Govardhan Gande…………………………………………….
What is China’s strategy ?……………………….. తాలిబన్ సర్కారుకు చైనా మద్దతు ప్రకటించడాన్ని ఎలా చూడాలి? ఎలా అర్థం చేసుకోవాలి?ఇందులో వింత ఏమీ లేదు. ఇన్నాళ్లు ముసుగులో కొనసాగిన మద్దతును ఇప్పుడు చైనా ప్రభుత్వం బహిరంగ ప్రకటన ద్వారా వెల్లడించింది.ఓ చాందస మత వాద ప్రభుత్వానికి ఓ “కమ్యూనిస్టు”వ్యవస్థ అండగా నిలవడం ఆశ్చర్య కరమైన పరిణామమే కాని నిజం.అది కూడా అఫ్గానిస్తాన్ ను దురా(ఆ)క్రమణ ద్వారా స్వాధీనం చేసుకున్న తాలిబన్ కు సమర్థించడం,ఆ ప్రభుత్వాన్ని గుర్తించడం ఏమిటి?
అయినా ఆక్రమణ ను సమర్థించడం ఏమిటి? చైనా లక్ష్యం ఏమిటి ? ప్రపంచంపై ఆధిపత్యం కోసం ఉవ్విళ్లూరుతున్న చర్యగా అర్ధం చేసుకోవచ్చునా?దీనిని కమ్యూనిజమే అనుకుందామా? మార్క్స్,ఎంగెల్స్,లెనిన్,మావోలు చూపిన బాట ఇదేనా?ఆక్రమణలు,దురాక్రమణలను వారు ప్రవచించారా?వారు కోరుకున్నది సమ సమాజం కదా.పాకిస్తాన్ మద్దతు పలకడం పట్ల ఎవరూ ఆశ్చర్యపోలేదు.దానికొక విధానమే లేదు. రష్యాలో ఇప్పుడు కమ్యూనిస్టు వ్యవస్థ లేదు.ఈ రెండు దేశాలు మద్దతు నీయడంలో వారికి ఇతర అజెండాలు, ప్రయోజనాలున్నాయి.
అంతకుముందు కూడా అఫ్గాన్ లో రాక్షస కాండను ప్రపంచమంతా వ్యతిరేకిస్తుంటే … డ్రాగన్ మాత్రం భేష్ .. శభాష్ అంటూ మెచ్చుకుంది. ఇందులో మర్మమేమిటో గ్రహించలేని దేశాలు లేవు. తాలిబన్ల కు స్నేహ హస్తం అందించి .. వారు బలపడేందుకు మద్దతు ఇచ్చి ఆ తర్వాత శత్రు దేశాలపై వారిని అస్త్రంగా వాడుకోవాలని చైనా చూస్తోంది. ఇది చైనా కుటిల యోచన. అఫ్గన్‌లో ఏర్పడే తాలిబన్ సర్కార్ తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడానికి సిద్ధమని కూడా చైనా ప్రకటించింది. అమెరికా సేనలు వెనక్కి వెళ్లడంతో తాలిబన్లతో చైనా సంబంధాలు కొనసాగిస్తోంది.
ఆఫ్ఘనిస్తాన్ తో సరిహద్దు పంచుకున్న చైనా తాలిబన్ల ప్రాబల్యం పెరిగితే జిన్జియాంగ్ ప్రావిన్స్ లోని ముస్లిం మైనార్టీల నుంచి ప్రమాదం పొంచి ఉంటుందని భావిస్తోంది. ఇటీవల చైనాలో పర్యటించిన తాలిబన్ ప్రతినిధుల తో మంతనాలు నిర్వహించింది.ఆ తర్వాత ఆర్ధిక సాయం, అఫ్గన్ పునర్నిర్మాణానికి సహకారం అందజేసేందుకు చైనా సిద్ధమైంది. పైకి మద్దతు ఇస్తున్నప్పటికీ అంతర్గతంగా చైనా కూడా ఆందోళనలో ఉంది. కొత్త సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని భావిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.