ఆమె అన్నను అనుసరించింది..కోట్లు సంపాదించింది.చీకటి సామ్రాజ్యానికి కొడుకు ను రాజును చేయాలనీ కలలు కన్నది. అతగాడు ప్రమాదంలో చనిపోయాడు.రెండో కొడుకు తల్లి బాటలో నడిచేందుకు సుముఖత చూపలేదు. ఎవరామె ? ఆమె పేరే హసీనా.
చాలామందికి ఈవిడ ఎవరో తెలియదు . ముంబాయి పోలీసులను ముప్పతిప్పలు పెట్టించిన మహిళా డాన్ ఈమె. డిఫరెంట్ స్టైల్ లో అనుచరులచేత పనులు చేయించుకునేది. ఇంతకూ ఈ లేడీ డాన్ ఎవరో కాదు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సొంత చెల్లెలు. దావూద్ తండ్రి ముంబయిలో హెడ్ కానిస్టేబుల్ గా చేసేవాడు. ఆయన ఏడవ సంతానం హసీనా.
హసీనా ఇబ్రహీం పార్కర్ ను పెళ్లి చేసుకుని తన కాపురమేదో తాను బుద్ధిగా చేసుకుంటున్నది. ఈ క్రమంలో ఆమె జీవితంలో విషాద సంఘటన చోటు చేసుకుంది.1992 లో దావూద్ పై కోపంతో అరుణ్ గావ్లీ తన అనుచరులు దయానంద్ పూజారి మరి కొందరి సహాయంతో హసీనా భర్త పార్కర్ను చంపేశారు.అంతకుముందు అరుణ్ గావ్లీ, రామానాయక్ తదితరులు దావూద్ ఇబ్రహీం తో కలసి పనిచేసేవారు.
వీరంతా పోలీసుల కళ్లుగప్పి స్మగ్లింగ్ లో చురుగ్గా ఉండేవారు. భూముల కబ్జా వ్యవహారంలో వీరి మధ్య విభేదాలు వచ్చాయి. ఒకరిపై ఒకరు ప్రతీకార చర్యలకు దిగారు. అందులో భాగంగానే హసీనా భర్తను కాల్చేశారు.దావూద్ గ్యాంగ్ తిరిగి అరుణ్ గావ్లీ సోదరుడు బప్పా మరికొందరు అనుచరులను చంపేశారు. దావూద్ 93 లో బాంబు పేలుళ్ల తరవాత దేశం విడిచి పారిపోయాడు. ఈక్రమంలో పోలీసుల నుంచి ఆమె తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంది.
తర్వాత మెల్లగా హసీనా అండర్ వరల్డ్ కార్యకలాపాల్లోకి ఎంటర్ అయింది. అప్పట్లో ముంబయి సమీపం లోని నాగ్ పాడ్ లోని గోల్డెన్ అపార్టుమెంట్స్ లో హసీనా ఉండేది. అక్కడ నుంచి ముంబాయికి మకాం మార్చింది. అన్న దావూద్ ఇబ్రహీం చెప్పాడో లేక తనే అన్న ను చూసి స్ఫూర్తి పొందిందో తెలీదు కానీ డాన్ గా మారింది.
అంతకుముందు దావూద్ దగ్గర పనిచేసిన వాళ్ళను చేరదీసి ఒక గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకుంది. మెల్లగా దందాలు మొదలెట్టింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించడం, భూములు ఆక్రమించడం , డబ్బులు దండుకోవడం వంటి పనులనుంచి హవాలా కార్యకలాపాలు చేసే వరకు ఎదిగింది.
మిడిల్ ఈస్ట్ నుంచి ఇండియాకు ,ఇతర దేశాలకు మనీ ట్రాన్స్ఫర్ చేసే వ్యక్తులతో సంబంధాలు పెట్టుకుంది.ముంబాయి వ్యాపార వర్గాల వ్యవహారాల్లోకి దూసుకెళ్లింది. ఇంకా డ్రగ్స్ సరఫరా,ఇతర సెటిల్మెంట్ విషయంలో తన సత్తా చాటుకుంది. కొన్ని చోట్ల తన అన్న దావూద్ పేరు కూడా వాడుకుంది.
పోలీసులకు దొరక్కుండా తప్పించుకునేది. అన్న తరహాలోనే బాలీవుడ్ సినీ పరిశ్రమ పై పట్టు సాధించే ప్రయత్నాలు చేసింది. నిర్మాతలను బెదిరించి సినిమా రైట్స్ రాయించుకునేది.పోలీసులు దావూద్ తో హసీనా కు సంబంధాలు లేవని చెబుతారు.కానీ రహస్యంగా హసీనా దావూద్ తో మాట్లాడేదని స్థానికులు అంటారు.
స్వల్పకాలం లోనే ఆమె ఆస్తుల విలువ సుమారు 5 వేల కోట్లకు చేరుకున్నాయి.మెల్లమెల్లగా ముంబాయిలో హసీనా జోరు పెంచాలని ప్రయత్నించింది. అయితే పోలీస్ నిఘా బాగా పెరగడంతో ఆమె అనుకున్నట్టు జరగలేదు.
హసీనా పై మొత్తం 88 కేసులు నమోదు కాగా ఒక్కసారి మాత్రమే కోర్టుకు హాజరయ్యారు.పోలీసులు కళ్ళు కప్పి చాకచక్యంగా తప్పించుకుని తిరిగేది. అయినా అనుక్షణం భయంతోనే బతికింది.
పోలీసుల వేధింపులు బాగా పెరగడంతో ఒక దశలో విదేశాలకు పారిపోవాలని ప్రయత్నించింది. పాస్ పోర్ట్ పోగొట్టుకుని కొత్త దాని కోసం అప్లై చేయగా హసీనా దావూద్ సోదరి అని గమనించి, ఆమె పై కేసులు పరిశీలించి పాస్ పోర్ట్ జారీ చేయడానికి అధికారులు నిరాకరించారు.దాంతో ముంబాయిలో హసీనా ఉండిపోయింది.
ఇక 2006 లో హసీనా కుమారుడు డానిష్ పార్కర్ రోడ్డు ప్రమాదంలోమరణించారు. ఒక చిన్న కేసులో ఇరుకున్న డానిష్ పార్కర్ అంతకుముందు వారం నుంచి తల్లికి కూడా కనబడలేదట. అతగాడు చనిపోవడంతో హసీనా ఆశలు తల కిందులయ్యాయి.అతగాడిని చీకటి సామ్రాజ్యానికి రాజుని చేయాలని హసీనా భావించింది. అయితే ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. మనోవ్యధతో కొన్నాళ్ళు మంచాన పడింది.
అదే సమయంలో ఒక రియల్ ఎస్టేట్ ఏజంటుని బెదిరించిన కేసులో ఇరుక్కుంది. పోలీసులు నెల తరబడి వేధించారు. చివరికి బెయిల్ తెచ్చుకుని బయటపడింది. అపుడే అన్నదావూద్ కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండమని సూచించారు. అక్కడనుంచి ఆమెను వ్యాపారవర్గాలు పట్టించుకోవడం మానేశాయి. ఇతర గ్రూపులు పుంజుకోవడంతో హసీనా రేసులో వెనుకబడింది. పోలీసులు ఆమె అనుచరులను పలుకేసుల్లో ఇరికించి అరెస్ట్ చేసారు.
అప్పట్లో హసీనా రెండో కుమారుడు అలీషా పార్కర్ ఈ అండర్ వరల్డ్ కార్యకలాపాలపట్ల అంత సుముఖత చూపలేదు. అలా అలా హాసీనా అండర్ వరల్డ్ కార్యకలాపాలకు దూరమై 2014 లో గుండె పోటుతో మరణించింది. ఇక ఈమె జీవితాన్నేకొన్ని మార్పులు .. చేర్పుల తో హాసీనా పార్కర్ పేరిట సినిమాగా తీశారు.
సినిమా పెద్దగా ఆదరణ పొందలేదు. తొలుత కుటుంబ సభ్యులు సినిమాకు అనుమతి ఇవ్వలేదు. కానీ దర్శకుడు అపూర్వ లఖియా వారిని ఒప్పించి సినిమా తీశారు. శ్రద్దాకపూర్ హసీనా పాత్రలో నటించింది. సినిమా ఆసక్తికరంగా రూపొందలేదనే విమర్శలు వచ్చాయి. యు ట్యూబ్ లో సినిమా ఉంది … ఆసక్తి గలవారు చూడవచ్చు.
————- KNM