హిజ్రాలు నాగసాధువులుగా ఎందుకు మారుతున్నారు ?

Sharing is Caring...

What is this Kinnera Akada?

నాగ సాధువుల సమూహాల్లోకి  హిజ్రాలు కూడా చేరుతున్నారు. నాగ సాధువుల జీవన శైలి పట్ల ఆకర్షితులై హిజ్రాలు కూడా దీక్షలు చేపట్టి సాధువులుగా మారుతున్నారు, వీరంతా ఒక ప్రత్యేకంగా ఒక అకడాను కూడా ఏర్పాటు చేసుకున్నారు.

సంఘం గుర్తింపు కోసం పోరాటం చేస్తున్నారు.ఈ హిజ్రాల అకడా ను “కిన్నెరా అకడా ” అంటారు. ఈ అక డా కు  లక్ష్మీగా మారిన లక్ష్మి నారాయణ్ త్రిపాఠి నాయకత్వం వహిస్తున్నారు. దేశంలోని ఎల్‌జిబిటి సమాజంలోని ప్రముఖులుగా గుర్తింపు పొందిన లక్ష్మి నారాయణ్ త్రిపాఠి 2011 లో రియాలిటీ టివి షో “బిగ్ బాస్” లో  కనిపించి పాపులర్ అయ్యారు.

మనదేశంలో దాదాపు 20 లక్షల మంది  హిజ్రాలు ఉన్నట్టు అంచనా.  వీరిని స్త్రీ, పురుషుల తర్వాత మూడో లింగంగా గుర్తిస్తూ 2014లో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఆ దరిమిలా 2015 లో లక్ష్మి నేతృత్వంలో ఈ కిన్నెర అకడా ఏర్పడింది.

హిందూ పురాణాలు, ఇతిహాసాల్లో కూడా ట్రాన్స్ జెండర్ల ప్రస్తావన చాలా చోట్ల ఉందని …  ట్రాన్స్ జెండర్లు వారి లింగ గుర్తింపు కారణంగా బహిష్కరణకు గురయ్యారని, తీవ్ర వివక్షకు గురవుతున్నారని హక్కుల సంస్థలు  చాలాకాలంగా వాదిస్తున్న విషయం తెలిసిందే. కాగా  చాలామంది హిజ్రాలు ఈ సాదు సంఘంలో చేరుతున్నారు.

నాగ సాధువులకు వర్తించే నియమాలు వీరికి వర్తిస్తాయి. వీరి వేషధారణ కొంచెం భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం దేశం లో మగ నాగ సాధువుల,మహిళా నాగసాధువులు కోసం 13 అకడాలు (సంఘాలు ) పనిచేస్తున్నాయి. వీటికి అఖిలభారత అకడా పరిషత్ గుర్తింపు ఉన్నది.

ఈ గుర్తింపు ఉంటేనే వీరికి కుంభ మేళా సమయంలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసుకోవటానికి … ఊరేగింపుగా వెళ్లి  గంగాజలాల్లో పవిత్ర స్నానం చేసే వీలుంటుంది. లేదంటే ఏదైనా అకడా కు అనుబంధంగా ఉంటూ ఆ సంఘం వారితో కలసి శిబిరాలు ఏర్పాటు చేసుకుని ..స్నానాలకు వెళ్లాల్సి ఉంటుంది. కుంభమేళా లో భక్తజనులను ఆకర్షించాలని హిజ్రా అకడా ప్రయత్నిస్తోంది. ఈ సంఘం అలహాబాద్, ప్రయాగ ప్రాంతాల్లో పనిచేస్తున్నది. 

కిన్నెరా అకడా కు  అధికారిక గుర్తింపు ఇచ్చినా .. ఇవ్వకపోయినా పెద్ద ప్రదర్శన చేపట్టాలని  ఆ సంఘం నిర్ణయించింది. అందరికి సంఘాలు ఉన్నపుడు హిజ్రాలకు మాత్రం సంఘం ఎందుకు ఉండకూడదని    కిన్నెరా అకడా సభ్యుల వాదన.

అయితే.. తమవి శతాబ్దాల కిందటి అకడాలని.. కొత్త సమూహాన్ని ఏర్పాటు చేయటానికి అంత సులభంగా అంగీకరించలేమని కొన్ని ఇతర అకడాలు అంటున్నాయి. ఆది శంకరాచార్యులు ఏడు అకడాలను స్థాపించారు.

అవి మహనిర్వని, నిరంజని, అటల్, అవహాన్, అగ్ని, ఆనంద, నిర్వాణి గా గుర్తింపు పొందాయి.  ఆ తర్వాత కొన్నేళ్ళకు నిర్మల్ పంచాయతీ, నిర్మోహి, దిగంబర్, జూనా, ఉదసిన్ బారా, ఉదసిన్ నయా ల పేరిట మరో ఆరు అకడాలు ఏర్పడ్డాయి. తరువాత, వైరాగి అకడా (సిక్కు సాధులతో ) ఏర్పడింది. కానీ దీనిని స్వతంత్ర అకడా గా పరిగణించలేదు. ఇపుడు ఈ హిజ్రాల అకడా మటుకు ప్రత్యేక గుర్తింపు కోరుతోంది.

 

—————– KNMURTHY

Sharing is Caring...
Support Tharjani

One Response

  1. యూ.వి.రత్నం March 1, 2021
error: Content is protected !!