పాపం మాజీ మంత్రి శంకర్రావు ఏమి చేస్తున్నారో ? ఎక్కడా ఉలుకు పలుకు లేదు. సోనియమ్మ దేవత… ఆమె పేరిట గుడి కడతా అన్నారు. అదెంత వరకు వచ్చిందో తెలీదు. ఉమ్మడి రాష్ట్రం లో కాంగ్రెస్ సర్కార్ హయాంలో ఓ వెలుగు వెలిగిన శంకరన్న అదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నానా ఇబ్బందులు పడ్డారు. నిత్యం వివాదాలతో సావాసం చేసి నోటికొచ్చినట్టు మాట్లాడి, అనవసరంగా సంచలనాల కోసం పాకులాడి కష్టాలు కొని తెచ్చుకున్నారు. తనకు నచ్చని వారిపై ఆరోపణలు చేయడం శంకరన్నకు అలవాటు అని ఆయన విమర్శకుల ఆరోపణ . చివరకు అదే కొంప ముంచింది .
కాంగ్రెస్ పార్టీ వీడిన తర్వాత వైఎస్ జగన్ పై ఆరోపణలు చేసి .. కోర్టులో కేసులో వేసి శంకరరావు అందరి దృష్టిని ఆకర్షించారు. కాంగ్రెస్ అధిష్టానమే జగన్ పై కోర్టులో కేసు వేయించిందని రాజకీయాల్లో కనీస అవగాహన ఉన్నవారికి కూడా తెలుసు. ప్రతిఫలంగా ఆ తర్వాత కిరణ్ క్యాబినెట్లో అవకాశం ఇచ్చారు. మంత్రి అయ్యాక శంకరరావు దూకుడు పెంచారు. అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకవర్గంలో చేరి అదే పనిగా ఆరోపణలు గుప్పించారు. ఎర్రచందనం అమ్మకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని శంకర రావు అభియోగం. సీఎం కిరణ్ రెడ్డి ప్రభుత్వ ఖజానాకు 1250 కోట్ల నష్టం చేకూర్చారని ఆయన ప్రధాన ఆరోపణ. ఈ విమర్శల గోల భరించలేక కిరణ్ రెడ్డి అధిష్టానానికి చెప్పి , అనుమతి తీసుకుని గవర్నర్ చేత ఉద్వాసన పలికించారు. మంత్రి గా ఉండగానే ఆయన అలా పదవి కోల్పోయారు. అక్కడినుంచే ఆయనకు కస్టాలు మొదలైనాయి.
ఈ నేపథ్యంలోనే శంకరరావు సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు. కిరణ్ రెడ్డి వ్యవహార శైలిని ఎండగట్టారు. మంత్రులపై అవినీతి ఆరోపణాస్త్రాలు సంధించారు. తనకు నచ్చని అధికారులపై విరుచుకు పడ్డారు. అదేసమయంలో వివాదాస్పద గ్రీన్ ఫీల్డ్ భూములకేసులో అవమానకర రీతిలో అరెస్ట్ అయ్యారు. పెద్ద నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు కానీ ఇంత అవమానకర రీతిలో మరే నాయకుడిని చేయలేదు. కిరణ్ రెడ్డి ఇదంతా చేయిస్తున్నారని మీడియా ముందు మండి పడ్డారు. తర్వాత అనారోగ్యంతో కొన్నాళ్ళు ఆసుపత్రిలో ఉన్నారు .
టైం బాగాలేకపోతే ఒకేసారి సమస్యలన్నీ చుట్టుముడతాయని సామెత. అదేవిధంగా కోడలు వంశీ ప్రియ ఆయనపై కేసు పెట్టింది. శంకరరావు ,కుటుంబ సభ్యులు తనను వేధిస్తున్నారని కోడలు హైకోర్టును ఆశ్రయించారు. కోడలు ఫిర్యాదుతో శంకరరావు భార్యతో వెళ్లి మహిళా పోలీస్ స్టేషన్ లో లొంగి పోయారు. ఈ సంఘటనలన్నీ మీడియాలో హైలెట్ కావడంతో శంకరరావు మానసికంగా కుంగిపోయారు. చివరికి కోర్టు నుంచి బెయిల్ రావడంతో బయటపడ్డారు.కొన్నాళ్ళు మౌనంగా ఉన్నారు. అంతలోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం .. ఎన్నికలు రావడం చకచకా జరిగిపోయాయి.
2014 ఎన్నికల్లో సమస్యల్లో ఉన్న శంకర రావు పోటీ చేయలేదు . 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం శంకరరావుకు టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో శంకరరావు షాక్ తిన్నారు. ఇందిర కుటుంబానికి వీర విధేయుడిని అని చెప్పుకున్న శంకరరావు కోపంతో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాహుల్ గాంధీకి రాజీనామా పంపిన శంకరరావు అనూహ్యంగా సమాజ్ వాది పార్టీ లో చేరారు. దశాబ్దాలుగా పార్టీకి సేవ చేసిన తనను పార్టీ మర్చిపోయిందని బాధపడ్డారు. అంతకు ముందు శంకరరావు నాలుగుసార్లు షాద్ నగర్ నుంచి ,ఒక సారి కంటోన్మెంట్ నుంచి గెలిచారు. నియోజకవర్గం జనరల్ కేటగిరీ లోకి మారడంతో కంటోన్మెంట్ కి వచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగా , డిప్యూటీ సీఎల్ఫీ లీడర్గా పని చేశారు. కనీసం కూతురికి అయినా టిక్కెట్ ఇప్పించుకోవాలని ప్రయత్నించారు. ఆ ప్రయత్నం కూడా సఫలం కాలేదు. షాద్ నగర్ లో రెబెల్ గా నామినేషన్ వేశారు. అప్పటికి అధిష్టానం స్పందించక పోయేసరికి సమాజ్వాదీ పార్టీ కండువా కప్పుకున్నారు. భార్య చేత కూడా నామినేషన్ వేయించారు. అంతలో పార్టీ అధిష్టానం నుంచి ఫోన్ వచ్చింది. సముచిత స్థానం కల్పిస్తామని హామీ రావడంతో సమాజ్వాది పార్టీ కి రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ లో చేరారు. నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. శంకరరావు ను రాష్ట్ర నేతలు కూడా పెద్ద గా పట్టించుకోలేదు. ఒకదశలో తెరాస లోకి వెళ్తారని పుకార్లు వచ్చాయి కానీ అలాంటి నిర్ణయం శంకరరావు తీసుకోలేదు.
ఒకప్పుడు ఆయన వైఎస్ తో సన్నిహితంగా ఉండేవారు. పాదయాత్రలోను వైఎస్ పక్కన నడిచాడు. తర్వాత రోజుల్లోనే కొంచెం దూరం అయ్యాడు. కాంగ్రెస్ పార్టీ అయితే ఆయనను అవసరానికి వాడుకుని వదిలేసింది. ఆమాట అంటే శంకరరావు మొదట్లో ఒప్పుకునే వారు కాదు. తర్వాత అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. జీ.వెంకట స్వామికి స్వయానా అల్లుడైనా ఎప్పుడూ ఆయన పేరు వాడుకోలేదు. ముషీరాబాద్ ఏరియాలో రూపాయి డాక్టర్ గా శంకరరావుకు మంచి పేరుంది. ప్రస్తుతం శంకరరావు ఖాళీగానే ఉన్నారు . సమకాలీన రాజకీయాలను గమనిస్తూ కాలక్షేపం చేస్తున్నారు.
కొస మెరుపు ….. శంకరరావు కుమారుడు శశాంక్ ఇప్పటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్లాస్ మేట్స్. మంచి స్నేహితులు కూడా.
—— KNMURTHY
“చెరపకురా చెడేవు” !