దేశంలో ప్రజలకు వ్యాక్సిన్ వేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం… కోర్టులు సైతం తప్పు పట్టడంతో మోడీ స్పందించారు . రాష్ట్రాలు వ్యాక్సిన్ పై ఒక్క రూపాయి కూడా వెచ్చించాల్సిన అవసరం లేదని .. కేంద్రం వ్యాక్సిన్లు కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఇస్తుందని తేల్చిచెప్పారు. వ్యాక్సిన్లు రాష్ట్రాలకు ఇచ్చే విషయంపై కేంద్రం తీరును రాజకీయ పార్టీల నేతలు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ నేపథ్యంలో మోడీ కొత్త నిర్ణయం ప్రకటించారు. భారత ప్రజలను ఉద్దేశించి అరగంట సేపు ప్రసంగించిన ప్రధాని మోడీ సూటిగా తాను చెప్పాలనుకున్నది… తన మనసులో ఏమున్నదో చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న టీకాల పంపిణీ కార్యక్రమాన్ని మే తర్వాత రాష్ట్రాలే తమ చేతుల్లోకి తీసుకుని, ఆ తర్వాత దాన్ని సమర్ధవంతంగా నిర్వహించలేక తప్పంతా కేంద్రం వేశాయని మోడీ మండిపడ్డారు. మోడీ ప్రసంగంలో తీవ్ర అసహనం కూడా వ్యక్తమైంది. జనవరి 16 నుంచి మే వరకూ టీకాల పంపిణీ చేస్తుండగా, 45ఏళ్లు దాటిన వయసు వారు వాటిని తీసుకోవడం జరిగిందని మోడీ గుర్తు చేశారు. అలాగే ఫ్రంట్ లైన్ వర్కర్లు, డాక్టర్లు పంచాయితీ సిబ్బందికి మాత్రమే ఇవ్వడం పైన విమర్శలు వచ్చాయన్నారు. సరే రాష్ట్రాలేదో ఉత్సాహ పడుతున్నాయి కదానీ వారికే వ్యాక్సినేషన్ కార్యక్రమం అప్పజెప్పామని, కొంతమేర వాటి శక్తిసామర్ధ్యాల మేర ప్రయత్నించినా, టీకాల పంపిణీలోని సమస్యలు మెల్లగా రాష్ట్రప్రభుత్వాలకీ తెలిసి వచ్చాయని ఆయన ఎత్తి పొడిచారు.
మొత్తం మీద కేంద్రం తప్పేమి లేదంటూనే జూన్ 21 నుంచి దేశంలోని 18ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి టీకాలు వేసే బాధ్యత కేంద్రానిదే అంటూ స్పష్టం చేశారు. అయితే నిర్వహణ , పర్యవేక్షణ బాధ్యత రాష్ట్రాల పరిధిలోనే ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఎన్నెన్ని టీకాలు పంపే విషయం ముందుగానే సమాచారం ఇస్తామని చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రులకి కూడా టీకాలు పంపిస్తామని … ఎక్కడా కూడా రూ.150 కంటే ఎక్కువ వ్యాక్సిన్లకు ఖర్చు పెట్టవద్దని మోడీ సూచించారు.
దేశంలో మొత్తం ఏడు కరోనా టీకాలు తయారవుతున్నాయని, నవంబర్ నాటికి నిర్దేశించిన వయసు వారికి 80 శాతం టీకాల పంపిణీ చేస్తామన్నారు. వ్యాక్సిన్లపై జనాల్లో అపోహలు సృష్టిస్తున్నారని అలాంటి వ్యక్తుల మాట వినవద్దని హెచ్చరించారు. లాక్‌డౌన్ నిర్ణయం లో కానీ వ్యాక్సినేషన్ వేసే నిర్ణయం లో కానీ తాము రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వగా, తప్పు కేంద్రంపై వేయడం సరికాదనే విషయాన్ని మోడీ తన మాటల ద్వారా స్పష్టం చేశారు. ఏది ఏమైనా ప్రధాని నిర్ణయం మంచిదే. ఇన్నాళ్ళకైనా ప్రజలతో నేరుగా మాట్లాడటం హర్షణీయమే.