వైఎస్ షర్మిల ఏం ప్రకటిస్తారో ?

Sharing is Caring...

ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల  వైఎస్ ఆర్ అభిమానులు,అనుచరులతో ఏర్పాటు చేసిన సమావేశం కొద్దీ సేపటిక్రితమే మొదలైంది. కొత్త పార్టీ యోచనలో షర్మిల ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో షర్మిల పలువురు నేతలతో మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరించబోతున్నారు. వందమంది ముఖ్యనాయకుల తో ఈ సందర్భంగా ఆమె మాట్లాడబోతున్నారు. పేరుకి ఇది ఆత్మీయ సమావేశం అంటున్నప్పటికీ పార్టీ ఏర్పాటు పై అభిప్రాయ సేకరణ జరుగుతుందని అంటున్నారు. ఇవాళ  ఉదయం నుంచి లోటస్ పాండ్ వద్ద కోలాహలం మొదలైంది. బెంగళూరు లో ఉన్న షర్మిల ఇవాళ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు.  ఒకవేళ పార్టీ ఏర్పాటు ఖరారు అయితే మటుకు త్వరలోనే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీగురించి ప్రకటిస్తారని అభిమానులు చెప్పుకుంటున్నారు.షర్మిల ప్రకటనపై తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు, అనుచరులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

షర్మిలతో ఆత్మీయ సమ్మేళనం అనంతరం వరుసగా తెలంగాణలోని అన్ని జిల్లాలు వారీగా సమావేశాలు ఉంటాయని చెబుతున్నారు. రోజు విడిచి రోజు నెలరోజులు సమావేశాలు జరుగుతాయని సమాచారం. తెలంగాణలో పార్టీ పెడితే  ఏ రకంగా ముందుకు వెళ్తే బాగుంటుంది..? ఏ అంశాలను ఎజెండాగా తీసుకోవాలనే విషయంలో షర్మిల అభిప్రాయాలను సేకరించవచ్చని తెలుస్తోంది.  పార్టీ పెట్టడం ఖరారు అయితే  16 నెలలు షర్మిల పాదయాత్ర చేయవచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి.  కాగా లోటస్ పాండ్ లోని షర్మిల ఇంటి ముందు వైఎస్ ఫోటో లున్న ఫ్లెక్సీలు, పోస్టర్లు వెలిశాయి. వీటిలో జగన్ ఫోటో లేదు. షర్మిల వైఎస్సాఆర్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి.

ఫ్లెక్సీలో ‘మన కష్టం తెలుసు.. మన కన్నీళ్లు తెలుసు.. మన బ్రతుకులు మార్చే బాట. వైయస్ఆర్ కుటుంబానికి తెలుసు. షర్మిలమ్మ నాయకత్వం వర్దిల్లాలి.’ అని రాశారు.  ‘జనంలోకి వస్తుంది షర్మిలక్క.. జనరంజకపాలన ముందుందిక’ అని మరో ఫ్లెక్సీలో ఉంది. ఇందులో కూడా షర్మిల ఫొటో మాత్రమే ఉంది కానీ జగన్ ఫొటో లేదు.మరోవైపు వైఎస్ అభిమానులు, అనుచరులు మీడియాతో మాట్లాడుతూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. అన్ని జిల్లాలనుంచి వైఎస్ అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నానికి పార్టీ ఏర్పాటు పై స్పష్టత రావచ్చు అంటున్నారు. కాగా పార్టీ ప్రకటన వెలువడకముందే సోషల్ మీడియాలో తెలంగాణా అభిమానులు షర్మిల పై వ్యతిరేక పోస్టులు పెడుతున్నారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!