ఆయన ‘సినిమా’ కు ఎందుకు దూరమయ్యారు ?

Sharing is Caring...

He is a chapter in the history of cinema…………………..

అందరూ కలలు కంటారు కానీ వాటిని సాకారం చేసుకునే వారు కొందరే. ఆ కొందరిలో రామోజీ అగ్రస్థానంలో ఉంటారు. ఉషాకిరణ్ మూవీస్ ను అగ్రగామి సంస్థగా .. అతి పెద్ద ప్రొడక్షన్ హౌస్ గా చూడాలని ఈనాడు రామోజీరావు కలలు కన్నారు. ఆ కల పూర్తిగా నెరవేరకుండానే ఆయన కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇపుడు వాటిని సాకారం చేసే వారు కూడా లేరు. అయినా సినీ ఇండస్ట్రీలో ఆయన సాధించిన విజయాలు తక్కువేమి కాదు. 

రామోజీ రావు 1983 లో ఉషాకిరణ్ మూవీస్ ను స్థాపించారు. మొదటి సినిమాగా  జంధ్యాల దర్శకత్వంలో “శ్రీవారికి ప్రేమలేఖ ” నిర్మించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది.తర్వాత మయూరి, ప్రతిఘటన, మౌనపోరాటం, ప్రేమించు పెళ్లాడు, సుందరీ సుబ్బారావు, కారు దిద్దిన కాపురం,నువ్వేకావాలి, ఆనందం,నచ్చావులే వంటి సినిమాలు తీశారు. వీటిలో మయూరి, ప్రతిఘటన,నువ్వేకావాలి కమర్షియల్ గా మంచి లాభాలు తెచ్చిపెట్టాయి.

ఉషాకిరణ్ మూవీస్ నిర్మించే  సినిమాలు పంపిణీ చేయడానికి మయూరి పేరుతో ఒక పంపిణీ సంస్థను కూడా ఏర్పాటు చేశారు. సినిమాలు తీసి సొంత సంస్థ ద్వారానే  పంపిణీ చేసుకునే వారు. కొన్నిబయటి సినిమాలు కూడా పంపిణీ చేశారు. తెలుగులో తీసిన సినిమాలను హిందీ,కన్నడ, మలయాళం. తమిళ భాషల్లో కూడా రీమేక్ చేశారు. ఆయా భాషల్లో కూడా కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి.

అలా అన్ని భాషల్లో అటు ఇటుగా 80 సినిమాలు తీశారు. తెలుగులో అయితే 49 సినిమాలు తీశారు. వి మధుసూదనరావు, సింగీతం శ్రీనివాసరావు, జంధ్యాల, కె.రాఘవేంద్రరావు, వంశీ, టి.కృష్ణ, రేలంగి నరసింహారావు, మోహన్ గాంధీ,మౌళి వంటి దర్శకులతో సినిమాలు తీశారు. ప్రముఖ రచయిత డివి నరసరాజు కారుదిద్దిన కాపురం సినిమాను డైరెక్ట్ చేశారు.

దర్శకులు తేజ,శ్రీను వైట్ల, హీరో జూనియర్ ఎన్టీఆర్, హీరోయిన్ శ్రియ తదితరులకు అవకాశాలిచ్చి ప్రోత్సాహించారు.రామోజీ చిత్రాల్లో ప్రతిఘటన బ్లాక్ బస్టర్ సినిమా. హీరోయిన్ విజయశాంతి కెరీర్ ఈ సినిమాతో మలుపు తిరిగింది. ఉత్తమ నటిగా నంది అవార్డు వచ్చింది. చరణ్ రాజ్ ఉత్తమ విలన్ గా నంది అవార్డు అందుకున్నారు. “ఈ దుర్యోధన …దుశ్శాసన లోకం లో ” పాటకు ఎస్ జానకి బెస్ట్ ఫిమేల్ సింగర్ గా నంది అవార్డు గెలుచుకున్నారు.

తెలుగులో భారీగా వసూళ్లు చేసిన ప్రతిఘటన 1987 లో ప్రతిఘట్ గా హిందీ లో రూపొందింది. రామోజీ నే రీమేక్ చేశారు. అక్కడ కూడా ఆ రోజుల్లో 8 కోట్లు కలెక్ట్ చేసింది. హిందీ చిత్రానికి  అంకుష్ ఫేమ్ ఎన్ . చంద్ర దర్శకత్వం వహించారు. సింపుల్ బడ్జెట్ లో తీసిన ఈ సినిమాలో సుజాత మెహతా,చరణ్ రాజ్, మోహన్ భండారీ తదితరులు నటించారు. మయూరి సూపర్ హిట్ జాబితాలో ఉంది.

ఈ సినిమా  ఉషాకిరణ్ మూవీస్ కి మంచి పేరు తెచ్చింది. ఆర్ధికంగా లాభాలు ఇచ్చింది. అవార్డులు పొందింది. నువ్వే కావాలి ఇండస్ట్రీ హిట్ గా పేరుగాంచింది. ఇది కూడా మంచి లాభాలు తెచ్చి పెట్టింది.

ఇతర సూపర్ హిట్ సినిమాల్లో కారుదిద్దిన కాపురం, చిత్రం, ఆనందం,  హిట్ జాబితాలో  కాంచన గంగ, సుందరి సుబ్బారావు, పేమించు పెళ్లాడు, ప్రేమాయణం, మౌనపోరాటం, ఓ భార్య కథ, మనసు మమత,అమ్మ,అశ్వనీ, వసుంధర,దీవించండి,మనసుంటే చాలు, నచ్చావులే, బెట్టింగ్ బంగార్రాజు,నువ్విలా ఉన్నాయి.

యావరేజ్ సినిమాల జాబితాలో పూజకు పనికిరాని పువ్వు, మల్లెమొగ్గలు, చందమామ రావే, జడ్జిమెంట్, మామాశ్రీ, పీపుల్స్ ఎన్కౌంటర్, జగన్నాథం అండ్ సన్స్, తేజ,డాడీ డాడీ, మూడుముక్కలాట, ప్రియ నేస్తమా, వీధి, బీరువా,జీవితమే ఒక సినిమా లు ఉన్నాయి.

ప్లాప్ సినిమాల జాబితాలో పాడుతా తీయగా,మెకానిక్ మామయ్య, శుభవేళ, నిన్ను చూడాలని , ఆకాశవీధిలో, ఇష్టం, నీతో,ఒక రాజు ఒక రాణి,మాధురి తొలిచూపులోనే, ఆనందమానందమాయే, నిన్ను కలిశాక, దాగుడుమూతల దండాకోర్ ఉన్నాయి. 2015 లో దాగుడు మూతల దండాకోర్ చివరిగా తీసిన సినిమా అని చెప్పుకోవచ్చు.వీటి హక్కులన్నీ రామోజీ వద్దనే ఉన్నాయి. సొంత ఛానల్స్ లో వీటిని ప్రదర్శిస్తుంటారు.

అన్ని సదుపాయాలూ ఉండి కూడా గత తొమ్మిదేళ్లలో రామోజీ రావు  మళ్ళీ సినిమా తీయలేదు. ప్రారంభ దశలో  ఏడాదికి మూడు లేదా రెండు సినిమాలు తీసిన రామోజీరావు 2015 తర్వాత  సినిమాల ఊసే ఎత్త లేదు. ఎక్కువగా సీరియల్స్.. ఇతర ప్రోగ్రామ్స్ మీదనే దృష్టి పెట్టారు. వయసు మీద పడటం ..ఫిలిం ప్రొడక్షన్ పట్ల  ఆసక్తి ఉన్న నమ్మకస్తులు లేకపోవడం, లిమిటెడ్ బడ్జెట్ లో సినిమాలు తీసే దర్శకులు లేకపోవడం వంటి కారణాలు కూడా ఆయనను సినిమాకు దూరం చేశాయి.

కుడి భుజం లాంటి అట్లూరి రామారావు తప్పుకున్నాక 2000 సంవత్సరం నుంచి సినిమాల సంఖ్య తగ్గిపోయింది. 100 సినిమాల ప్రొడక్షన్ హౌస్ గా ఉషాకిరణ్ మూవీస్ ను చూడాలని రామోజీ ఆకాంక్ష .. ఆవిషయం సన్నిహితుల వద్ద కూడా చెబుతుండేవారు. కానీ ఎనభై మాత్రమే తీయగలిగారు. అది సామాన్యమైన విషయమేమి కాదు. చిత్ర పరిశ్రమలో అనూహ్యమైన మార్పులు రావడంతో వెనుకంజ వేశారు.

-KNMURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!