కైలాస్ పర్వతం మిస్టరీ ఏమిటో ?

Sharing is Caring...

Mystery of Mount Kailash………………….

కైలాస పర్వతం కోట్లాది భారతీయుల విశ్వాసానికి ప్రతీక. ఈ  కైలాస పర్వతం ఎత్తు 6,638 మీటర్లు. దీని ఎత్తు ఎవరెస్ట్ పర్వతం కంటే 2000 కి.మీ తక్కువ. అయినప్పటికీ ఇంత వరకు ఎవరూ కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయారు. ప్రముఖ పర్వతారోహకులు కూడా ఈ పర్వతాన్ని ఎక్కేందుకు నిరాకరించారు.

ఈ పర్వతాన్ని అధిరోహించడానికి పలువురు ప్రయత్నించినప్పటికీ వారి ప్రయత్నాలు  విజయవంతం కాలేదు. అక్కడి వాతావ‌ర‌ణం కారణంగా ఎవ‌రూ అడుగు పెట్ట‌లేక‌పోయార‌ని అంటారు. మరికొందరు ఆ ప్రాంతంలో నావిగేషన్ చాలా కష్టం అని కూడా చెబుతారు. ఈ పర్వతంపై అనేక అతీంద్రియ శక్తులు ఉన్నాయని హిందువులు భావిస్తుంటారు.

అందుకే దీన్ని’ మిస్టరీ పర్వతం’ అని కూడా అంటారు. శాస్త్రవేత్తలు ఇప్పటివరకు ఈ మిస్టరీని  చేధించలేకపోయారు. ప్రముఖ రష్యన్ పర్వతారోహకుడు ‘సెర్గీ సిస్టియాకోవ్’ కూడా ఈ పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించారు.

ఆయన తన అనుభవం గురించి చెబుతూ.. ”నేను కైలాష్ పర్వతానికి చాలా దగ్గరగా చేరుకున్నప్పుడు, నా గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. నేను ఎవరూ అధిరోహించని పర్వతం ముందు ఉన్నాను. ఇంతలో ఒక్కసారిగా ఏదో బలహీనత కమ్ముకున్నట్టు అనిపించింది. దాంతో వెంటనే  అక్కడ ఉండకూడదనుకున్నా. అక్కడ నుంచి వెనుదిరిగాక మనసు తేలికపడింది” అని వివరించారు.  

1936లో ‘హ్యుబర్ట్ టిచి’ అనే వ్యక్తి కూడా ఈ పర్వతాన్ని అధిరోహించటానికి ప్రయత్నించాడు. అయితే చివరి నిమిషంలో అతను ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. 1950 నుంచి 80 దాకా చైనా ప్రభుత్వం ఈ పర్వతాన్ని ఎక్కడానికి ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. 1980లో ‘రిన్‌హోల్డ్ మెస్‌నర్’ అనే వ్యక్తికి ఈ అవకాశాన్ని కల్పించింది. అయితే మెస్‌నర్ ఈ అవకాశాన్ని ఎందుచేతో ఉపయోగించుకోలేదు.

ఎవరైతే ఈ పర్వతాన్ని అధిరోహించాలని ప్రయత్నిస్తారో, వారి తలపై వెంట్రుకలు, గోర్లు వేగంగా పెరుగుతాయని అంటారు. వారి వయసు వేగంగా పెరుగుతుంది. ముఖంలో వృద్ధాప్యం కనిపించడం ప్రారంభమవుతుంది. ముందుకు వెళ్లడానికి ప్రయత్నించే ఏ వ్యక్తి అయినా ఒక విధమైన భ్రాంతికి గురవుతాడు.

అతను ముందుకు వెళ్ళే మార్గాన్ని చూడలేడు. అతని అవయవాలు ఒక్కొక్కటిగా పనిచేయడం మానేస్తాయి. ఎక్కే వ్యక్తికి అకస్మాత్తుగా గుండె వేగంలో తేడా వస్తుంది. ఈ పర్వతం చుట్టూ ఉన్న నిలువు రాళ్లు, మంచుకొండలతో ఏర్పడింది. కారణంగా పైకి ఎక్కడానికి మార్గం దారి కనిపించదు.కొంతమంది పర్వతారోహకుల అనుభవాలివి.

ఆ తర్వాత 2001 దాకా కైలాస పర్వతాన్ని అధిరోహించటానికి పెద్దగా ప్రయత్నాలు జరగలేదు. 2001లో స్పెయిన్‌కు చెందిన ‘జీసస్ మార్టినిజ్ నోవాస్’ నేతృత్వంలోని ఒక బృందానికి చైనా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

అయితే కైలాస పర్వతం హిందూ మత విశ్వాసాలతో ముడిపడి ఉందని.. అందువల్ల దానిని అధిరోహించటానికి అనుమతి ఇవ్వకూడదంటూ అంతర్జాతీయంగా ఒత్తిడి వచ్చింది. దీనితో చైనా ప్రభుత్వం అనుమతిని ఉపసంహరించుకుంది. ఈ పర్వతాన్ని అధిరోహించటానికి ఎవరికీ అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది.

కాగా కైలాస పర్వతం సహజ నిర్మాణం కాదని, అతీంద్రియ శక్తుల కారణంగా ఏర్పడిన పిరమిడ్ అనే వాదన కూడా వినిపించింది.  కైలాస పర్వతం 100 రహస్య పిరమిడ్లతో నిర్మితమైందని అంటారు. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి నిర్మాణం లేనందున కొంతమంది ఈ సిద్ధాంతాన్ని నిజమని భావిస్తారు.

ఈ పర్వతం ప్రపంచంలోని ఇతర ప్రాంతాలోని పర్వతం కంటే చాలా భిన్నంగా ఉంటుంది. కైలాస పర్వతం మిగిలిన పర్వతాల మాదిరిగా త్రిభుజాకారంలో ఉండదు. చతురస్రాకారంలో ఉంటుంది. అందుకే ఈ పర్వతానికి నాలుగు ముఖాలు నాలుగు దిక్కులా విస్తరించి ఉన్నాయని చెబుతారు. ఈ వాదనలను మన శాస్తజ్ఞులు తిప్పి కొట్టారు.

ఇక పురాణాల ప్రకారం చూస్తే.. ఈ పర్వతం సృష్టికి కేంద్రం. దీని ప్రతి ముఖం బంగారం, రూబీ, స్ఫటికం లాజులీ వంటి విలువైన లోహాలతో తయారయ్యిందని పురాణాలలో కూడా ప్రస్తావన ఉందంటారు. ఇప్పటి వరకు ఒక్క వ్యక్తి మాత్రమే ఈ పర్వతాన్ని అధిరోహించాడు. కైలాస పర్వతం రేడియోధార్మికతతో కూడుకున్నదని కూడా చెబుతారు. 

ఈ పర్వతం వాలు 65 డిగ్రీల కంటే అధికంగా ఉంది. ఎవరెస్ట్ పర్వతంలోని ఈ వాలు 40 నుండి 60 డిగ్రీల వరకు ఉంటుంది.  ప్రస్తుతం కైలాస పర్వతాన్ని అధిరోహించడంపై పూర్తి నిషేధం ఉంది. ఎందుకంటే భారతదేశం, టిబెట్‌తో సహా ప్రపంచంలోని నలుమూలల ప్రజలు ఈ పర్వతం పవిత్రమైన ప్రదేశం అని భావిస్తారు.

‘యోగి మిలారేపా’ అనే బౌద్ధ సన్యాసి 11వ శతాబ్దంలో కైలాస పర్వతాన్ని అధిరోహించాడని చెబుతారు. ఈ పవిత్రమైన, రహస్యమయమైన పర్వతాన్ని సందర్శించిన తర్వాత సజీవంగా తిరిగి వచ్చాడని అంటారు.దీనికి ఆధారాలేవీ లేవు. హిందూ మత విశ్వాసాల ప్రకారం కైలాస పర్వతం శివుని నివాసం. మహాశివుడు తన కుటుంబంతో సహా అక్కడ నివసిస్తున్నాడని నమ్ముతారు.ఈ క్రమంలో పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేయడం మినహా ఎక్కే ప్రయత్నాలు ఎవరు చేయలేదు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!