అప్పట్లో ఆ ఇద్దరి పెళ్లి ఒక సంచలనం !

Sharing is Caring...

Hema Malini …………………………….తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ ఫ్యామిలీ కి చెందిన హేమమాలిని వెనుకటి తరం ప్రేక్షకుల డ్రీం గర్ల్. టాలీవుడ్ లో అగ్ర తార గా గుర్తింపు పొందింది. హేమమాలిని  ఇదు సతియం అనే తమిళ సినిమాలో సహాయ నటి పాత్రతో  హేమ తెరంగేట్రం చేశారు. సప్నో కా సౌదాగర్(1968) సినిమాతో హీరోయిన్ అయ్యారు. అప్పటి నుంచి ఆమె వెనుతిరిగి చూడలేదు.

బాలీవుడ్ లో ఎన్నో హిట్  సినిమాల్లో నటించింది.హేమ  ధర్మేంద్ర, రాజేశ్ ఖన్నా, దేవానంద్ వంటి పెద్ద హీరోలతో సినిమాలు చేశారు. హిట్ జంటగా పేరు పొందిన హేమమాలిని, ధర్మేంద్ర ప్రేమలో పడ్డారు. తుమ్ హసీన్ మెయిన్ జవాన్ షూటింగ్ సమయంలో ధర్మేంద్ర హేమమాలిని మొదటిసారి కలుసుకున్నారు. ఆ సినిమా నిర్మాణ సమయంలో ప్రేమలో పడ్డారు.

ధర్మేంద్ర అసలుపేరు దరమ్ సింగ్ డియోల్‌. అప్పటికే ధర్మేంద్రకు ప్రకాష్ కౌర్‌ తో  పెళ్లయింది. సన్నీ డియోల్ , బాబీ డియోల్ అనే ఇద్దరు మగ పిల్లలు  విజిత డియోల్, అజితా డియోల్ అనే ఇద్దరు ఆడపిల్లలున్నారు.ధర్మేంద్ర ఇంట్లో చెబితే విడాకులు ఇవ్వడానికి ప్రకాష్ కౌర్ అంగీకరించలేదు. ఇటు భార్యను .. అటు ప్రియురాలిని వదులుకోలేక ధర్మేంద్ర కొన్నాళ్ళు ఇబ్బంది పడ్డాడు. 

హేమమాలిని ఇంట్లో కూడా ఈ పెళ్ళికి ఒప్పుకోలేదు. షూటింగ్స్ కి ఆమె తల్లి కానీ తండ్రి కానీ తోడు వచ్చేవారు. ధర్మేంద్ర తో షూటింగ్ అంటే హేమ తండ్రి చక్రవర్తి కూడా తోడుగా వచ్చేవాడు. వాళ్ళిద్దరిని దూరంగా ఉంచడానికి ప్రయత్నించేవారు. ఒక ఇంటర్వ్యూలో హేమ స్వయంగా ఈ విషయాలను చెప్పారు. చివరికి ఇద్దరు ధైర్యం చేసి ఇస్లాం మతం స్వీకరించి పెళ్లి చేసుకున్నారు.

హిందూ వివాహ చట్టం ప్రకారం రెండో పెళ్లి కుదరదు కాబట్టి ఇస్లాం మతంలోకి మారారు. ధర్మేంద్ర తన పేరును దిలావర్ ఖాన్ కేవల్ కృష్ణగా మార్చుకోగా , హేమ తన పేరును ఐషా బి ఆర్ చక్రవర్తిగా మార్చుకుంది. 1980 లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ధర్మేంద్ర రెండు కుటుంబాలను జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాడు. ఆ పెళ్లిలో లొసుగులు ఉన్నాయని .. కోర్టుకు వెళ్ళమని కౌర్ కు బంధువులు సూచించారు. కానీ మధ్యవర్తులు రాజీ కుదిర్చారు.మొదట్లో ప్రకాష్ కౌర్ గొడవ చేసినా తర్వాత పిల్లల భవిష్యత్ కోసం రాజీ పడింది.

ఒకసారి మీడియా కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. ధర్మేంద్ర కొడుకు బాబీ డియోల్ ఒకసారి హేమమాలినిపై దాడి చేయ బోయాడనే పుకార్లు వచ్చాయి. మొదట్లో కొన్ని గొడవలు జరిగినా తర్వాత అన్ని సర్దుకున్నాయి. ధర్మేంద్ర కూడా మొదటి ఫ్యామిలీ ని నిర్లక్ష్యం చేయకుండా చూసుకున్నారు. హేమ కు కూడా ఈషా అహానా  అనే ఇద్దరు అమ్మాయిలున్నారు.

వివాహం తర్వాత కూడా హేమ సినిమాల్లో నటించారు. హేమ పాండవ వనవాసం, శ్రీకృష్ణ విజయం తెలుగు చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించారు. గౌతమి పుత్ర శాతకర్ణి లో హీరో బాలకృష్ణ తల్లి గౌతమి పాత్ర పోషించారు. ప్రస్తుతం 73 ఏళ్ళ వయసులోనూ ఆమె చురుగ్గా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 2003 నుంచి 2009 వరకు బీజేపీ తరపున రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు.  2014, 2019 లోకసభ ఎన్నికల్లో మధుర నుంచి ఎన్నికయ్యారు. 

———KNM 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!