ఆ సమయంలో ‘ సజ్జల ‘ ఏం చేశారంటే ??

Sharing is Caring...

Taadi Prakash…………..    ఉదయం కబుర్లు …..

సజ్జల రామకృష్ణారెడ్డి ఉదయంలో చేరడం చాలా నాటకీయంగా జరిగింది .1979లో ఈనాడులో ఒక సాధారణమైన సబ్‌ ఎడిటర్‌ గా 600 జీతానికి చేరిన సజ్జల , రెండేళ్ల తర్వాత ఆంధ్రభూమి దినపత్రికలో జాయిన్‌ అయ్యారు. అప్పుడు భూమికి గజ్జెల మల్లారెడ్డి ఎడిటర్‌ గా ఉన్నారు. ఆయనే సజ్జలకు ఉద్యోగం ఇచ్చారు. ఏబీకే దాసరి కాంబినేషన్లో ఉదయం రాబోతున్న వార్త అందరినీ ఆకట్టుకుంది.

యువరక్తం ఉప్పొంగే జర్నలిస్టులు ఉదయంలో చేరడం మొదలయ్యింది ట్రైనీ సబ్‌ ఎడిటర్లుగా. అప్పటికే ఒక 70 మందిని రిక్రూట్‌ చేశారు. ఆర్వి రామారావు, ఆర్టిస్ట్‌ మోహన్‌ తెలిసిన వాళ్ళు గనుక రామకృష్ణారెడ్డి ఉదయంలో చేరాలనుకున్నారు. ఉదయం ఆఫీసుకు వచ్చి మోహన్‌తో మాట్లాడగా, మోహన్‌ ఏబీకే గారికి సజ్జలను పరిచయం చేశాడు. తీసుకునే అవకాశం ఉందని ఏబీకే చెప్పారు.. ఇంకేం హ్యాపీగా ఉదయంలో చేరిపోతున్నాను అని మల్లారెడ్డి గారితో సజ్జల చెప్పాడు. పెద్దాయన హర్ట్‌ అయ్యారు.

మా కడప జిల్లా వాడు,  మా సీపీఐ పార్టీ వాడు ,మా రెడ్ల కుర్రాడు అని పిలిచి ఉద్యోగం ఇస్తే… ఇప్పుడు వెళ్ళిపోయి వేరే చోట జాయిన్‌ అవుతాడా అని మల్లారెడ్డి కోపంతో ఊగిపోయారు. సరే వెళ్ళు అని విసురుగా అన్నారు. భూమిలో రూ.1200 జీతానికి పనిచేస్తున్న సజ్జల ఉదయంలో రూ.1500 ఇస్తారని అనుకున్నాడు. పేపర్‌ మారడానికి అంతా సిద్ధమై సజ్జల ఉత్సాహంగా ఉన్నాడు. అప్పుడు రామకృష్ణారెడ్డి వయసు 24 ఏళ్ళు ఉండవచ్చు .

సజ్జల స్వతహాగా సౌమ్యుడు. మంచి చదువరి. తెలుగు పుస్తకాల కన్నా ఎక్కువగా ఇంగ్లీష్‌ పుస్తకాలు చదివినవాడు. అప్పుడు, కథ ఒక నాటకీయమైన మలుపు తిరిగింది. ఉదయంలో జనాన్ని రిక్రూట్‌ చేసుకోవడం భారీ ఎత్తున జరిగిందనీ, జీతాల బిల్లు విపరీతంగా పెరిగిపోయిందనీ, హైదరాబాదు నుంచి మద్రాసులో ఉన్న దాసరికి సమాచారం కమ్‌ ఫిర్యాదు అందింది.

దాంతో ‘స్టాప్‌ రిక్రూట్మెంట్‌’ అన్నారు చైర్మన్‌ దాసరి. సజ్జల జాయిన్‌ కావడం పెండింగ్ లో పడింది .  అసలే సజ్జల మొహమాటస్తుడు. మోహన్‌ వీరమొహమాటస్తుడు. అటు ఏబీకే ఏమీ చెప్పలేక ఊరుకున్నారు. సజ్జల రావడం.. మోహన్‌ టేబుల్‌ ముందు కూర్చోవడం.. లాంగ్‌ షాట్‌ లో క్యాబిన్‌లోంచి ఏబీకే చూడటం.  రోజులు గడుస్తున్నాయి. చేరే అవకాశం కనబడటం లేదు. తిరిగి భూమిలో జాయిన్‌ అవుదాం అంటే మల్లారెడ్డి క్షమించడు.

ఓ రోజు ఏబీకే మోహన్‌ని పిలిచి ‘ఆ కుర్రాన్ని అలా రోజు రావద్దని చెప్పు.. వీలైతే ఎకామిడేట్‌ చేద్దాం’ అని చెప్పారు. సజ్జల సందిగ్ధంలో ఉండిపోయారు. కొన్ని రోజుల తర్వాత, (మోహన్‌ని కాదనలేక కూడా ఏమో..) సజ్జలని రమ్మన్నారు. ‘అక్కడ రూ. 1200 వస్తుంది కదా మేమూ  1200 ఇస్తాం’ అని చెప్పారు .ఈమాత్రం దానికి పేపర్‌ మారడం ఎందుకూ అనుకొని సజ్జల దిగులుపడ్డారు. వెనక్కి వెళ్లే వీలు లేదు కనుక ఆ కొద్దిపాటి జీతానికే
ఉదయంలో జాయిన్‌ అయ్యారు సజ్జల….

నవంబర్లో దీపావళి సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డిని హైదరాబాదులో కలిసినప్పుడు చాలా పాత కబుర్లు చెప్పిన సజ్జల… ఈ ఉదయం డ్రామా అంతా చాలా హిలేరియస్‌గా నాతో చెప్పారు. సజ్జల కూడా అంతకుముందే పెళ్లి చేసుకోవడం.. చాలీచాలని జీతం.. అని బెంగపడడం జరిగింది. జీతం విషయంలో అచ్చు నాలాగే సజ్జల కూడా గాయపడ్డారు, గత్యంతరం లేకపోయింది.!

చిత్రంగా కాలం తిరగబడింది . ఓ మేజిక్ జరిగింది… రజనీకాంత్‌ ఫార్ములా సినిమా ‘భాషా’ లాగా, సజ్జల రామకృష్ణారెడ్డి , వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి, జగన్మోహన్‌ రెడ్డి కలిసి 2007లో సాక్షి పేపర్‌ పెట్టారు. సాక్షి తొలి కార్పొరేట్‌ న్యూస్‌ పేపర్‌గా రికార్డ్‌ సృష్టించింది. పెట్టుబడి దాదాపు రెండువేల కోట్లు. ఒకనాడు ఏబీకే, పతంజలి, రామచంద్ర మూర్తిల దగ్గర ఉద్యోగిగా పనిచేసిన రామకృష్ణారెడ్డి.. ఆ పెద్దలు ముగ్గురికీ సాక్షిలో ఉద్యోగాలు ఇచ్చారు.

ఛానల్‌ పెట్టిన తర్వాత యానిమేషన్‌ డిపార్ట్మెంట్‌ హెడ్‌గా తాను అభిమానించే ప్రేమించే ఆర్టిస్ట్‌ మోహన్‌ని తీసుకున్నారు. ఉదయంలో 3 వేల రూపాయలకు పని చేసిన మోహన్‌ జీతం సాక్షిలోరెండు లక్షల రూపాయలు… నెలకి !  (సంవత్సరానికి అనుకునేరు.!) ఆ రకంగా రామకృష్ణారెడ్డి అనే రజనీకాంత్‌ ఆనక  .. రాజకీయాల్లోకి వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు ముఖ్యమంత్రికి సమానస్థాయి గౌరవాన్ని పొందుతున్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌  రాష్ట్రాల్లో ఒక జర్నలిస్టు ఇంత స్థాయికి  రావడం మన సమీప చరిత్రలో ఎప్పుడూ జరగలేదు.

‘ఉదయం’ దినపత్రిక కారంచేడు హత్యాకాండని ఉద్యమంగా మార్చింది… నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్‌, యాలకులు.. ఇలా..అన్ని ప్రసాదాలు, బియ్యం పంచదార, బెల్లం వంటి సకల ఆహార పదార్థాల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న కుంభకోణాలు సాక్ష్యాలతో సహా బయటపెట్టింది. దాసరి ఇచ్చిన మహదవకాశాన్నీ, ఏబీకే ఇచ్చిన స్వేచ్ఛనీ.. రాష్ట్రంలోని విలేకరులూ, డెస్క్‌లోని మాలాంటి జర్నలిస్టులు అద్భుతంగా వినియోగించుకకుని సమాజానికి ఒకింత మేలు చేయగలిగారు.

నిజంగానే ‘ఉదయం’ అంటే నాకొక గగుర్పాటు…
ఆ జర్నలిజమే ఒక తిరుగుబాటు.!
ఆ మధుర స్వప్నాన్ని అలాగే ఉండనివ్వండి..
ఆ రోజులు మళ్ళీ రావాలని దురాశ పడకండి..!
Writer Ph no………..9704541559

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!