హరికాంభోజి రాగంలో అద్భుతమైన పాటలు !!

Sharing is Caring...

Bharadwaja Rangavajhala…………………………importance of hari kambhoja raga …………………..

సినిమా సంగీతంలో శాస్త్రీయ రాగాలను వెతకడం ఏమిటి? సినిమా పాటల్లో సాహిత్య విలువల గురించి మాట్లాడడం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు చాలా మందే వేశారు. రవీంద్రనాధ ఠాగూరు అంఖుల్ ఏం చెప్పారంటే… భారతీయ సంగీతంలో ఏ మార్పులు చొరపడినా .. సమ్మేళనాలు చేసినా రాగ పద్దతిని విడనాడడం కుదరని పని. దాన్ని శృంఖలాలు అనుకుంటే సడలించుకుంటూ పోతాం తప్ప అసలు పూర్తిగా వైదొలగలేం అన్నారాయన.

అంచేత … హరికాంభోజి రాగంలో వచ్చిన తెలుగు సినిమా పాటలను చూసేద్దాం. అప్పు చేసి పప్పు కూడు సినిమా కోసం సాలూరు రాజేశ్వరరావు స్వరరచన చేసిన చిన్నారి చూపులకు ఓ చందమామ పాట గుర్తుంది కదా… ఆ పాట హరికాంభోజిలో చేసినదే. కర్ణాటక సంగీతంలో ఈ హరికాంభోజి 28వ మేళకర్త రాగం. హిందూస్తానీ పద్దతిలో ఖమాజ్ ఠాట్ లాగా అనిపిస్తుంది. అన్ని రాగాల్లోనూ ప్రయోగాలు చేసినట్టుగానే రాజేశ్వరరావు హరికాంభోజిలోనూ చేశారు.

అలా చేసిన పాటల్లో రెండోది చెంచులక్ష్మిలో వినిపిస్తుంది. ఆరుద్ర రచించిన ఈ గీతాన్ని జిక్కితో కలసి ఘంటసాల గానం చేశారు. ఇంతకీ పాటేంటంటే … చిలుకా గోరింక కులికే పకాపకా… రాజేశ్వరరావే హరికాంభోజి వరసల్లో చేసిన ట్యూను పూలరంగడు చిత్రంలో వినిపిస్తుంది. హరికాంభోజి రాగంలో వినిపించే రిథమ్ యుగళగీతాలకే కాదు… తత్వగీతాలకూ అద్భుతంగా సరిపోతుంది. పూలరంగడు చిత్రం కోసం రాజేశ్వరరావు కూర్చిన వరస అలాంటిదే.

చిల్లర రాళ్లకు మొక్కుతు ఉంటే చెడిపోదువురా ఒరే ఒరే అంటూ కొసరాజు రాఘవయ్య చౌదరి రాసిన సాహిత్యాన్ని హరికాంభోజిలో హాయిగా పాడించేశారు. ఘంటసాలతో నాగయ్య గొంతు కలపడం ఈ పాట విశేషం. రాజేశ్వరరావు తర్వాత తెలుగు సినిమా సంగీతంలో ప్రముఖంగా వినిపించే పేరు మహదేవన్.
మహదేవన్ విషయంలో ఓ సందర్భంలో రాజేశ్వర్రావుకి కోపం కూడా వచ్చింది.

బాపు విశ్వనాథ్ లు తనను వదిలేసి మహదేవన్ తో కొనసాగడాన్ని బహిరంగంగానే ఆక్షేపించారు కూడా.
బాపు విశ్వనాథులు అరవ్వాళ్లతోనే కొట్టించుకుంటారు అని కామెంటేశారాయన.దేవదాసు మినహాయిస్తే ఆ తర్వాత రెగ్యులర్ గా ఘంటసాలతో సంగీతం చేయించుకున్న నిర్మాత డి.ఎల్ నారాయణ తీసిన ఏకవీర చిత్రానికి మహదేవన్ సంగీతం అందించారు.

అందులో ఘంటసాల మాస్టారు బాలుతో కలసి పాడిన దేవులపల్లి వారి సాహిత్యం ప్రతి రాత్రి వసంత రాత్రీ పాట హరికాంభోజిలోనే స్వరపరచారు మామ.అన్యస్వరాలు ఉపయోగించినా …. అది కేవలం సాహిత్యానికి న్యాయం చేయాలనే తాపత్రయంతో చేసినదే. మహదేవన్ మిశ్ర హరికాంభోజిలో చేసిన గీతం సాక్షిలో వినిపిస్తుంది.

ఇది కూడా తాత్విక నేపధ్యంలో సాగే పాట లాంటిదే. ఆ రోజుల్లోనే కాదు… ఇప్పుడూ కెమేరా సాంగ్స్ వస్తూనే ఉన్నాయి కదా… అప్పట్లో బ్యాక్ గ్రౌండు పాటలనేవారు. కె.బి.కె. మోహనరాజు అద్భుతంగా పాడిన పాటల్లో ఇదీ ఒకటి. బాపు సినిమా కాబట్టి ఆరుద్రదే సాహిత్యం. రారూ రారూ రారూ నీకోసం …
రారూ ఎవ్వరూ నీ కోసం …

అశ్వత్ధామ కూడా మాయని మమత చిత్రం కోసం హరికాంభోజిని వాడారు. ప్రతి గాలి సడికి తడబడకూ… పద ధ్వనులనీ పొరపడకు అంటూ సాగుతుంది దేవులపల్లి వారి సాహిత్యం.సందర్భాన్ని అర్ధం చేసుకుని గానం చేయడమనే తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ గళంతోనే నటిస్తారు ఘంటసాల.

వాహినీ కాంపౌండ్ నుంచి వచ్చినందువల్ల కావచ్చు విశ్వనాథ్ సినిమాల్లో మొదట్లో కాస్త ఎక్కువగా దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యమే వినిపించేది. కుల సమస్య కేంద్రంగా విశ్వనాథ్ మూడు నాలుగు చిత్రాలు తీశారు. వాటిలో ఒకటి కాలం మారింది. అయితే సంస్కరణ పరిధిలోనే ఆ సమస్యకు పరిష్కారాన్ని వెతుకుతారాయన. ఎక్కువగా మహదేవన్ తో పనిచేయడానికే ఇష్టపడే విశ్వనాథ్ ఎందుచేతనో కాలం మారిందికి రాజేశ్వరరావును తీసుకున్నారు.

హరికాంభోజి రాగంలో ఓ విషాద గీతాన్ని కంపోజ్ చేశారు సాలూరి వారు. తను తప్ప ఆ పాటకు ఎవరూ న్యాయం చేయలేరనే రేంజ్ లో పాడతారు ఘంటసాల. ఏ తల్లి పాడేను జోలా ఏ తల్లి ఊపేను డోలా …
ఎవరికి నీవు కావాలి… ఎవరికి నీ మీద జాలి. వేదాంత పరమైన భావాలు ప్రకటించడానికి హరికాంభోజి అనువైన రాగమే.

ఘంటసాల సంగీత దర్శకత్వంలో వచ్చిన ఎల్వీ ప్రసాద్ సినిమా పెళ్లి చేసి చూడు లో హరికాంభోజి కి దగ్గరగా అనిపించే గీతం ఒకటి ఉంటుంది. అది ఖమాజ్ ఏమో అని కూడా అనిపిస్తుంది. భార్యా భర్త పాడుకునే యుగళగీతాన్ని వేదాంత పరంగా రాయడం పింగళి చేసిన సరదా ప్రయోగం. నా మనసులోని మనసా అంటూ ఒక మనసు భావాన్ని మరో మనసుకు అద్భుతంగా క్యారీ చేస్తారు.

ఘంటసాల వారే మాయాబజార్ చిత్రం కోసం శంకరాభరణంతో హరికాంభోజిని కలిపి ఓ తమాషా గీతాన్ని స్వరపరచారు. మాయా శశిరేఖ పాడే అహనా పెళ్లి అంట… పాటే అది. తెరమీద కనిపించేది ఎస్వీఆర్ కనుక కాస్త మాధవపెద్దిని అనుకరిస్తూ పాడేశారు ఘంటసాల. సుశీల కూడా అద్భుతమైన డ్రామా పండించారు ఈ పాటలో. సావిత్రి సహకారం కూడా అందడంతో పాట కోలాహాలంగా మారింది.

విశ్వనాథన్ రామ్మూర్తి సంగీతం అందించిన తెనాలి రామకృష్ణ చిత్రంలోనూ హరికాంభోజిలో చేసిన వేదాంత పరమైన పాట ఒకటి వినిపిస్తుంది. ఇందులోనూ నాగయ్య, ఘంటసాల కలసి పాడతారు. నాగయ్య గాత్రం ముందు ఘంటసాల గళం చాలా యూత్ ఫుల్ గా పలుకుతుంది. సీనియర్ సముద్రాల రాసిన ఈ పాట ఆరోజుల్లో చాలా పద్ద హిట్ సాంగ్. గండు పిల్లి మేను మరచి బండ నిదుర పోయెరా అంటూ సముద్రాల వారు అందించారు సాహిత్యం.

దుక్కిపాటి మధుసూధనరావుగారికి మహాకవి శ్రీశ్రీ సాహిత్యమన్నా… రాజేశ్వరరావు సంగీతమన్నా మహా ఇష్టం. తన సినిమాల్లో శ్రీశ్రీతో పాట రాయించుకోకుండా లేడాయన. యుగళగీతాలను సైతం ప్రయోజనాత్మక గీతాలుగానే తీర్చిదిద్దేవారు శ్రీశ్రీ. అన్నపూర్ణా బ్యానర్ లో వచ్చే చిత్రాలకు అయితే రాజేశ్వరరావు లేకపోతే పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం అందించేవారు. పెండ్యాల స్వరకల్పన చేసిన వెలుగు నీడలు చిత్రంలో శ్రీశ్రీ ఓ టిపికల్ యుగళగీతం రాశారు.

దాన్ని హరికాంభోజిలోనే స్వరపరిచారు పెండ్యాల. ఓ రంగయో పూల రంగయో పాట గురించే అని మీకిప్పటికే తెలిసిపోయి ఉంటుంది. వేదాంత ధోరణిలోనే నడిచే ఓ హాస్య గీతం వినిపిస్తుంది బిఎన్ తీసిన పూజాఫలంలో. బిఎన్ సినిమా కాబట్టి సంగీతం సహజంగానే రాజేశ్వరరావు అందించారు.

కొసరాజు రాసిన ఈ హాస్య తత్వగీతాన్ని వసంత పాడారు. గ్లామరస్ హీరోయిన్ రాజశ్రీ తనను చూడ్డానికి తాపత్రయపడే పొట్టి ప్రసాద్ ను నివారిస్తూ… మా నాన్న తుపాకీ పట్టుకుని సిద్దంగా ఉన్నాడని హింట్  ఇస్తూ  పాడుతుందీ గీతం. వస్తావు పోతావు నా కోసం … అంటూ నడుస్తుంది సాహిత్యం.

విక్టరీ మధుసూధనరావు తీసిన చిత్రాల్లో అత్యధిక శాతం రీమేకులే. హిందీలో ఉత్తమ్ కుమార్ హీరోగా చేసిన అమానుష్ చిత్రాన్ని తెలుగులో ఎదురీత పేరుతో తీశారు విఎమ్మార్. ఎన్టీఆర్, వాణిశ్రీ నటించిన ఈ చిత్రం తెలుగులోనూ శతదినోత్సవ చిత్రం అయ్యింది. విఎస్ఆర్ స్వామి స్వీయనిర్మాణంలో వచ్చిన ఈ చిత్రంలో టైటిల్ సాంగ్ శ్రీశ్రీ రాయడం విశేషం.ఆ పాట హరికాంభోజి కి దగ్గరగా నడుస్తుంది.

అమానుష్ కోసం శ్యామల్ మిత్ర చేసిన ట్యూన్ ను యధాతధంగా తీసుకున్నారు సత్యం. అందుకే హిందూస్తానీ అహిర్ ఖమాజ్ లాగానూ అనిపిస్తుంది. ఇదే అమానుష్ చిత్రాన్ని తమిళ్ లోనూ రీమేక్ చేశారు. హీరోగా శివాజీ చేశారు. త్యాగం పేరుతో తెరకెక్కిన ఆ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు.

ఇళయరాజా శ్యామల్ మిత్ర ట్యూన్ ను కాపీ చేయలేదు. కేవలం ఇన్సిపిరేషన్ గా తీసుకుని తనదైన పద్దతిలో సొంత బాణీ వెతుక్కున్నారు. అదే బాణీని ఆ తర్వాత రోజుల్లో తెలుగులోనూ వినిపించారు.
రవిరాజా పినిసెట్టి తొలి చిత్రం మాదాల రంగారావు హీరోగా తీశారు. సినిమా పేరు వీరభద్రుడు.
నిర్మాత జయకృష్ణ. ఇళయరాజా సంగీతం. నువ్వూ నేనూ బొమ్మలమేరా అంటూ సాగుతుంది పాట.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!