Bharadwaja Rangavajhala………………………………
casting couch……………………..
షరా మామూలుగా పట్టువదలని విక్రమార్కుడు చెట్టు మీద నుంచీ శవాన్ని దించి భుజం మీద వేసుకుని శ్మశానం కేసి నడవసాగాడు. ఇంతలో శవంలోని భేతాళుడు “రాజా నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు ఓ కథ చెప్తాను” అని చెప్పడం మొదలెట్టాడు.
అనగనగా … హైద్రాబాద్ కృష్ణానగర్ లో ఉంటూ … సినిమాల్లో పనిచేస్తున్న ఓ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు. హీరోయిన్ కావాలనేది ఆ అమ్మాయి డ్రీమ్. కానీ సరైన అవకాశాలు రావడం లేదు. ఆ కుర్రాడు అసిస్టెంట్ డైరెక్టర్.
ఆ అమ్మాయి టాలెంట్ అతనికి తెల్సు. మంచి నటి. నాకు బ్రేక్ వస్తే నీకు తప్పకుండా ఛాన్స్ ఇస్తాను హీరోయిన్ గా అని ప్రామిస్ చేస్తాడు. ఇంతలో ఆ కుర్రాడికి బ్రేక్ వస్తుంది.అంటే దర్శకత్వ అవకాశం లభిస్తుంది.
హీరోయిన్ ఫలానా అమ్మాయి అని నిర్మాతకు చెప్తాడు. ఆయన అంగీకరిస్తాడు. అయితే …. ఆ అమ్మాయి నాతో పడుకోవాలి అలా అయితే ఛాన్స్ ఇస్తాను అంటాడు. దీంతో ఆ కుర్రాడు’ నో ‘అని చెప్పేసి వచ్చేస్తాడు. ఆ అమ్మాయి అడుగుతుంది. ‘ఏంటి పరిస్థితి ఏమైంది’ అని.
ఇతను చెప్తాడు ‘ఇలా జరిగింది వదిలేసి వచ్చేశాను’ అంటాడు. ‘అలా ఎందుకు వదిలేశావూ … ఇలాంటివి ఉంటాయని నాకు తెల్సు. ఒక వేళ ఇలాంటి సందర్భం వస్తే ఫేస్ చేద్దామనే అనుకున్నాను. ఓకే నువ్వు బాధ పడకు … నేను రేపు ఆయన్ని కలుస్తాను. నువ్వు బాధ పడకు.’ అంటుంది.
ఈ మాట విని తీవ్రంగా చలించిపోయిన ఆ కుర్రాడు … పిచ్చివాడిగా మారిపోయాడు. హర్ట్ అయ్యాడు .. గాయపడ్డాడు. అంతే కాదు ఆ అమ్మాయితో మాట్లాడడం మానేశాడు. వదిలేశాడు … ఆ అమ్మాయిని చూడ్డమే మహా పాపం అనుకున్నాడు. అలా గాయపడడం.. అలా చేయడం కరెక్టేనంటారా రాజా ?
రాజా .. ఈ ప్రశ్నకు సమాధానం తెల్సీ చెప్పకపోతే నీ తల వెయ్యి వక్కలవుతుందన్నాడు శవంలోని భేతాళుడు.
అప్పుడు విక్రమార్కుడు …. ఆ కుర్రాడు ఆ అమ్మాయిని ప్రేమించినది నిజమైతే … తనకు ధైర్యం చెప్పి … ఇలాంటి పరిస్తితి రాకుండా వచ్చే అవకాశాల కోసం చూద్దాం … వెతుకుదాం… ఎవరో ఒకరు దొరక్కపోరు …డోంట్ వర్రీ .. అంత పరిస్తితి రాకుండానే చూద్దాం అని ఆ అమ్మాయితో అనేసి …
విషయాన్ని లైట్ గా తీసుకుని ముందుకు నడవాలి.
కానీ …జస్ట్ ఆ అమ్మాయి అలా అన్నది అనే కారణంతో వదిలేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం … అలా వదిలేశాడంటే …అతని మనసులో ఆమె పట్ల ఏ మాత్రమూ గౌరవం లేదనే అనుకోవాలి … తను ప్రేమించిన అమ్మాయి తన సొంతం అనుకునే యాజమాన్య భావజాలం బలంగా ఉందని కూడా అనుకొవాలి … ఇలా అనేక అవలక్షణాలు కనిపిస్తాయి.
ఆ అమ్మాయి పట్ల అతను చూపించినది ప్రేమ అనుకోవడానికి కూడా లేదు … అతను అలా వదిలిపోవడం ఆ అమ్మాయి అదృష్టం తప్ప మరేం కాదనే అనుకోవాల్సి ఉంటుంది … అన్నారు విక్రమార్కుడు. విక్రమార్కుడికి మౌనభంగం కాగానే శవంలోని భేతాళుడు శవంతో సహా తిరిగి చెట్టెక్కాడు.