కేదార్నాథ గుహల్లో ధ్యానం చేయాలనుకుంటున్నారా?

Sharing is Caring...

మంచు కొండల నడుమ, పవిత్ర నదీ ప్రవాహల సరసన,కేదారనాథుడి సమక్షంలో గుహల్లో ధ్యానం చేయాలనుకుంటున్నారా ? ప్రాపంచిక ఒత్తిళ్లు, చిక్కులను మరిచి ఒకటీ రెండు రోజుల పాటు ధ్యానంలోకి వెళ్లడం ఒక గొప్ప అనుభూతిని అందిస్తుంది.

ధ్యానం శరీరానికి, మనసుకు కొత్త శక్తిని అందిస్తుంది. ఇపుడిపుడే గుహల్లో ధాన్యం చేసే  ప్రక్రియ పాపులర్ అవుతోంది. ఆమధ్య ప్రధాని మోడీ ధ్యానం చేసిన రుద్ర గుహ పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా మారింది.

ఈ ధ్యానం పట్ల పర్యాటకులలో ఆసక్తి పెరిగింది. భక్తుల ఎంక్వయిరీలు ఎక్కువైనాయి.  దీంతో  భక్తుల కోసం మరిన్ని గుహల నిర్మాణానికి  ఉత్తరాఖండ్ ప్రభుత్వం పూనుకుంది. కొత్తగా మూడు గుహలను నిర్మించింది. కేదార్‌నాథ్ సందర్శకులు కొంత సమయం ఒంటరిగా, ప్రశాంతంగా గడపడానికి, ధ్యానం చేసుకోవడానికి  ఈ నాలుగు గుహలు  ఉపయోగపడతాయి.

ఈ గుహలు కేదార్‌నాథ్ ఆలయం ఎడమ వైపు పర్వతం దగ్గర ఉన్నాయి. ఈ గుహల్లో  అటాచ్డ్ టాయిలెట్, సౌర విద్యుత్, తాగునీరు  ఉంటాయి.రుద్ర గుహ 2019 మే 18 న ప్రధాని మోడీ అక్కడ ధ్యానం చేసినపుడు వెలుగులోకి వచ్చింది. మూడు కొత్త గుహలు రుద్ర గుహ సమీపంలోనే  ఉన్నాయి . కేదార్‌నాథ్‌లో లాడ్జీలు, క్యాంటీన్‌లను నిర్వహిస్తున్న ఉత్తరాఖండ్ ప్రభుత్వ పర్యాటక విభాగం ఘర్ వాల్ మండల్ వికాస్ నిగం కొత్త గుహల బుకింగ్ బాధ్యతలను పర్యవేక్షిస్తుంది.

కేదార్ నాథ్ మందిరాన్ని శీతాకాలం దృష్ట్యా నవంబర్ 16 న మూసివేశారు. ఆరునెలల తర్వాత తెరుస్తారు.  కోవిడ్  కారణంగా ఈ సీజన్‌లో రుద్ర గుహలో పర్యాటకులు ఉండటానికి గర్హ్వాల్ మండల్ వికాస్ నిగమ్ అనుమతించలేదు. వచ్చే ఏడాది అవకాశం ఉండొచ్చు.

కాగా ఈ గుహలు  సహజసిద్దంగా ఏర్పడినవి కావు.ఇవి మానవ నిర్మితంగా రూపొందినవే.సాధారణంగా కేదారనాథ్ దర్శించే భక్తుల్లో చాలా మంది అక్కడే ఓ రాత్రి బసచేసి, పూజలోకానీ, ధ్యానంలో గానీ ఉండాలని కోరుకుంటారు…కానీ చలిప్రదేశం, గుడి ఆవరణలో ఎక్కడపడితే అక్కడ ధ్యానం సరికాదు..పైగా భద్రతా సమస్యలు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని వీటిని నిర్మించారు.  ఆదరణ పెరిగితే మరిన్ని నిర్మించే అవకాశాలున్నాయి.

ప్రధాని మోడీ గత సంవత్సరం కేదార్‌నాథ్‌ కు వెళ్లే ముందు పుణ్యక్షేత్రమైన కేదార్ నాథ్ లో ధ్యానం చేసుకోవడానికి ఒక గుహ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించగా అలాంటి గుహలను ఘర్ వాల్ మండల్ వికాస్ నిగమ్ సంస్థ ఏర్పాటు చేసింది. అప్పట్లో ప్రధాని కోసం నిర్మించిన గుహ పేరు ‘రుద్ర గుహ’. మొదట్లో ఈ గుహలో ధ్యానం చేసుకునేందుకు మూడు వేలు చార్జీలు వసూలు చేసేవారు.

అయితే పర్యాటకులు అంతగా ఆసక్తి చూపకపోవడంతో  వెయ్యికి  తగ్గించారు. ఈ గుహల కోసం పర్యాటకులు  కనీసం 3 రోజుల ముందే బుక్ చేసుకోవాలి. ఇక్కడ 9గంటలు మాత్రమే ఉండటానికి వీలుంటుంది. ఈ గుహలో కేవలం ఒక వ్యక్తికి మాత్రమే సౌకర్యంగా ఉంటుంది. బుకింగ్ చేసుకునే భక్తులు ఆరోగ్య పరంగా ఫిట్ నెస్ కలిగి ఉండాలి. కేదార్ నాథ్ లో వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. అన్ని ఒకే అయితేనే గుహలో ధ్యానం చేయటానికి అనుమతిస్తారు.

GMVN హెల్ప్ లైన్ NO
0135- 2746817, 2749308
+91 9568006639
info@gmvnl.in

——————–  KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!