A strong leader…………………….
అజయ్ రాయ్ పార్లమెంట్ లో కాలు పెట్టాలని పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రతి ఎన్నికలో పోటీ చేస్తున్నారు. 2009 నుంచి పోటీ చేస్తున్నటికి విజయం దక్కించుకోలేకపోయారు. అయినా నిరాశ పడకుండా పోటీ చేసున్నారు.
భూమిహార్ల కుటుంబానికి చెందిన అజయ్ రాయ్ వారణాసిలో బలమైన నాయకుడు. 2012 నుండి భారత జాతీయ కాంగ్రెస్ లో ఉన్నారు. ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్.రాయ్ అనేకసార్లు తన పార్టీ అనుబంధాలను మార్చుకున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మూడు సార్లు వారణాసి నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. హ్యాట్రిక్ సాధించారు.మోడీ ది గుజరాత్ అయినప్పటికీ యూపీ నుంచి లోకసభకు ఎన్నికవుతున్నారు. 2014 లో మోడీ పోటీ చేసినప్పుడు ఆయన పై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీ వాల్..కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్ పోటీ చేశారు.
అప్పట్లో మోడీ 3,71,784 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.ద్వితీయ స్థానంలో నిలిచిన కేజ్రీ వాల్ కి 2లక్షల 9 వేల ఓట్లు వచ్చాయి.అజయ్ రాయ్ కి 75 వేల ఓట్లు వచ్చాయి. ఆతర్వాత 2019 లో మోడీ మళ్ళీ పోటీ చేశారు.అప్పుడు ఆయనకు 4,79,505 ఓట్ల మెజారిటీ వచ్చింది. 1,95,159 ఓట్లతో సమాజ్వాది పార్టీ అభ్యర్థి షాలిని యాదవ్ రెండో స్థానం లో నిలవగా కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ కి 152,548 ఓట్లు వచ్చాయి.
ఈయనకు 2014 లో కంటే 2019 లో పోటీ చేసినపుడు ఓట్లు పెరగడం విశేషం.మొదటి సారితో పోలిస్తే రెండో సారి మోడీ మెజారిటీ 1,07,721 ఓట్లకు పెరిగింది.2019 లో మోడీ పై పోటీ చేసిన షాలిని యాదవ్ తర్వాత కాలంలో బీజేపీలో చేరారు.ఇక 2024 ఎన్నికల విషయానికొస్తే .. 5 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీ తో మోడీ ని గెలిపించాలని వారణాసి బీజేపీ నేతలు ప్రయత్నించారు.
కానీ మెజారిటీ 152,513 ఓట్లకే పరిమితమైంది. 2014,2019 ఎన్నికలతో పోలిస్తే మోడీ మెజారిటీ బాగా తగ్గింది. కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన అజయ్ రాయ్ కి 460,457 ఓట్లు వచ్చాయి. సమాజ్వాది పార్టీ తో పొత్తు కారణంగా ఓట్లు బాగా పెరిగాయి. బీఎస్పీ పెద్దగా ఓటర్లను ఆకర్షించలేకపోయింది.
కాగా 2009లో అజయ్ రాయ్ సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి గా పోటీ చేయగా 123,874 ఓట్లు వచ్చేయి. నాటి ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి 17,211 ఓట్ల మెజారిటీ తో గెలిచారు. అవకాశం వస్తే అజయ్ రాయ్ వచ్చేఎన్నికల్లో కూడా పోటీ చేసేలా ఉన్నారు.
అజయ్ రాయ్ భారతీయ జనతా పార్టీ విద్యార్థి విభాగం సభ్యునిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అజయ్ 1996,2002, 2007 ఎన్నికల్లో కోలస్లా నియోజకవర్గం నుండి బిజెపి టిక్కెట్‌పై శాసనసభకు ఎన్నికయ్యారు. లోక్‌సభ టిక్కెట్ నిరాకరించడంతో ఆయన బీజేపీ పార్టీని వీడారు.
ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీలో చేరి 2009 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఇండిపెండెంట్గా 2009 శాసనసభ ఉప ఎన్నికలో కొలస్లా నియోజకవర్గం నుండి గెలిచాడు. అజయ్ 2012లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరాడు.అప్పటినుంచి కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు.