అసలు ఆయన ఐడియా ఏమిటో ?

Sharing is Caring...

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రతిపాదనను మళ్ళీ తెర పైకి తెస్తున్నారా ? రెండేళ్ల క్రితం అటక ఎక్కించిన యోచన కు మళ్ళీ పదును పెడుతున్నారా ? ఆయన మాటలు చూస్తుంటే అలాగే ఉన్నాయి. రెండేళ్ల క్రితం కూడా కేసీఆర్ దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాలని భావించారు.ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కొన్ని ప్రయత్నాలు చేశారు.

మోడీ, రాహుల్ గాంధీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం పావులు కదిపారు. బెంగాల్ వెళ్లి మమతా బెనర్జీని కలిశారు. కేరళ వెళ్లి పినరయి విజయన్ తో భేటీ అయ్యారు. అలాగే చెన్నై లో అప్పటి ప్రతిపక్ష నేత స్టాలిన్ తో మంతనాలు చేశారు. కర్ణాటక వెళ్లి అప్పటి సీఎం కుమారస్వామి తో ముచ్చటించారు. ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన గురించి చర్చలు జరిపారు. అయితే ఆ ప్రయత్నాలు ఎందుకో మధ్యలోనే నిలిచి పోయాయి.

తర్వాత కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారు. తాజాగా మళ్ళీ కొత్త ప్రయత్నాలు మొదలు పెట్టారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నాటి నుంచి సీఎం కేసీఆర్ బీజేపీ పై పూర్తి స్థాయిలోదృష్టి పెట్టారు. బీజేపీ తో అమీతుమీ తేల్చుకునే రీతిలో కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా  పలు అంశాలపై కేంద్ర సర్కార్ పై కేసీఆర్ దుమ్మెత్తి పోస్తున్నారు.

వడ్లు కొనుగోలు విషయంలో మంత్రులతో కలసి కేసీఆర్ ధర్నా కూడా చేశారు. తర్వాత ఢిల్లీ వెళితే  అక్కడ పీఎం మోడీ అపాయింట్మెంట్ దొరకలేదు. అప్పటి నుంచి రైతు సంక్షేమమే తెరాస ఎజెండా అని కేసీఆర్ చెబుతున్నారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం అవసరం లేదంటున్నారు. పోరాట పంధా ఎంచుకున్నారు. ఈ సారి వెనక్కి తగ్గ కూడదని కేసీఆర్ భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే మారిన పరిస్థితుల్లో ఫ్రంట్ ఏర్పాటు అంత సులభం కాదు. కేసీఆర్ మాట విని ఆయన వైపు స్టాలిన్ ..విజయన్.. జగన్ వంటి నేతలు ఎంతవరకు మొగ్గు చూపుతారో గ్యారంటీ లేదు. స్టాలిన్ కి కాంగ్రెస్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ లేని కూటమిలోకి స్టాలిన్ వస్తారా లేదా అనేది సందేహమే. కేరళ సీపీఎం కూడా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా అడుగులు వేయక పోవచ్చు. జగన్ కి బీజేపీతో సంబంధాలు ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి. ఇప్పటికిప్పుడు జగన్ ఏ నిర్ణయం తీసుకోకపోవచ్చు, ఆరు నూరు అయినా కాంగ్రెసుతో అయితే జగన్ కలవరు.

ఇక ఇటీవలే రంగం లోకి దిగిన మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ లేని ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నారు. ముందుగా ఆమె నార్త్ లో అనుకూల పరిస్థితులు సృష్టించుకునే యత్నాల్లో ఉన్నారు. మమత అయితే ఖచ్చితం గా మోడీ ని డీ కొనే సన్నాహాల్లో ఉన్నారు. కాగా కర్ణాటక మినహా దక్షిణాదిన బీజేపీకి చెప్పుకోదగ్గ బలం లేదు. ఆ విషయం ఆ మధ్య జరిగిన ఎన్నికల్లో కూడా స్పష్టమైంది.తెలంగాణలో ఇప్పుడిప్పుడే గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఉప ఎన్నికల్లో రెండు అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది.

ఏపీ, కేరళ, తమిళనాడుల్లో బీజేపీ ప్రభావం కేవలం నామ మాత్రమే. ఈ క్రమంలో ఎన్డీఏ కూటమి కి  దక్షిణాది రాష్ట్రాల నుంచే  ప్రత్యామ్నాయ కూటమిని తెర పైకి తేవాలనే కోరిక కేసీఆర్ మనసులో ఉందంటున్నారు. మోడీ సర్కార్ పై  తొలి అస్త్రంగా ధాన్యం సేకరణ అంశాన్ని ప్రయోగించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ధాన్యం సేకరణ… మరికొన్ని అంశాలలో దక్షిణాది రాష్ట్రాలను కలుపుకుని పోవాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారని అంటున్నారు.

అందుకే స్టాలిన్ ను మళ్ళీ కలిశారు.యితే ఎంతమంది కేసీఆర్ తో కలసివస్తారు అనేది అసలు ప్రశ్న.అందరిని కలుపుకుపోవడం కూడా కష్టమే. ముందే చెప్పుకున్నట్టు ఫ్రంట్ పెట్టడం కూడా అనుకున్నంత ఈజీ కాదు. అందులో ఎన్నో తలనొప్పులు ఉన్నాయి. ఈ విషయాలన్నీ కేసీఆర్ కు తెలుసు. మరెందుకు ఈ ప్రయత్నాలు అని సందేహం కూడా రావచ్చు. అవన్నీ రాజకీయ వ్యూహాల్లో భాగాలు. అవి అలానే నడుస్తుంటాయి.త్వరలో మమత కూడా కేసీఆర్ ని కలిసే అవకాశాలు లేకపోలేదు. వాస్తవానికి దక్షిణాదిన బలమైన లీడర్ గా ఎదగడానికి ఇదే సరైన సమయం కూడా. కేసీఆర్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూద్దాం. 

——-KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!