Oldest Lake………………………….
ప్రపంచంలో ఉన్న పురాతన సరస్సులలో జార్జ్ సరస్సు ఒకటి.ఈ సరస్సు లో నీరు అపుడపుడు మాయమైపోతుందని అంటారు. ఈ విచిత్ర వైనం పై పరిశోధనలు జరుగుతున్నాయి.. ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాకు ఈశాన్యంగా 40 కిమీ దూరంలో ఉన్న ఫెడరల్ హైవే సమీపంలో ఈ సరస్సు ఉంది. ఈ సరస్సు లో నీరు రాత్రిపూట ఒడ్డు నుండి ఒక కిలోమీటరు వరకు తగ్గుముఖం పడుతుంది..ఆపై రహస్యంగా అదృశ్యం అవుతుంది అనే కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
అమ్యూజింగ్ ప్లానేట్ సంస్ధ నివేదిక ప్రకారం జార్జ్ సరస్సులో ఎప్పుడు నీరు ప్రవేశిస్తుందో, ఎప్పుడు వెళ్లిపోతుందో తెలియదు. సరస్సు నిండినప్పుడు ఇది 155 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. దాని తూర్పు చివరి భాగం హైవే అంచులతో కలుస్తుంది. జార్జ్ సరస్సు దాదాపు 25 కి.మీ పొడవు.. 10 కి.మీ వెడల్పు లో ఉంటుంది. ఒక్కోసారి నీటి జాడలు పూర్తిగా అదృశ్యమవుతాయి. సరస్సు పూర్తిగా ఎండిపోయిన క్రమంలో అక్కడ జంతువులు మేత కోసం తిరుగుతుంటాయట.
జార్జ్ సరస్సు మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిందని స్థానికులు నమ్ముతారు. ఇందులో నీరు ఉప్పగా ఉంటుంది. 1800ల ప్రారంభంలో ఈ సరస్సు చాలా పెద్దదిగా ఉండేదని చెబుతారు. 1840 ప్రాంతంలో సరస్సు ఎండిపోయిందట. ఆస్ట్రేలియన్ జియాలజిస్ట్ పాట్రిక్ డి డెకర్ ఈ సరస్సు పై అధ్యయనం చేశారు.
ఆయన సమాచారం మేరకు 1971లో చివరిసారిగా సరస్సు నిండుగా కనిపించింది. 1986 లో మళ్లీ ఎండి పోయింది. మళ్ళీ ఈ సరస్సు 1996లో నీటితో నిండిపోయింది. ఆ తర్వాత 2002 నుంచి 2010 వరకు నీరు లేక పూర్తిగా ఎండిపోయింది. 2016లో సరస్సులో మళ్ళీ నీరు కనిపించింది.
జార్జ్ సరస్సు లో నీరు ఎండిపోవడం, పునరుజ్జీవం కావడం వెనుక ఒక రహస్యం ఉందని చాలా కాలంగా జనాల్లో ప్రచారం జరుగుతుంది. సరస్సుకు రహస్య భూగర్భ నీటి బుగ్గ నుండి నీరు వస్తుందని అంటారు. అయితే, పాట్రిక్ డి డెక్కర్ మాత్రం అధిక వర్షపాతం ఉంటేనే సరస్సు నీటితో నిండిపోతుందని అంటున్నారు. ఈ సరస్సు నిగూఢంగా నిండడం, ఎండిపోవడం కొన్ని తరాల నుంచి ఆస్ట్రేలియన్లను కలవరపరుస్తోంది.
జార్జ్ సరస్సును స్థానిక గిరిజన భాష న్గున్నావాల్‌లో న్‌గుంగారా లేదా వీరేవా అని కూడా పిలుస్తారు.
వీరేవా అనే పదానికి ‘ మురికి నీరు ‘ అని అర్థం. సరస్సు నీటి మట్టాలు తరచుగా మారుతూ ఉంటాయి. ఈ మార్పులు దీనిని ప్రముఖ పరిశోధనా గమ్యస్థానంగా మార్చాయి.కాగా జార్జ్ సరస్సు పర్యాటక ప్రదేశం గా కూడా పేరు గాంచింది.
నీరు ఉన్నప్పుడు ఇక్కడికి జనాలు వస్తుంటారు. బోట్ షికారు చేస్తుంటారు. సరస్సు దగ్గర్లో ఉన్న వైనరీయార్డులో రుచికరమైన వైన్ లభిస్తుంది. ఈ వైన్ ప్రత్యేక రుచిని కలిగి ఉంటుంది. దీన్ని రుచి చూసేందుకు ప్రపంచం నలుమూలల నుండి వైన్ ప్రియులు ఇక్కడికి వస్తుంటారు.