పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని పదవి నుంచి తప్పించడం రాజకీయ ప్రయోజనాల కోసమే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పుదుచ్చేరిలో సీఎం నారాయణ స్వామి సర్కార్ ఏర్పాటైనప్పటి నుంచి గవర్నర్ కిరణ్ బేడీతో విభేదాలు కొనసాగుతున్నాయి. తమ ప్రభుత్వాన్ని గవర్నర్ పనిచేయనీయడం లేదని సీఎం ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ విధానాలకు అడుగడుగునా అడ్డుపడుతున్నారని నారాయణ స్వామి బహిరంగ విమర్శలు చేశారు. ఆ మధ్య రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి గవర్నర్‌కు వ్యతిరేకంగా మెమొరాండం కూడా అందజేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ తనను బెదిరిస్తుండటంతో తమ విధులను స్వేచ్ఛగా నిర్వహించలేకపోతున్నామంటూ రాష్ట్రపతికి ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో నారాయణ స్వామి మీద జనం లో కొంత సానుభూతి ఏర్పడింది. సరిగ్గా ఈ నేపథ్యంలోనే గవర్నర్ ను తప్పించారు.త్వరలో ఎన్నికలు జరగనున్న క్రమంలో గవర్నర్ పై చర్యలకు బీజేపీ ప్రత్యేక కారణాలంటూ చెప్పలేదు. కానీ తమ ఆశించిన రీతిలో కిరణ్ బేడీ వ్యవహరించక పోవడంతో తప్పించారని రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటున్నారు.
బీజేపీ నేతలు అప్పగించిన లక్ష్యాన్ని నెరవేర్చడంలో కిరణ్ బేడీ విఫలమయ్యారు. సీఎం చేసే తప్పులను ఎత్తి చూపాలని ఆమెకు ఆదేశాలు ఉండగా, ఆమె రోజువారీ ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుని, సీఎం కు ప్రజల్లో సానుభూతి పెరిగేలా చేశారని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే రాష్ట్రపతి కి ఫిర్యాదు ఇచ్చిన తర్వాత కూడా చర్య లేకపోతే మరిన్ని విమర్శలు వస్తాయని కూడా బీజీపీ అధిష్టానం భావించినట్టు చెబుతున్నారు. అలాగే ఎన్నికల టైములో అనుకూల గవర్నర్లను నియమించుకోవడం రాజకీయ పార్టీలకు ఆనవాయితీయే. దాన్నే బీజేపీ పాటిస్తోందని అంటున్నారు. కిరణ్ బేడీ రాజకీయ నేత కాకపోవడం ఆమెకు మైనస్ పాయింట్. ఆమె చురుకైన అధికారిగా మంచి పేరు సాధించారు. ఈ క్రమంలో ఆమె పని తీరు బీజేపీ అధిష్టానానికి నచ్చి ఉండకపోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే కిరణ్ బేడీకి ఇది అవమానకరమైన తొలగింపే.
ఇదిలా ఉంటే మరికొద్ది రోజుల్లో నాలుగు రాష్ట్రాలతో కలిపి పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. పుదుచ్చేరిలో ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ బలం తగ్గిపోయింది. ఇటీవల పార్టీ ఎమ్మెల్యేలు నలుగురు రాజీనామా చేయగా, ఒక ఎమ్మెల్యే అనర్హతకు గురికావడంతో సర్కార్ మైనార్టీ లో పడింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 15 సీట్లు గెలుచుకోగా, దాని భాగస్వామ్య పార్టీ డీఎంకే 3 సీట్లు గెలుచుకుంది. ఒక ఇంటిపెండెంట్ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ 8 సీట్లు గెలుచుకోగా దాని భాగస్వామ్య పార్టీ అన్నాడీఎంకే 4 సీట్లు గెలుచుకుంది. అయితే గవర్నర్ కిరణ్ బేడీ బీజేపీ నుంచి సభకు ముగ్గురిని నామినేట్ చేశారు. వీరికి ఓటింగ్ హక్కులు కూడా ఉన్నాయి. దీంతో 30 మంది సభ్యుల సంఖ్య 33కి చేరింది. ప్రభుత్వం నిలబడటానికి 16 మంది సభ్యులు ఉండాలి. ఇపుడు కాంగ్రెస్ బలం 14 సభ్యులు మాత్రమే. నారాయణస్వామి కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడి రాజీనామా చేయవచ్చు అంటున్నారు. ఏమి జరుగుతుందో చూడాలి.