Cordyceps…………………… ఈ ఫొటోలో కనిపించే వాటిని కార్డిసెప్స్ అని పిలుస్తారు. పుట్టగొడుగుల రకానికి చెందిన కార్డిసెప్స్ (Cordyceps)ను గొంగళి పురుగు ఫంగస్ లేదా హిమాలయన్ గోల్డ్ (Himalayan Gold) అని కూడ అంటారు.అత్యంత అరుదుగా లభించే ఈ కార్డి సెప్స్ కు అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి.
పసుపు, కాషాయ రంగులో సన్నటి పోగులు గా కనిపించే వీటిని సూపర్ మష్రూమ్స్ అని పిలుస్తారు. ఔషధాలలో వినియోగించే ఈ కార్డిసెప్స్ అత్యంత ఖరీదైనవి, బంగారం కంటే వీటి ధర ఎక్కువ. కార్డిసెప్స్ 10 గ్రాముల ధర సుమారు 700 డాలర్లకు (రూ. 56 వేలు) ఉంటుంది. కిలో ధర లక్షల్లోనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
భారత్లోని హిమాలయ ప్రాంతంతో పాటు చైనా నైరుతిలోని కింగై – టిబెట్ వంటి ఎత్తయిన ప్రదేశాల్లో కార్డిసెప్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. 2022 నివేదిక ప్రకారం, అంతర్జాతీయంగా కార్డిసెప్స్ మార్కెట్ విలువ వెయ్యి మిలియన్ డాలర్లు అని అంచనా. వీటి ఉత్పత్తి, ఎగుమతుల్లో చైనా ముందుంది.
అయితే అత్యధికంగా ఉత్పత్తయ్యే కింగై ప్రాంతంలో గత రెండు సంవత్సరాలుగా వీటి సాగు బాగా తగ్గిపోయింది. దీంతో వీటికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. చైనా ఆయుర్వేద మందుల్లో కూడా వీటిని ఉపయోగిస్తున్నారు.
ఈ కార్డిసెప్స్ అలసటను తగ్గిస్తాయి. శరీరానికి బలం చేకూరుస్తాయి. సెక్స్ డ్రైవ్‌ను పెంచే వయాగ్రా మందుల్లో కూడా ఈ కార్డి సెప్స్ ను వాడతారు. అలాగే యాంటీ ఏజింగ్ కోసం కూడా వీటిని ఉపయోగిస్తారు. ఇవి యాంటీఆక్సిడెంట్లను పెంచుతాయి. జ్ఞాపకశక్తి ని మెరుగుపరుస్తాయి. వీటిని పొడి చేసి వివిధ ఔషధాల్లో మిక్స్ చేస్తారు.
ఊపిరితిత్తులు, పెద్దప్రేగు, చర్మం, కాలేయ క్యాన్సర్‌లతో సహా అనేక రకాల క్యాన్సర్ కణాల పెరుగుదలను ఇవి నిరోధిస్తాయని నిపుణులు అంటున్నారు. క్యాన్సర్ చికిత్సలకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇంకా పరిశోధనలు కూడా జరుగుతున్నాయి.
ఇప్పటికే ఈ కార్డిసెప్స్ పేరుతో రకరకాల మందులు మార్కెట్లో ఉన్నాయి. ఇటీవల వీటిని అన్వేషించుకుంటూనే అరుణాచల్ ప్రదేశ్ లోకి చైనా సైనికులు చొరబడినట్లు ఇండో – పసిఫిక్ ఫర్ స్ట్రాటెజిక్ కమ్యూనికేషన్స్ (IPCSC) సంస్థ ప్రకటించింది. అందులో నిజమెంత అన్న సంగతి తేలాల్సివుంది.