విమోచన vs జాతీయ సమైక్యతా !!

Sharing is Caring...

Separate paths…………………………………….

సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవం. దేశానికి ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే, రజాకార్ల పాలన నుంచి తెలంగాణకు సెప్టెంబర్ 17న విముక్తి లభించింది. హైద్రాబాద్‌ స్టేట్‌ భారతదేశంలో కలిసిన రోజు అది.

తెలంగాణ సాయుధపోరాటాల గురించి ఈ తరం వారికి అంతగా తెలియకపోవచ్చు కానీ ఆనాటి నిజాం నవాబు నిరంకుశ పాలన గురించి, రజాకర్ల అకృత్యాల గురించి, వాటిని ఎదుర్కొవడానికి జరిగిన తెలంగాణ సాయుధ పోరాటాల గురించి వెనుకటి తరం వారు ఈనాటికి  ఆనాడు వారు అనుభవించిన కష్టాల గురించి చెప్పుకుంటుంటారు.
 
దేశంలో మొదటిసారి ఎన్నికలు జరిగి మార్చి 1952లో బూర్గుల రామకృష్ణారావు సీఎం గా తొలి ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి ప్రజాస్వామ్యయుతంగా పాలన మొదలైంది. 1956లో హైదరాబాద్ ఆంధ్రాలో కలిసిపోయింది. 2014, జూన్ 2న మళ్ళీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా అవతరించింది.

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నేతృత్వంలో హైద్రాబాద్‌ స్టేట్‌ విలీనం జరిగింది గనుక, బీజేపీ పటేల్‌కి గుర్తింపుగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్‌ 17ని గుర్తించాలంటోంది. ఇక, మజ్లిస్‌ ఒత్తిళ్ళు, మైనార్టీల మనోభావాల్ని పరిగణనలోకి తీసుకుని విమోచన దినోత్సవం జరపలేదు తెలంగాణ సర్కార్‌.

అయితే, ఉమ్మడి రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ నేతలు.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని డిమాండ్ చేశారు. అప్పటి ప్రభుత్వాల్ని అస్థిర పరిచేందుకు, తద్వారా తెలంగాణ డిమాండ్‌ని గట్టిగా విన్పించేందుకు టీఆర్‌ఎస్‌ అత్యంత కీలకమైన సెప్టెంబర్‌ 17వ తేదీని తనకు కావాల్సిన విధంగా వాడేసుకుని, ఇప్పుడు మాత్రం గాలి కొదిలేసిందని  ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ ఎనిమిదేళ్లు  పూర్తి అవుతున్నా..నేటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదంటూ దుమ్మెత్తి పోస్తున్నాయి. 

ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ ను ఇరుకున పెట్టేందుకు సెప్టెంబర్ 17 న  పరేడ్ గ్రౌండ్స్‌లో  కేంద్రం అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.  ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా  ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.తెలంగాణ, కర్ణాటక, మహరాష్ట్ర ముఖ్యమంత్రులను  కూడా ఆహ్వానిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది సస్పెన్స్. 

ఇక కేంద్రానికి పోటీగా కేసీఆర్ సర్కార్  విమోచన పేరు ప్రస్తావించకుండా సెప్టెంబర్ 17 ను  తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటిస్తూ..  16, 17, 18 తేదీలల్లో  తెలంగాణ వ్యాప్తంగా.. ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’  వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. దీన్ని కేబినెట్ సమావేశం నిర్ణయించింది. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!