ఆపాత్ర ఆయన కోసమే పుట్టిందా ?

Sharing is Caring...

Subramanyam Dogiparthi………………………..

త్రివేణి ప్రొడక్షన్స్‌ వారి ‘బడిపంతులు’ ఎన్టీఆర్ నటించిన గొప్ప చిత్రాల్లో ఒకటి అని చెప్పుకోవచ్చు. పాత్ర నచ్చితే ఎన్టీఆర్ .. అందులో జీవిస్తాడు. ఈ సినిమాలో కూడా అంతే. కన్నీరు పెట్టకుండా సినిమా పూర్తిగా చూడలేం.. కన్నడం, మలయాళం, హిందీ భాషలలో బి.ఆర్‌.పంతులు నిర్మించి .. హిట్ కొట్టిన  ‘స్కూల్‌ మాస్టర్‌’  చిత్రానికి తెలుగు రీమేక్‌ ఇది. 

ఎన్‌.టి.ఆర్‌  అంజలీదేవి ప్రధాన పాత్రల్లో నటించారు. బిడ్డలు తల్లితండ్రుల్ని పంచుకునే  అంశాన్ని ఆర్ధ్రంగా తెరకెక్కించిన సినిమా ఇది. కుటుంబ సంబంధాలు ఎంత దౌర్భాగ్య స్థితికి చేరుకున్నాయో ఈ సినిమా తెలియ జేస్తుంది.  ఈ చిత్రంలో ఎన్‌.టి.రామారావు బడిపంతులు రాఘవరావుగా జీవించారు. ఆ పాత్ర ఆయన కోసమే పుట్టుకొచ్చిందా అనిపిస్తుంది. 

1962 లో భీష్ముడిగా వయసు మళ్ళిన పాత్ర వేసిన తర్వాత పదేళ్ళకు అంటే 1972 లో బడి పంతులుగా NTR  ఒక వృద్ధుడి పాత్రలో  గొప్పగా నటించారు , మెప్పించారు. మధ్య వయసు మాస్టారిగా ప్రారంభమైన పాత్ర రిటైర్ అయి , వయసు మళ్ళిన పాత్రగా ముగుస్తుంది.బడి పంతులుగా బాధ్యత , తండ్రిగా బాధ్యత సంపూర్ణంగా నిర్వహించాక పుత్ర రత్నాల చేతిలో పడి దంపతులు ఎలా బాధపడ్డారో దర్శకులు పి చంద్రశేఖరరెడ్డి బాగా చూపారు. 

పుత్ర రత్నాలు , కోడళ్ళు తల్లిదండ్రులను మోసం చేసి ఆస్తులు వ్రాయించుకోవటం , వీధిన పడేయటం , విడదీయటం వంటి కధాంశాలతో చాలా సినిమాలు వచ్చాయి . అన్నీ చాలావరకు విజయాన్ని సాధించాయి. అయితే ఈ బడి పంతులు సాధించిన విజయం ఘన విజయం. స్క్రీన్ ప్లే , ఎమోషన్ డ్రామాలను పండించటంలో నటీనటుల దర్శకుడి కష్టం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది.

ముఖ్యంగా NTR , అంజలీదేవి నటన సూపర్బ్ . వయసు మళ్ళిన ప్రేక్షకులు కంట తడి పెట్టాల్సిందే.  భార్య తనకు రాసిన ఉత్తరం చదవాలని  ఆతృతలో ఉండగా .. కళ్లద్దాలు పగిలిపోతాయి.  ఆ పగిలిన అద్దంతోనే ఎన్‌.టి.ఆర్‌. ఉత్తరం చదివే సన్నివేశం ప్రేక్షకుల్ని కదిలిస్తుంది. ఈ చిత్రంలోని ఎన్టీఆర్ నటనకు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నారు. ఇదే చిత్రాన్ని ఆ తర్వాత జెమినీ గణేశన్‌, షావుకారు జానకి ప్రధాన ప్రాతలుగా తమిళంలో తీశారు.

‘కూరిమి కలవారందరు కొడుకులేనురా , జాలి గుండె లేని కొడుకులు కూతుళ్ళ కన్న కుక్క మేలురా’ పాట లోని ఈ మాట ఈ సినిమాలో చూస్తాం . కొడుకులు ఇల్లు తాళమేస్తే , ఎప్పుడో చదువుకున్న విద్యార్ధి విశ్వాసంతో ఆ ఇంటిని వేలంలో కొని , బడి పంతులికి సమర్పించుకుంటారు . ఒక ఉపాధ్యాయునిగా నాకూ ఇలాంటి పూర్వ విద్యార్థులు తారసపడుతుంటారు . ఎంతో సంతోషాన్ని , సంతృప్తిని ఇస్తుంటాయి .
విశ్వాసం కల విద్యార్ధిగా జగ్గయ్య , అతని భార్యగా జానకి , కొడుకులుగా రామకృష్ణ , కృష్ణంరాజు , కోడళ్ళుగా జయంతి , విజయలలిత , కూతురిగా టి పద్మిని , అల్లుడిగా రాజబాబు చక్కగా నటించారు . ఇతర పాత్రల్లో అల్లు రామలింగయ్య , సూర్యకాంతం ప్రభృతులు నటించారు.  మరీ ముఖ్యంగా చెప్పుకోవలసింది అతిలోకసుందరి శ్రీదేవి మనమరాలిగా ఆరిందా లాగా నటించింది.  

ఆరుద్ర వ్రాసిన ‘బూచాడమ్మా బూచాడు బుల్లి పెట్టెలో ఉన్నాడు’  అనే టెలిఫోన్ మీద పాటలో బేబీ శ్రీదేవి అభినయం చాలా గొప్పగా ఉంటుంది .ఈ సినిమా విజయానికి మరొక ముఖ్య కారణం కె వి మహదేవన్ సమకూర్చిన సంగీతం. పాటలన్నీ వీర హిట్.  ఆత్రేయ వ్రాసిన భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు , పిల్లము బడి పిల్లలమూ , నీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి.

నీ నగుమోము నా కనులారా కననిండు పాటలో ఆర్ద్రత , అంజలీదేవి నటన వర్ణించటానికి మాటలు చాలవు . అలాంటి అనుబంధం , ప్రేమ ఉన్న భార్యాభర్తలకే అర్థం అవుతుంది . ఓరోరి పిల్లగాడ వగలమారి పిల్లగాడా , రాక రాక వచ్చావు రంభ లాగ ఉన్నావు , నిన్న మొన్న రేకు విప్పిన , ఎడబాటెరగని పుణ్య దంపతుల విడతీసింది విధి నేడు పాటలు కూడా బాగుంటాయి . డి వి నరసరాజు సంభాషణలను కూడా ప్రత్యేకంగా మెచ్చుకోవాలి. 

మరాఠీ రచయిత విష్ణు వామన్ శిర్ వాడకర్  నవల వైష్ణవి ఆధారంగా కన్నడంలో బి ఆర్ పంతులు స్కూల్ మాస్టర్ నిర్మించారు.  ఇదే కధతో 2003 లో అమితాబ్ , హేమమాలినిలతో బాగ్ బన్ సినిమా తీసారు. వంద రోజులు ఆడి కమర్షియల్ గా కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది.   టీచర్స డే నాడు ఏదో ఒక చానల్లో ఇప్పటికీ వస్తూనే ఉంటుంది ఈ సినిమా . మా నరసరావుపేటలో వెంకటేశ్వర పిక్చర్ పేలస్ చూసా . టి విలో చాలాసార్లు చూసా . యూట్యూబులో ఉంది . చూడని వాళ్ళు తప్పక చూడండి . ముఖ్యంగా క్రూర కూతుళ్ళు , కొడుకులూ తప్పక చూడాలి .

 

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!