ఓటర్లను విమర్శించే అర్హత ఛానళ్లకుందా?

Sharing is Caring...

జి హెచ్ ఏం సి … ఎన్నికల నేపథ్యంలో  కొన్ని టీవీ ఛానెళ్లు ఓటు వేయ‌డానికి ఆసక్తి చూపని వారి మీద అనుచిత‌మైన వ్యాఖ్య‌లు చేశాయి. రాజకీయ నాయ‌కుల కంటే ఘోరంగా మాట్లాడాయి. ఓటు వేయ‌ని ద‌ద్ద‌మ్మ‌లు, పోలింగ్‌కి దూరంగా వున్న చ‌వ‌ట‌లు, సెల‌వు ఎంజాయ్ చేశారు కానీ ఓటేయ‌డానికి రాలేని స‌న్నాసులు, బ‌ద్ధ‌క‌జీవులు … అంటూ దూష‌ణ‌ల‌కు కూడా దిగాయి. అయ్య‌లూ, అమ్మ‌లూ … ఎందుకు మీకిప్పుడే ఇంత ఆవేశం వ‌చ్చింది? ఇన్నాళ్లూ ఎక్క‌డ కూర్చున్నారు? ఈరోజు మీ మీడియా సంస్థ‌ల‌ను వెనకుండి న‌డిపించే పార్టీలు, కంపెనీలు జ‌నం ఓట్ల‌కి దూరం కావ‌డం మీకు ఈ ఆవేశాన్ని ఇచ్చివుంటుంద‌ని నేనైతే భావిస్తున్నా.

మ‌న దేశంలో ఓటు వేయ‌డం అనేది నిర్బంధం కాదు. కానీ, ఓట్లు వేయ‌డానికి వెళ్ల‌క‌పోవ‌డం ఖ‌చ్చితంగా త‌ప్పే. రాబోయే అయిదేళ్ల పాటు నిన్ను పాలించేవాడి గురించి తెలుసుకోవ‌డం, అభ్య‌ర్థుల్లో నీకు న‌చ్చిన వారికి ఓటు వేయ‌డం; లేదా నోటాకు ఓటు వేయ‌డ‌మో చేయొచ్చు. కానీ అస‌లు పోలింగ్‌బూత్‌కి వెళ్ల‌క‌పోవ‌డం త‌ప్పని నేను వ్య‌క్తిగ‌తంగా న‌మ్ముతాను.
పండ‌గ‌ల‌కీ, ప‌బ్బాల‌కీ వేల‌కు వేలు ఖ‌ర్చుపెట్టి ఊర్ల‌కు వెళ్లొచ్చే మ‌నం … అయిదేళ్ల పాటు మ‌న‌ జీవితాలు పండ‌గ లాగా సాగ‌డానికి చేయాల్సిన ఒకే ఒక్క చిన్న ప‌ని … ఓటు వేయ‌డం. అందుకు కూడా సిద్ద‌ప‌డ‌నివారిని ఖ‌చ్చితంగా నిందించాల్సిందే. నిజానికి, కొత్త‌త‌రం యువ‌తీ యువ‌కులు పోలింగ్ రోజును పండ‌గ‌లా సెల‌బ్రేట్ చేసుకోవాలి. అది ఐదేళ్ల త‌మ భ‌విష్య‌త్‌కి గుర్తుగా భావించాలి. కానీ, బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్‌కి ఖ‌ర్చు పెట్టే టైమ్‌లో క‌నీసం 2 శాతం కూడా ఓటు వేయ‌డానికి కేటాయించ‌లేక‌పోవ‌డం దౌర్భాగ్యం.

ఓట‌ర్లు ప్ర‌భుత్వాన్ని, నాయ‌కుల‌ను నిల‌దీయ‌వ‌చ్చు. మీడియా కూడా ఇదే ప‌ని చేయ‌వ‌చ్చు. ఇంకొక మెట్టు పైకి కూడా ఎక్కొచ్చు. కానీ  ఛానెళ్లు అన్ని ప‌రిమితుల‌నూ మ‌ర్చిపోయాయి. చాలా ప‌చ్చిభాష‌ని వాడాయి. ఇది కరెక్ట్ కాదు. జ‌నం మీకు ద‌ద్ద‌మ్మ‌లుగా క‌నిపిస్తే … మీరు వారికెలా క‌నిపిస్తున్నారో ఒక‌సారి ఊహించి చూడండి. వారి కోణం నుంచి కూడా ప‌రిశీలించండి. ఒక మాట అన‌డం చాలా సుల‌భం. కానీ, దాన్ని వెన‌క్కి తీసుకోవ‌డం చాలా క‌ష్టం. ఎవ‌రి కార‌ణాలు వారికుంటాయి. ఎవ‌రి ఇబ్బందులు, అభిప్రాయాలు వారికుంటాయి. అన్నిటినీ గౌర‌వించాల్సిన బాధ్య‌త మీడియా మీద వుంది. మీడియా ఉన్నది జరిగింది చూపడానికే కానీ విమర్శలు చేయడానికో … తిట్టడానికో కాదు.  ప్రజలు ఓటేయలేదని నోటికొచ్చిన రీతిలో మాట్లాడిన మీడియా సంస్థలు  ఎన్ని అక్రమాల మీద,  అఘాయిత్యాల మీద నోరు  మెదిపాయో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అసలు చానళ్లకు ఉన్న నిబద్ధత ఏమిటి ?  ఏపార్టీ కి అనుకూలంగా లేని చానళ్ళు  ఎన్ని ఉన్నాయి ? ఎన్ని నిష్పాక్షికం గా పనిచేస్తున్నాయి ?’చినిగిన చొక్కా అయినా తొడుక్కో, ఒక పుస్త‌కం కొనుక్కో’ అనేది పాత సామెత‌.
‘నీకు న‌చ్చిన అభ్య‌ర్థులు లేన‌ప్పుడు … నోటాకైనా వేసుకో, కానీ ఓటు మాత్రం వెయ్’ అనేది కొత్త సామెత‌.

————- Suresh Vmrg

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!