ప్రాంతీయత పై ఇపుడు వగచి లాభమేమి ? రాజా ?

Sharing is Caring...

మా ఎన్నికలు ముగిసి .. ఓటమి పాలయ్యాక నటుడు ప్రకాష్ రాజ్ “ప్రాంతీయత ఆధారంగా ఎన్నికలు జరిగాయి .. ఇలాంటి ప్రాంతీయ వాదం ఉన్న అసోసియేషన్ లో ఉండలేను” అంటూ రాజీనామా చేశారు. మంచిదే … ఆయన ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు. కానీ ఆయన చెప్పిన కారణం చిన్న పిల్లాడు చేసే ఆరోపణ లా ఉంది కానీ ఆయన స్థాయికి తగినట్టు లేదు. 

ఎన్నికలన్నాక ఎవరో ఒకరే  గెలుస్తారు. అపుడే స్పోర్టివ్ నెస్ చూపాలి. అలా కాకుండా ప్రాంతీయత గురించి మాట్లాడటం… రాజీనామా చేయడం హుందాతనం కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి.  వాస్తవం చెప్పుకోవాలంటే … ప్రాంతీయత గురించి ఎన్నికలకు ముందే ప్రచార సమయంలోనే చర్చ నడిచింది. ఆరోజున దాన్ని ప్రకాష్ రాజే ఖండించారు. మా బై లాస్ లో అలా రాసుందా ? అని ఎదురు ప్రశ్నించారు.

పైగా ‘నేను తెలుగువాడిని కాదు. ఒప్పుకుంటా . కర్ణాటకలో పుట్టాను. తమిళ .. తెలుగు భాషలలో నటుడిగా ఎదిగాను. తెలుగు వాడిని కానంత మాత్రాన నేను ఎన్నికల్లో పోటీ చేయకూడదా ? అలా అని ‘మా’ నియమ నిబంధనల్లో ఉందా? నేను రెండుసార్లు జాతీయ అవార్డులు అందుకున్నాను . 9 నందులు తీసుకున్నాను . ఆ స్థాయి వాళ్ళు అవతలి ప్యానెల్‌లో ఎవరైనా ఉన్నారా? ఇదే అంశంపై చర్చ పెడితే జనం నవ్వుతారు”  అని కూడా మీడియా ముందు మాట్లాడారు.

నాడు అలా మాట్లాడిన ప్రకాష్ ఇపుడు ప్రాంతీయత గురించి వాపోవడం చూసి నలుగురు నానా విధాలుగా నవ్వుతున్నారు. గతంలో మాట్లాడిన మాటలని  మర్చిపోయి ఇపుడు ప్రాంతీయత గురించి మాట్లాడటం హాస్యాస్పదం అనిపించుకుంటుంది. మరి ఆ రోజునే  తెలుగు పరిశ్రమలో ప్రాంతీయత ఉంది అని ప్రకటించి పోటీ నుంచి తప్పుకుంటే ఎంత హుందాగా ఉండేది ? ఎంత గౌరవంగా ఉండేది? తీరా పోటీ చేసి ఓడిపోయాక ప్రాంతీయత గుర్తు రావడం .. రాజీనామా చేయడం ఏమిటి ? నన్ను అతిధిగా ఉండమన్నారు … అతిధిగానే ఉంటాను అని బీరాలు పోవడం ఏమిటి ? 

చిత్ర పరిశ్రమలో ప్రాంతీయత ఉందని ఇవాళ కొత్తగా గుర్తించినట్టు మాట్లాడి ప్రయోజనం ఏమిటి ? ఆయన సొంత రాష్ట్రమైన  కర్ణాటక చిత్ర పరిశ్రమలో ప్రాంతీయత లేదా ? అక్కడ పర భాషా డబ్బింగ్ చిత్రాలపై ఆంక్షలు ఎందుకు విధించారు ? ఎవరైనా ఈ ప్రశ్నలు అడిగితే జవాబు ఏమి చెబుతారు? ఎన్నికల్లో ఓడిపోవడం బాధాకరమే.  కానీ హుందాతనం కోల్పోకూడదు. ఒక వేళ గెలిచి ఉంటే .. తర్వాత ప్రాంతీయ ఆరోపణలు వస్తే ఏమి చేసేవారో ? 

———KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!