ఫోటోల వెనుక కథేమిటి ?

Sharing is Caring...

Leaders who don’t waste time?…………………..

పైన కనిపించే ఫొటోల్లో ఒకటి రేర్ ఫోటో రాజీవ్ ది… మరొకటి బాగా వైరల్ అయిన ప్రధాని మోడీ ఫోటో. నిజానికి ఈ రెండింటికి ఎలాంటి సంబంధం లేదు. ఆ మధ్య  పీఎం నరేంద్ర మోడీ అమెరికా వెళ్తున్న సమయంలో ఎయిర్ ఇండియా విమానంలో ఫైల్స్ ను స్టడీ చేస్తున్నట్టు ఒక ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇది బాగా వైరల్ అయింది. చాలామంది అభిమానులు,బీజేపీ నేతలు, కార్యకర్తలు విస్తృతంగా షేర్ చేశారు.

కొందరు అభిమానులైతే ఇలా విమానంలో కూడా పని చేసిన పీఎం లు లేరన్నట్టు మాట్లాడారు.ఈ నేపథ్యంలోనే మాజీ ప్రధానులు విమాన ప్రయాణం చేస్తూనే కీలక పత్రాలను చదువుతున్న/లాప్టాప్ లో టైపు చేస్తున్నఫోటోలు సోషల్ మీడియాలో వెలుగు చూశాయి.వీటిని కూడా పార్టీల నేతలు,అభిమానులు ఉత్సాహంతో పెద్ద ఎత్తున షేర్ చేశారు. 

కాంగ్రెస్ పార్టీ సభ్యుడు విభాకర్ శాస్త్రి తన తాత..  మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి విమానంలో ఫైళ్లు చదువుతున్న చిత్రాన్ని ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇది కూడా రేర్ ఫోటోనే .. పెద్ద ఎత్తున షేర్ అయింది. శాస్త్రి జూన్ 9, 1964 – జూలై 18, 1964 వరకు మన దేశానికి రెండవ ప్రధాన మంత్రిగా పనిచేశారు. 1965 ఇండో-పాకిస్తాన్ యుద్ధాన్ని ముగించడానికి శాంతి ఒప్పందంపై సంతకం చేసిన ఒక రోజు తర్వాత, జనవరి 11, 1966న ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌లో శాస్త్రి మరణించారు. ఆ మరణం ఇప్పటికీ మిస్టరీయే. 

 

అదే విధంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కూడా విమానంలో ప్రయాణిస్తూ లాప్ టాప్ లో టైపు చేస్తున్న చిత్రాన్నిమరొక అభిమాని షేర్ చేశారు. రాజీవ్ గాంధీ 1984-1989 మధ్య మనదేశానికి ఆరవ ప్రధానమంత్రి. 31 అక్టోబర్ 1984 ఉదయం ఆయన తల్లి ప్రధాని ఇందిరా గాంధీ ఒక సెక్యూరిటీ గార్డ్ చేతిలో హత్యకు గురయ్యారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టారు. 

అలాగే పీవీ నరసింహారావు కూడా విమానంలో ప్రయాణిస్తూ ఏవో పేపర్స్ చదువుతున్న ఫోటోను మరొకరు షేర్ చేశారు. పీవీ 1991 నుండి 1996 వరకు దేశ 9వ ప్రధానమంత్రిగా పని చేసారు. ఇక మన్మోహన్ సింగ్ కూడా విమాన ప్రయాణంలో కీలకమైన ఫైల్స్ చదువుతున్న ఫోటోను ఇంకొకరు షేర్ చేశారు,మన్మోహన్ సింగ్ 2004 నుండి 2014 వరకు దేశానికి 13వ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాతే నరేంద్ర మోడీ ప్రధాని మంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించారు. 

మొత్తానికి ఈ చిత్రాల ద్వారా ప్రధాన మంత్రులు సమయం వృధా చేయకుండా ఏదో ఒక పని చేస్తున్నారన్న సందేశం ప్రజలకు అందుతుంది. వాస్తవానికి ఇదేమి పెద్ద విశేషం కాదు. విమానంలో ఫైళ్లు చూడని వాళ్ళు ఉండొచ్చు. అంత మాత్రానా వాళ్లంతా నాయకులు కాదని అనలేము కదా. ప్రచార వ్యూహాల్లో ఇదో భాగం తప్ప మరొకటి కాదనే వాళ్ళు కూడ లేకపోలేదు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!