Kankipati Prabhakar…………………………………….
కాగడా శర్మ … ఈయన గురించి ఈ తరం పాఠకుల్లో ఎక్కువమందికి తెలియదు. కాగడా శర్మ వృత్తి రీత్యా జర్నలిస్టు .. రచయిత .. పబ్లిషర్. 1965 —1980 మధ్యకాలంలో “కాగడా ” పత్రిక ఒక సంచలనం.అప్పట్లో దాన్నిచదవని పాఠకులు అరుదు అనే చెప్పుకోవాలి. ఆ పత్రికను నడిపింది ఈ కాగడా శర్మే.
ఈ కాగడా శర్మ పూర్తి పేరు కొక్కేరగడ్డ కామేశ్వర శర్మ. రాజమండ్రి కి చెందినవాడు. బాగా చదువుకున్నవాడే. అసలు కాగడా పత్రిక ను ప్రారంభించింది ప్రముఖ రచయిత తాపీ ధర్మారావు. ఆయన కొంత కాలం నడిపి ఆపేసారు. అలా తాపీ వారి దగ్గర టైటిల్ తీసుకుని తన స్టైల్ లో శర్మ కాగడా పత్రికను నడిపాడు. కాగడా లో ఎక్కువగా సినిమా వార్తలు . సమీక్షలు ..సినీతారల ఫోటోలు వాటి కింద శర్మ వ్యాఖ్యానాలు, ప్రశ్నలు ..జవాబులు శీర్షికలు ఉండేవి.
టాబ్లాయిడ్ సైజు లో వచ్చే ఆ పత్రికలో వచ్చే రాతలన్నీ దాదాపుగా శర్మ ఒక్కరివే కావడం విశేషం. తారల ఫోటో వేసి వాటికి శర్మ తనదైన శైలిలో మషాలా దట్టించి వ్యాఖ్యానాలు రాసేవాడు. ఆయన రాసే అంగాంగ వర్ణనలు యువతను గిలిగింతలు పెట్టేవి.. అదే సమయంలో ఆయన రాతల బారిన పడ్డ తారలకు శర్మ గొంతు పిసికేయాలన్నంత కోపం వచ్చినా .. ఆ రాత ల్లోని ఘాటైన అతి వాస్తవాలకు ..సరదాగా నవ్వుకొని చిలిపి సచ్చినోడా అని ముసిముసి నవ్వులతో ప్రక్కకు పోయిన సందర్భాలే ఎక్కువని సినీ పరిశ్రమలో చెప్పుకునే వారు.
కాగడా శర్మ రాతల గురించి నాటి సినిమా పరిశ్రమతో పాటు అప్పటి పాఠకులకు పెద్ద ఆసక్తి ఉండేది. ఆరోజుల్లో కాగడా శర్మ ఎన్టీఆర్ పై విపరీతమైన విమర్శలు చేసేవారు. అందరు హీరోల చిత్రాలు విడుదలయ్యాక పోస్టు మార్టం పేరిట ఆ సినిమాలని దుయ్యబట్టేవారు. చివరికి ఆయన రాతలకు భయపడి పలువురు శర్మకు దూరంగా ఉండేవారు. ఎన్టీఆర్ మాత్రం మానసిక వేదనకు గురైనారని అప్పట్లో చెప్పుకునేవారు. ప్రముఖ నిర్మాత యు. విశ్వేశ్వర రావు తో కొన్నాళ్ళు సఖ్యంగా ఉన్న శర్మ తర్వాత ఆయనకు దూరమైనారు. అప్పటినుంచే ఎన్టీఆర్ పై విమర్శలు మొదలెట్టారు.
సినిమాల గురించి విమర్శలు చేస్తే అదేదో సినిమా జర్నలిజం అనుకోవచ్చు.కానీ, వ్యక్తిగతంగా ఎన్టీఆర్ ను టార్గెట్ చేశారు. ‘తెరపై వేంకటేశ్వరుని చరిత్ర’ పేరిట ఒక సీరియల్ అచ్చేశారు. అందులో అప్పటి ఓ హీరోయిన్ తో ఎన్టీఆర్ ప్రేమాయణం సాగించిన తీరుని గురించి రాసేవారు.ఎన్టీఆర్ ఆయనతో సినిమాలు నిర్మించే నిర్మాతలు ఈ రాతలను జీర్ణించుకోలేక పోయేవారు.
ఇక అక్కినేని ని కూడా శర్మ వదలలేదు. అక్కినేనికి శర్మ పేరు అంటేనే కారం రాసుకున్నట్లు ఉండేదని అప్పట్లో చెప్పుకునే వారు. కాగా హాస్యనటుడు రేలంగికి మద్యపానం, ధూమపానం వంటి వ్యసనాలు లేవు. ఒకసారి శర్మ తనపత్రికలో ‘రేలంగి తాగి తందానా లాడతాడు’ అంటూ తనదైన భాషలో ఒక కథనం రాశాడు.
ఆ తర్వాత ఒక రోజు స్టూడియోలో షాట్ బ్రేక్‌లో కాగడా శర్మ రేలంగికి ఎదురయ్యాడు. వెంటనే రేలంగి అతడి చెంప చెళ్లు మనిపించేలా నాలుగు పీకాడు. పోలీసు కేసు పెడతానని బీరాలు పలికిన కాగడా శర్మను సహచర జర్నలిస్టులు చీవాట్లు పెట్టారు. అప్పటినుంచి కాగడా శర్మకు రేలంగి అంటే హడల్. ఆ తర్వాత రేలంగి గురించి ఒక్కముక్క కూడా రాయలేదు.
సంచలన వార్తలకు, అవాస్తవమైన రాతలకు, ఎల్లో జర్నలిజానికి ‘కాగడా’పత్రిక పెట్టింది పేరు అని అప్పట్లో సినిమా పెద్దలు దుమ్మెత్తి పోసేవారు కానీ కొన్ని వార్తలు ముఖ్యం గా తెర వెనుక విషయాలు శర్మ కరెక్టు గానే రాసే వాడని సినిమా పరిశ్రమ కు చెందినవారే అనేవాళ్ళు. రావూరి భరద్వాజ రాసిన పాకుడు రాళ్లు నవలలో కాగడా శర్మ పాత్ర వేరే పేరుతో తారస పడుతుంది.
ఇక కొంతమంది సినీ తారలు శర్మ ను సంప్రదించి కావాలనే తమ గురించి గాసిప్ కథనాలు రాయించుకునే వారట. అలాగే తమ ఫోటోల కింద శృంగార వ్యాఖ్యానాలు కూడా రాయించుకునేవారని అంటారు. జయమాలిని అలా ఎక్కువగా తన గురించి రాయించుకున్నారని అంటారు. ఉత్తరాది పత్రికల్లో ఈ తరహా కథనాలు ఎక్కువగా వచ్చేవి. దక్షిణాదిలో కాగడా శర్మ వాటిని అందిపుచ్చుకున్నారు. ఒకసారి “మెరీనా బీచ్ లో జగ్గయ్య .. జమున ” అంటూ ఒక కథనం రాస్తే పరిశ్రమలో పెద్ద సంచలనం అయిందట.
అందరు హీరోలను విమర్శించిన కాగడా శర్మ హీరో కృష్ణ గురించి ఏమీ రాసే వాడు కాదు. అదే విషయం అడిగితే కృష్ణది క్లీన్ క్యారెక్టర్ అని చెప్పుకొచ్చే వాడు. ఎవరో ఒక పాఠకుడు ..నటీనటులందరి మీదా ఇంత ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు కదా .. ఎవరైనా మీ ఉపాధికి హాని తలపెడితే .. అని ప్రశ్నిస్తే నటుడు కృష్ణ తాను కాల్చే 555 సిగరెట్లు నాదగ్గరే కొంటానని మాటిస్తే .. నేను కిళ్ళీ షాప్ పెట్టుకుని కృష్ణ గారికి సిగిరెట్లు అమ్ముకొని బతుకు ఈడుస్తాను గానీ నా రాతల్లో వాడిని తగ్గించను అని చెప్పాడు .
కొన్నాళ్ళు శర్మ ‘కిష్కింధ’ అనే రాజకీయ పత్రికను కూడా నడిపారు. అది అంతగా క్లిక్ అవలేదు. మొహమాటం, హిపోక్రసీ కి ఆమడ దూరంలో వుండే శర్మ ఆల్కహాలిస్ట్ . తన రాతల్లోనూ ఆ విషయం ఎప్పుడూ దాచుకోలేదు. నటుడు కళావాచస్పతి జగ్గయ్య పుట్టిన రోజు డిసెంబర్ 31 .. అటు సంవత్సరాంతపు కేరింతలూ ఇటు పుట్టిన రోజు వేడుకలూ కలిసివచ్చే రోజు కనుక .. మందుపార్టీ మహత్తరంగా.. కళాత్మకంగా జరుగుతుంది అని ఎప్పుడూ ప్రస్తావించేవాడు..చివరకు అదే డిసెంబర్ 31 న శర్మ కనుమూశాడు.
కాగడా శర్మ గురించిన వ్యాసం సమగ్రమ్, సినీనటి జానకి ని చిత్ర సీమకు పరిచయం చేసింది కూడా శర్మ గరే నంటారు.
ఆరోజుల్లో కాగడా కోసం ఎదుచూసేవారం హిందు నేషన్ పత్రిక లాగా…
యూవీరత్నం