తమిళనాట దూసుకు పోయేదెవరో ?

Sharing is Caring...

తమిళ నాట ఎన్నికలు  త్వరలోనే జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరు దూసుకుపోతారో ? ఏమో కానీ ప్రధమ ఒపీనియన్ పోల్ వాతావరణం స్టాలిన్ కి అనుకూలంగా ఉందని చెబుతోంది. ఎన్నికల నగారా మోగిన తర్వాత ఏబీపీ సీ-ఓటర్‌ నిర్వహించిన ఒపీనియన్‌ పోల్‌లో తేలిన ఆసక్తికరమైన ఫలితాలు ఇలా ఉన్నాయి. ఇది ఇప్పటి ప్రజల మూడ్.   ఎన్నికల సమయంలో మారడానికి కూడా అవకాశాలున్నాయి. ఒపీనియన్ పోల్స్ నిజం కావాలని రూలేమీ లేదు. ఈ పోల్స్ అసలైన ట్రెండ్ లేదా ఓట్లర్ల అంతర్గత ఆసక్తిని ఒక్కోసారి బయటపెట్టవు. తమిళనాట ఫలితాలు కింది విధంగా ఉండొచ్చు.

డీఎంకే స్టాలిన్ నేతృత్వంలోని యూపీఏ కూటమికి 154 నుంచి 162 సీట్లు రావచ్చని తేలింది. అన్నాడీఎంకే ఎన్డీయే కూటమికి 58నుంచి 56 సీట్లు రావచ్చని చెబుతున్నారు. అదే జరిగితే అది అన్నాడీఎంకే కు అది గట్టి దెబ్బగా భావించవచ్చు. కమల్‌ హాసన్ పార్టీ  మక్కల్‌ నీది మయ్యమ్‌ కు 2నుంచి 6 సీట్లు వచ్చే అవకాశాలున్నాయని తేలింది.

ఇక కమల్ హాసన్ చిన్నపార్టీలతో ఒక ఫ్రంట్ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఎంత మంది కలసి వస్తారో తేలలేదు. అన్నా డీఎంకే మాజీ ఎమ్మెల్యే పాల కరుపయ్య కమల్ పార్టీలో చేరారు. ఈయనకు టిక్కెట్ ఇవ్వొచ్చు. నటుడు శరత్ కుమార్ కమల్ హాసన్ తో సంప్రదింపులు చేస్తున్నారు. అయన భార్య నటి రాధికా చిన్నమ్మ ను కలిసినట్టు వార్తలు వస్తున్నాయి.

సూపర్ స్టార్ రజనీ కాంత్  పార్టీ పెట్టేది లేదని స్పష్ష్టం చేయడంతో డీఎంకే నేత స్టాలిన్ ఊపిరి పీల్చుకుని ఉదృతం గా ప్రచారం చేస్తున్నారు.  అన్నాడీఎంకే అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతోంది. అధికారంలో ఉన్నా.. బలమైన నాయకత్వం మాత్రం ఆ పార్టీకి లేదు. ముఖ్యమంత్రి పళని స్వామి, పన్నీరు సెల్వం వర్గాల మధ్య పొసగడం లేదు.ఇక కమల్ హాసన్ పార్టీని ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారో సందేహమే. ఆ పార్టీకి బలమైన క్యాడర్ లేదు. ఈ అంశాలన్నీ తనకు కలసి వస్తాయని స్టాలిన్ అంచనా వేస్తున్నారు.  కాగా తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతు,మహిళలు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తానని స్టాలిన్ హామీ ఇచ్చారు. ఈ హామీ ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి. రజనీ కాంత్ పక్కకు తప్పుకోవడం స్టాలిన్ కి ప్లస్ అవ్వొచ్చని  రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అది ఎంతవరకు నిజం అవుతుందో వేచి చూడాలి. డీఎంకే కి బలమైన క్యాడర్ ఉంది. పార్టీ కార్యకర్తలు మంచి కసి మీద ఉన్నారు. అధికారం నుంచి వైదొలగి పదేళ్లు అవుతుంది.

కాగా పళని స్వామి సర్కార్ వన్నియర్ల పై వరాల వర్షం కురిపించింది. విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలలో వన్నియార్ల కు 10.5 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న ప్రతిపాదనకు అసెంబ్లీ ఆమోద ముద్ర కూడా వేసింది. పైగా “పత్తాలి మక్కళ్ కచ్చి”తో అన్నాడీఎంకె పొత్తును కుదుర్చుకుంది. ఈ పార్టీలో వన్నియార్ కులస్తులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. పత్తాలి మక్కళ్ కచ్చి , ఏఐఎడీఎంకే మధ్య సీట్ల సర్దుబాటు నేపథ్యంలో ఆ పార్టీ  25 సీట్లు కావాలని డిమాండ్ చేస్తోంది. 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో పీఎంకే కి ప్రాతినిధ్యం లేదు. ఉత్తర తమిళనాడులో బలమైన ఓటు బ్యాంకు ఉన్నఈ పార్టీ.. వన్నియార్ల ప్రయోజనాలకోసం పనిచేస్తున్నది. 2011 లో ఇది డీఎంకేతో పొత్తు పెట్టుకుని మూడు సీట్లు గెలుచుకుంది. కానీ 2016 లో జరిగిన ఎన్నికల్లో 30 స్థానాలకు పోటీ చేసి ఒక్క చోట కూడా గెలవలేకపోయింది. వారికో 10  సీట్లు ఇవ్వొచ్చు.అలాగే బీజేపీకి కూడా 20 సీట్లు కేటాయించవచ్చు అంటున్నారు. ఇప్పటికే రెండు పార్టీలమధ్య చర్చలు ముగిశాయి.

డీఎంకే కూడా కాంగ్రెస్ తో సీట్ల పంపిణీ కి సంబంధించి చర్చలు జరుపుతోంది. ఏప్రిల్ 6 న తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. మే 2 న ఫలితాలను ప్రకటిస్తారు. 

—————K.N.MURTHY   

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!