స్టోరీ అల్లేస్తారు.
వాస్తవానికి ఇద్దరూ నిఖార్సైన జర్నలిస్టులు.


అయితే ఏ అవకాశం దొరకక అక్కడే పనిచేస్తున్నారు.
గతంలో మాదిరిగా ఇపుడు పత్రికల్లో అవకాశాలు లేవు.
వెనుకటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితి కి చాలా తేడా ఉంది.


పత్రికలు  పొలిటికల్ పార్టీలకు అనుబంధంగా మారడం తో జర్నలిస్టులపై కూడా ముద్ర పడింది.
“ఎండీ కి ఫోన్ చేస్తుంటే కలవడం లేదు .. ఎక్కడున్నాడో ఏమో ?” అన్నాడు శేషు సుబ్బారావుతో.
“సరే కానీ …  అరేయ్ .. మొన్న నాకో విషయం తెల్సింది .. నీతో కూడా ఎవరైనా అన్నారా ?”
“ఏంటది ?”
“మనోడికి యేవో దివ్యశక్తులు ఉన్నాయట.  అవే వార్తలు కూడా చెబుతుంటాయట.
“”నిజమా ?”


” అంతా హంబగ్ …. దివ్య శక్తులు లేవు.. దివ్య దృష్టి లేదు…ఆమధ్య తనకు కర్ణ పిశాచి వచ్చి రోజూ చెవిలో ఊది వెళుతుందని కూడా చెప్పుకున్నాడట ”
“ఓహో ”
” ఆ కర్ణ పిశాచే రేపు “ఈ వార్త రాయి ..చెత్త మాటలో ఈ పాయింట్ పై డిస్కస్ చేయి” అని చెబుతుందట.
“ఓరీ వీడెమ్మ భడవా .. నేను ఇన్నాళ్లుగా రాస్తున్నది ఆ కర్ణ పిశాచి చెప్పే వార్తలా ? ”
“అంతేగా మరి.”


“అవునూ …  ఎప్పుడు  ఆ చిన్నరెడ్డి పై ఏడుస్తుంటాడు దేనికి ?”
“ఆయన ఈయనను  తోపు జర్నలిస్ట్ కింద గుర్తించలేదు అందుకని. ఏడాది నుంచి ఇంటర్వ్యూ అడుగుతుంటే ఇవ్వలేదట.”
“అంతేనా ? అలా ఏడవకపోతే  పెద్ద సామి కి కోపమొచ్చి కొనిపించిన టైటిల్ .. పెట్టిన పెట్టుబడి వెనక్కి అడుగుతాడనా ?”


“అది జగమెరిగిన విషయమే కదా.”
అంతలో శేషు సెల్ఫోన్ మోగింది.
“అరేయ్ బాస్ ఫోన్ .. కాసేపు సైలెంట్ గా ఉండు” అని ఫోన్ ఆన్ చేసాడు.
“శేషూ ఏమైనా రాశావా ?” అడిగాడు ఎండీ.


“చిన్నసామి .. చిన్న రెడ్డి కల్సి నాటకాలు ఆడుతున్నారని ఒక పది లైన్లు రాసాను సార్ .”
“ఒకే .. గుడ్ .. ఇంకో పాయింట్ చెబుతా విను .. చిన్నరెడ్డి ప్రతిరోజూ రాత్రి వాళ్ళ నాన్న పెద్ద రెడ్డి తో చర్చలు జరుపుతారని రాసేయ్.అలాగే ప్రభువు తో కూడా మాట్లాడుతుంటాడని రాసేయి. ఒక అధికారి ఈ విషయం చెప్పగా అయన మనకు చెప్పాడని రాయి. ”
“నాకో డౌట్ సార్ “అడిగాడు శేషు.


“ఏంటది ?”
“పెద్దరెడ్డి గారు లేరు కదా” అన్నాడు నసుగుతూ శేషు.
“లేరు కాబట్టే అది వార్త అవుతుంది ..కుక్క మనిషిని కరిస్తే వార్తకాదు .. మనిషి కుక్కను కరిస్తే అది వార్త. చనిపోయిన పెద్దరెడ్డి తో మాట్లాడుతున్నారంటే అది సంచలన వార్త అవుతుంది.” అన్నాడు ఎండీ.
“సరే సార్ “అన్నాడు మనసులో నసుక్కుంటూ.


“వచ్చే వారం ‘నేనే ప్రభువుని  అంటున్న చిన్నరెడ్డి’ అంటూ ఇంకో సంచలన కథనం ఇద్దాం. ముందుగానే రాసి పెట్టుకో “అంటూ ఫోన్ పెట్టేసాడు ఎండీ.
” ఛీ దీనెమ్మ. మరీ ఇంత క్యారెక్టర్ అసాసినేషనా ? ..ఛీ” అంటూ విషయం మొత్తం సుబ్బారావు కి చెప్పాడు.
“సర్లేవోయ్ .. ఇష్టమైతే చేయడం .. లేదంటే దొబ్బేయడం .. నువ్వుకాకపోతే ఇంకొకడు రాస్తాడు? త్వరగా రాయి.అయినా ఆ చిన్నరెడ్డి పత్రికలో కూడా ఇలాంటి వంటకాలు ఉంటాయిగా .. కాకపోతే కాసింత తక్కువగా.”


” పాఠకులు ఛీ కొడతారనే భయం కూడా లేదా మనోడి కి ?అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఎంత ద్వేషం ఉన్నా ఇలాంటి కథనాలా  ? కనీసం విలువలు ఉండాలిగా ”
” విలువలా ? అవన్నీ వెనకటి రోజుల్లో..లాజిక్ లేకుండా . అభూత కల్పనలు రాయడమే ఇప్పటి పత్రికల మ్యాజిక్.”

“నాకు ఇంకో డౌట్ … అసలు మనోడి మానసిక స్థితి బాగుందా ?”
“నాకూ అదే డౌట్. పద టీ తాగొద్దాం .. తరువాత  రాద్దువుగానీ” అన్నాడు సుబ్బారావు.
ఇద్దరూ లేచి క్యాంటీన్ కి బయలు దేరారు.  

————-KNMURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!