People want Dimple to be more active………………….
డింపుల్ యాదవ్ .. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సతీమణి.. మరో మాజీ ముఖ్యమంత్రి .. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కోడలు.. అఖిలేష్ .. డింపుల్ కాలేజీ రోజుల్లో ఫ్రెండ్స్ .. తర్వాత వారి స్నేహం పెళ్ళికి దారి తీసింది. మొదట్లో వీరి పెళ్ళికి పెద్దలు అంగీకరించలేదు. అఖిలేష్ నాయనమ్మ చొరవ తీసుకుని ఇరువర్గాలను ఒప్పించి పెళ్లి చేసింది.
ప్రస్తుతం డింపుల్ యూపీ లోని మైన్‌పురి లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. ములాయం సింగ్ యాదవ్ మరణించిన పిదప 2022 లో జరిగిన ఉప ఎన్నికల్లో 2.88 లక్షల ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.. మైన్‌పురి సమాజ్వాదీ పార్టీ కి కంచుకోట.
ఇక్కడ నుంచి బీజేపీ జైవీర్ సింగ్‌ను బరిలోకి దించగా, బీఎస్పీ నుంచి శివప్రసాద్ యాదవ్ పోటీ చేసారు.1996 నుంచి ఈ సీటును సమాజ్‌వాదీ పార్టీయే గెలుస్తోంది.మోడీ హవా లో సైతం ఆ పార్టీ ఈ సీటును నిలుపుకోగలిగింది. ఈ సారి ముక్కోణపు పోటీలో బీజేపీ ఈ సీటును గెలుచుకోవాలని ప్రయత్నిస్తోంది.
ఇక్కడ బీజేపీ కూడా బలంగానే ఉంది. ప్రతి ఎన్నికలోనూ 3 లక్షల ఓట్లు ఆ పార్టీకి వస్తున్నాయి. ఈ స్థానం లో హోరాహోరీ పోరు జరిగినట్టు చెబుతున్నారు. మే 7 న ఇక్కడ పోలింగ్ జరిగింది.
డింపుల్ 2009 లో రాజకీయాల్లోకి వచ్చారు. 2009 లోక్‌సభ ఎన్నికలలో కన్నౌజ్, ఫిరోజాబాద్ రెండు లోకసభ నియోజకవర్గాలనుండి అఖిలేష్ యాదవ్ పోటీ చేసి గెలిచారు. గెలిచిన రెండింట్లో ఒకటే ఉంచుకోవాలి కాబట్టి కన్నౌజ్ ను కావాలనుకున్నారు.
దీంతో ఫిరోజాబాద్‌లో నవంబర్ 2009 లో ఉప ఎన్నిక జరిగింది. అప్పట్లో అక్కడ హోరాహోరీ పోరు జరిగింది. సమాజ్వాది పార్టీకి కాంగ్రెస్ కి ఇప్పటిలా సఖ్యత లేదు. నాడు అనుకోకుండా అఖిలేష్ తన భార్య డింపుల్ యాదవ్ ను రాజకీయాల్లోకి దించారు.
కాంగ్రెస్ బాలీవుడ్ నటుడు రాజ్ బబ్బర్ ను బరిలోకి దించింది. అంతకు ముందు ఎస్పీ లో ఉన్నరాజ్ బబ్బర్ కాంగ్రెస్ లో చేరి పోటీ కి దిగారు. అప్పట్లో డింపుల్ యాదవ్ ప్రచారానికి ఎస్పీ ప్రముఖుడు అమర్ సింగ్ నాయకత్వం వహించారు. రాజ్ బబ్బర్ తరపున ప్రచారం కోసం గోవిందా, సల్మాన్ ఖాన్ లాంటి హీరోలు రంగంలోకి దిగారు.
సమాజ్వాదీ పార్టీ ప్రచారానికి సంజయ్ దత్, జయప్రద, జయా బచ్చన్‌లను అమర్ సింగ్ తీసుకొచ్చారు. పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సమాజ్వాదీ పార్టీ ర్యాలీలో అమర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం సృష్టించాయి. ముస్లిం ఓటర్లలో ఒక వర్గాన్ని పార్టీకి దూరం చేశాయి.. నాటి ఎన్నికలో రాజ్ బబ్బర్ 85,343 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఈ ఓటమి అఖిలేష్ యాదవ్ .. అమర్ సింగ్ మధ్య సంబంధాలను కూడా దెబ్బ తీసింది. అమర్ సింగ్ ను చివరికి పార్టీ నుండి బహిష్కరించారు.
డింపుల్ 2012లో కన్నౌజ్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, అఖిలేష్ యూపీ శాసన మండలిలో ప్రవేశించడానికి కన్నౌజ్ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక ప్రకటించారు.
అప్పట్లో సంయుక్త్ సమాజ్ వాదీ దళ్ అభ్యర్థి దశరథ్ సింగ్ శంక్వార్.. ఇండిపెండెంట్ అభ్యర్థి సంజు కటియార్ తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు బరిలోకి దిగలేదు. దీంతో డింపుల్ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఆ తర్వాత 2014 లో అక్కడి నుంచే మళ్ళీ పోటీ చేసి గెలిచారు. 2019 లో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.
ఎంపీగా డింపుల్ యాదవ్ పనితీరు పట్ల నియోజకవర్గ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసున్నారు .. అదే సమయంలో మరింత చురుగ్గా ఉండాలని సూచిస్తున్నారు.