ఎవరి లెక్కలు వారివేనా ?

Sharing is Caring...

Paresh Turlapati………………

మొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మీడియా సాక్షి గా వైట్ హౌస్ లో వాదులాడుకోవడం చాలామంది చూసే ఉంటారు ..వీళ్లిద్దరి వాదులాట చూసిన చాలామంది ట్రంప్ అహంకారాన్ని దుయ్యబడుతూ జెలెన్ స్కి గుండె ధైర్యానికి చప్పట్లు కొట్టారు. 

నిజానికి ఈ సన్నివేశంలో ఎవరి పాత్ర వాళ్ళు సమర్థవంతంగా పోషించారు ఓ పక్క అగ్ర రాజ్యంలో డాలర్ కు డాలర్ లెక్కపెట్టుకుంటూ ఆర్ధిక సంస్కరణల తెస్తూ ఉక్రెయిన్ యుద్ధానికి అమెరికా ఆర్థిక సాయం ఎలా చేస్తుందనేది ప్రస్తుతం అమెరికా ప్రజలను వేధిస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధానికి అమెరికా అందించిన ఆర్ధిక సాయం మూడున్నర లక్షల మిలియన్ డాలర్లు అయ్యింది పోనీ అంత ఖర్చు చేసినా ఈ యుద్ధం సంగతి ఏవన్నా తేలిందా అంటే అదీ లేదు … కార్తీక దీపం సీరియల్ మాదిరి 3 ఏళ్ళుగా కొనసాగుతూనే ఉంది … మధ్య మధ్యలో బాంబులు పడుతున్నాయి.

రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కి లు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు.. అమెరికా డాలర్లు ఇచ్చినంతకాలం జెలెన్ యుద్ధం చేస్తూనే ఉంటాడు అని ట్రంప్ కు జ్ఞాన బల్బ్ వెలిగింది..

అయితే ఎప్పటికైనా అమెరికా ఉక్రెయిన్ కు ఆర్ధిక సాయం ఆపేయొచ్చు అని జెలెన్ కు కూడా జ్ఞాన బల్బ్ వెలిగి ముందు జాగ్రత్త చర్యగా తనకు సాయం అందించే కొన్ని దేశాలతో చెలిమి పెట్టుకున్నాడు. 

బైడెన్ ఉన్నంతకాలం ఉక్రెయిన్ కు బాగా నడిచింది…ఇప్పుడు అమెరికా అధ్యక్షుడుగా వ్యాపార వేత్త అయిన ట్రంప్ వచ్చాడు.. ట్రంప్ ప్రతీదీ వ్యాపార కోణంలో ఆలోచిస్తాడు .. పైగా వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ సలహాల మీదే చాలావరకు నిర్ణయాలు తీసుకుంటున్నాడు.. ఇప్పుడు ట్రంప్ సైడ్ ఆలోచిస్తే అదే పనిగా సంవత్సరాలకు సంవత్సరాలు ఉక్రెయిన్ కు సాయం చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి?

మహా అయితే పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడని క్రెడిట్ రావొచ్చు.. దమ్మిడీ ఆదాయం లేకుండా ఏ వ్యాపార వేత్త కూడా పెట్టుబడులు పెట్టలేడు … ట్రంప్ కూడా అదే చేశాడు పైగా ట్రంప్ కు తిక్కుంది.. ఆ తిక్కకు లెక్కేలేదు..

అందుకే జెలెన్ ను పిలిపించి” అబ్బాయ్ ఇప్పటిదాకా ఆడుకుంది చాలు.. ఇక ఆ యుద్ధం ఆపేసి మీ దేశంలో ఉన్న ఆ ఖనిజాల గనులతో ఉమ్మడిగా వ్యాపారం చేసుకుందాం.. ఆ డబ్బులతో పాడైపోయిన నీ దేశ శిథిలాలను నువ్వు రిపేర్ చేసుకోవచ్చు.. ఆలాగే నీ యుద్ధం వల్ల ఇప్పటిదాకా మాకు వదిలిన చమురు ఎంతో కొంత వెనక్కి ఇవ్వొచ్చు ” అని మస్కోపదేశం చేశాడు..

ఇప్పుడు జెలెన్ డైలమాలో పడ్డాడు …ఉన్న పళంగా యుద్ధం ఆపేస్తే ఎవడూ రూపాయి ఇవ్వడు. పైగా రష్యా వాడు చేసిన డ్యామేజ్ ని రిపేర్ చేసుకోవాలంటే రాత్రికి రాత్రి అయ్యే పని కాదు ..కొంత టైమ్ పడుతుంది.. అంతేకాకుండా ఇప్పటికిప్పుడు యుద్ధం ఆపేస్తే ట్రంప్ సింగిల్ డాలర్ ఇవ్వకపోగా ఖనిజాల నిక్షేపాలు అంటూ వెంటపడతాడు.

వరదలొస్తేనే విరాళాలు అందుతాయి … అంతా బాగుంటే ఎవడు చెయ్యి విదిలిస్తాడు.. అందుకే టైమ్ తీసుకోవాలి ఇక్కడే జెలన్ ట్రిక్ ప్లే చేశాడు .. అమెరికా ప్రజల భావోద్వేగాలను క్యాష్ చేసుకునే ప్రయత్నం చేశాడు ..తమ దేశానికి చేసిన సాయానికి గానూ అమెరికా ప్రజలకు రుణ పడి ఉన్నానని భారీ సెంటిమెంటు అయింట్మెంట్ పూసాడు.

రష్యా వాడి నుంచి తమదేశాన్ని కాపాడతానని అమెరికా ఒట్టేసి చెప్తేనే ఖనిజాల ఫైల్ మీద సంతకాలు పెడతానని ఘాట్టిగా చెప్పాడు .. ఏతావాతా ఖనిజాల ఫైల్ మీద సంతకాలు పెట్టకుండానే ఎంచక్కా లేచి పోయాడు కాబట్టి ఈ ఎపిసోడ్ లో ఇద్దరూ కరెక్టే .. ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు. 

ఇందులో ట్రంప్ అహంకారం లేదు.. జెలెన్ గుండె ధైర్యం లేదు.. అంతా వ్యూహమే.. ఇది కాకుండా ఆ నాటో గొడవ ఒకటుంది …అది చాలదూ జెలన్ డ్రామాలు అడటానికి ..వీళ్లిద్దరి గొడవ చూసి ఫ్రాన్స్.. కెనడాలతో పాటు కొన్ని యూరప్ దేశాలు చంకలు కొట్టుకుంటూ జెలెన్ డోంట్ వర్రీ నీకు మేమున్నాం అంటూ ట్విట్లేసేశారు..

ఎందుకైనా మంచిదని జెలెన్ కూడా ఉక్రెయిన్ పోయి ట్రంప్ ను పొగుడుతూ ఓ ట్వీట్ పడేసాడు.. సరేలే ఇప్పుడు వీళ్ల గొడవ మనకెందుకంటారా ? మన మార్కెట్లు డౌన్ అవడానికి ఇది కూడా ఓ కారణం కాబట్టి !అదీ సంగతి.. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!