Series… Movies on Jaya lalitha ……………………………ఫైర్ బ్రాండ్ నటి కంగనా రౌనత్ నటించిన “తలైవి” కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెకండ్ వేవ్ కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. సినిమా ఎపుడు విడుదల అవుతుందో తెలీదు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తమిళ దర్శకుడు విజయ్ ఈ సినిమా తీశారు. తమిళనాడు ఎన్నికల తర్వాత తలైవి ని రిలీజ్ చేయాలని నిర్మాతలు భావించారు. అయితే అది సాధ్యం కాలేదు.
ఐరన్ లేడీ జయలలిత ఐదుసార్లు తమిళనాడు సీఎం గా పనిచేశారు. మరే మహిళ అంత కాలం సీఎం గా చేయలేదు. జయ అనారోగ్యం కారణంగా డిసెంబర్ 5, 2016 న 68 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. జయ మరణం తరువాత … ఆమె జీవిత కథను సినిమాగా తీసేందుకు చాలామంది ముందుకొచ్చారు. వారిలో ముగ్గురే రంగంలోకి దిగారు. వారిలో గౌతమ్ మీనన్ “క్వీన్” పేరిట వెబ్ సిరీస్ తీసి ప్రశంసలు పొందారు. జయలలిత పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ నటించి తన సత్తా చాటుకున్నారు. సిరీస్ 2 కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. సిరీస్ 1లో జయ చిన్ననాటి జీవితం … ఎదిగిన తీరు … సినిమాలలో కి రావడం … ఎంజీఆర్ తో పరిచయం … స్టార్డం … ఎంజీఆర్ మరణం … తర్వాత పార్టీ పగ్గాలు అందుకోవడం తదితర అంశాలన్నీ గౌతమ్ మీనన్ టచ్ చేసాడు. సినిమాకు ఏమాత్రం తగ్గని స్థాయిలో తీశారు.
ఇక ‘తలైవి’ టైటిల్ తో తమిళ దర్శకుడు విజయ్ 2019 నవంబర్ లో షూటింగ్ ప్రారంభించారు. ఈ మూవీని ఒకేసారి తమిళం, తెలుగు, హిందీ భాషలలో నిర్మించారు. కంగనా రనౌత్ జయలలిత పాత్రలో… ఎంజీ రామచంద్రన్ పాత్రలో అరవింద్ స్వామి నటించారు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మొదట్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ చిత్రం రిలీజ్ అవుతుందని భావించారు. గత ఏడాది వచ్చిన కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యమైంది. దీంతో ఎన్నికల తర్వాత విడుదల అనుకున్నారు. ఈ క్రమంలోనే భారీ అంచనాల మధ్య ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. తలైవి డిజిటల్ హక్కులు అమెజాన్ (తమిళం ) నెట్ ఫ్లిక్స్ (హిందీ )తో ఉన్నాయి. థియేటర్స్ లో విడుదల కానిదే ముందుగా ప్రసారం కావడానికి అవకాశం లేదు.
సెకండ్ వేవ్ కరోనా తగ్గుముఖం పట్టి … సాధారణ పరిస్థితులు నెలకొంటే కానీ థియేటర్స్ లో సినిమా విడుదల కాదు.తలైవి సినిమా కోసం కంగనా 20 కిలోల బరువు పెరిగింది. జయలలిత పాత సినిమాలు,డాక్యుమెంటరీలు చూసి ఆమె హావభావాలను స్టడీ చేసింది. సినిమాలో జయ రాజకీయ ప్రవేశం,ఎంజీఆర్ మరణించినపుడు జయను అవమానించిన దృశ్యాలు.. అసెంబ్లీ లో డీఎంకే సభ్యుడు జయ చీర లాగిన సన్నివేశాలు పొందు పర్చారు. అలాగే కరుణానిధి పాత్ర, ఎంజీఆర్ సతీమణి జానకి, శోభన్ బాబు, శశికళ, వీరప్పన్ పాత్రలు కూడా సినిమాలో ఉంటాయి. అంటే క్వీన్ తరహాలోనే కథాగమనం ఉంటుంది.
విడుదలైన తలైవి ట్రైలర్ .. పోస్టర్లు … వీడియో సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 23 న విడుదల అవ్వాలి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే మరికొంత కాలం విడుదలకు ఛాన్స్ లేనట్టే. కాగా కంగనా రౌనత్ రమ్యకృష్ణ ను మించి నటించగలదా ? ప్రేక్షకులను మెప్పించగలదా ? అనేది సినిమా విడుదల అయితేనే తేలుతుంది. ప్రేక్షకులు, విమర్శకులు ప్రతి అంశం లోనూ క్వీన్ తో తలైవి ని పోల్చి చూస్తారు.
ఇక జయ కథతోనే నిర్మితమౌతున్న మూడో సినిమా “ది ఐరన్ లేడీ”. ఇందులో నిత్యామీనన్ జయ పాత్ర పోషిస్తున్నారు. ప్రియదర్శిని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగు కూడా స్లో గా జరుగుతోంది. జయ చరిత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆమె జీవితంలో ఎన్నో రసవత్తర ఘట్టాలున్నాయి. రక్తి కట్టే సన్నివేశాలు ఉన్నాయి. అనూహ్యమైన మలుపులు ఉన్నాయి. ఘటనలున్నాయి. ఆమె చుట్టూ ఎన్నోచిత్ర, విచిత్రమైన పాత్రలున్నాయి. జయ కథను ఎవరు ఏ మేరకు క్యాష్ చేసుకోగలరో చూడాలి. అలాగే ఎవరు జయలలిత ను మరిపించగలరో ? ప్రేక్షకులను మెప్పించగలరో చూడాలి.
———-KNMURTHY