ఎవరీ మరియా కొరీనా మచాడో ?

Sharing is Caring...

Nobel Peace Prize 2025 ……………..

ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి ఈ ఏడాది ‘మరియా కొరీనా మచాడో’ను వరించింది. వెనిజులాకు చెందిన మరియా కొరీనా ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం పోరాడినందుకు గానూ ఈ పురస్కారం లభించింది. ఈ ఏడాది మొత్తం 338 మంది ఈ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు. వారిలో మరియా ను కమిటీ ఎన్నుకుంది.

ప్రజాస్వామ్య సాధన కోసం శాంతి మార్గంలో ఆమె విశేష కృషి చేశారని అవార్డు కమిటీ తెలిపింది.ఈ క్రమంలో మరియా ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నారని.. గత ఏడాది కాలంగా అజ్ఞాతంలో జీవించారని కమిటీ ప్రకటించింది. 

మరియా వెనిజులా పార్లమెంట్ సభ్యురాలిగా, దేశ విపక్ష నేతగా పనిచేశారు.వెనిజులా సైనికీకరణను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు.శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం కృషిచేసి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.

గత సంవత్సరం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా మరియా పై నేషనల్ ఎలెక్టోరల్ కౌన్సిల్ నిషేధం విధించింది. ఈ క్రమంలో మదురో మూడవసారి గెలిచారు. మరియా ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ప్రతిపక్షాలను ఏకం చేసింది.

ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థి ఎడ్ముండో గొంజాలెజ్ కి లక్షలాది మంది వెనిజులా ప్రజలమద్దతును కూడగట్టడం లో మరియా విజయం సాధించింది.58 యేళ్ల మరియా కొరినా మచాడో ఇంజనీరింగ్ చదువుకున్నారు.

ఆమె రాజకీయాల్లో కొనసాగడం భర్త రికార్డో సోసా బ్రాంగర్  కు ఇష్టం లేదు.ఈ క్రమంలో ఆ దంపతులు కొన్నేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. మచాడో కి హెన్రిక్,రికార్డో, అనా కొరినా అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరిలో ఇద్దరు భద్రత రీత్యా విదేశాల్లో ఉన్నారు.

నోబెల్ శాంతి బహుమతిని 1901 నుంచి 105 సార్లు ప్రకటించారు. ఇందులో 111 మంది వ్యక్తులు, 31 సంస్థలు ఇప్పటివరకు ఈ పురస్కారాన్ని అందుకున్నాయి. ఈ అవార్డు అందుకున్న అతిపిన్న వయస్కురాలిగా పాకిస్థాన్ కి  చెందిన హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్ జాయ్ నిలిచారు. జోసెఫ్ రాట్ బ్లాట్ 86 ఏళ్ల వయసులో ఈ పురస్కారం అందుకున్నారు.

స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త, ఆవిష్కర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ కోరిక మేరకు 1901 నుంచి ఈ అవార్డు ఇవ్వడం ప్రారంభమైంది. మానవాళికి ప్రయోజనం చేకూర్చుతూ పాటుపడిన శాంతి, సాహిత్యం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యం, ఆర్థిక శాస్త్ర రంగాల వారికి అవార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

తన మరణానికి ఒక సంవత్సరం ముందు, 1895 నవంబర్ 27న తన వీలునామాపై సంతకం చేసిన ఆల్ఫ్రెడ్ నోబెల్, తన సంపదలో ఎక్కువ భాగాన్ని, SEK 31 మిలియన్లకు పైగా (ఇపుడు  సుమారు SEK 2.2 బిలియన్లు) సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టారు.

ఆ పెట్టుబడి నుంచి వచ్చిన ఆదాయాన్ని ఏటా మానవాళికి గణనీయంగా ప్రయోజనం చేకూర్చిన వారికి బహుమతులుగా పంపిణీ చేసేలా వీలునామాలో రాశారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ఆధారంగా పైన ప్రస్తావించిన  ఆరు రంగాల్లో విశేష కృషి చేసినందుకు నోబెల్ బహుమతి అందివ్వడం ఆనవాయితీగా వస్తుంది.ఈ అవార్డును డిసెంబర్‌లో స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో ప్రదానం చేస్తారు. 

నోబెల్ బహుమతి పొందిన వారికి భారీ మొత్తంలో ప్రైజ్ మనీ గా  రూ. 10,25,49,656.00  దక్కుతుంది. ఈ అత్యున్నత పురస్కారం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు.   

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!