డాక్టర్. కస్తూరి లక్ష్మీనారాయణ ……………………………………
ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు ఈ క్రింది నాలుగు వ్యవస్థలను, పరిస్థితులను అనుభవించాల్సిందే.. దేహము రూపాంతరాలు చెందుతున్న క్రమంలో , ఈ తనువు నుండి జీవుడు తరలి వెళ్లాల్సి ఉంటుంది.
“జన్మ మృత్యు జరా వ్యాధి.. దు:ఖ దోషాను దర్శనం”
మనిషిగా జన్మించిన ప్రతి వ్యక్తి పుట్టుక, చావు, ముసలితనము, వ్యాధులు-వీటి నుండి తప్పించుకొనే అవకాశమే లేదు. కానీ పుట్టుక అందరికీ సాధారణము, చావు మాత్రము ప్రతి ప్రాణికి తప్పనిసరి, కర్మ ఫలితము అనుభవించవలసి వస్తుంది.
ఎందుకంటే అనాయాస మరణము అందరికీ రాదు-కొందరికి మాత్రమే.. వ్యాధి గ్రస్తులై, కుటుంబ సభ్యులను ఇబ్బందికి గురి చేస్తూ చివరకు అపస్మారక స్థితి-వచ్చి, మృత్యువడిలోకి చేరవలసిందే. కానీ వ్యాధుల నుండి కొంత వరకు కాపాడుకునే ప్రయత్నం లో , ఆరోగ్యంగా జీవించడానికి, ప్రతి ఒక్కరూ యోగ మార్గాన్ని అనుసరిస్తూ ఓంకారాన్ని ప్రణవ మంత్రంగా ఉచ్చరిస్తే, మన దేహములోని ప్రతి అణువు స్పందిస్తుంది.
మన దేహములో, వెన్నెముక పొడవున ఏడు(7) కుండలి చక్రాలు అమరి ఉంటాయని మన యోగ సాధకులు సెలవిచ్చారు.
1) మాలాధార చక్రము 2) స్వాధిష్ఠాన చక్రము 3) మణిపూరక చక్రము
4) అనాహత చక్రము 5) విశుద్ధ చక్రము 6) ఆజ్ఞా చక్రము
7) సహస్రార చక్రము
1) మూలాధార చక్రము
ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు సాధకుడు, అ.కారము, పాటిస్తే, శ్వాసను, మనస్సును , మూలాధార చక్రముపై కేంద్రీకరించి, ఆ స్వరముతో ఓంకారాన్నిఉచ్చరిస్తే మలద్వార సమస్యలు( Piles & Fissures) అలాగే , మలబద్దకము నుండి కాపాడుకోవచ్చును.
2) స్వాధిష్టాన చక్రము
ఈ చక్రము నాభిక్రింది భాగము పొత్తికడుపు దగ్గర, శ్వాసను మనస్సును , అనుసంధానపరుస్తూ, అకార స్వరముతో ప్రాణాయమ ప్రక్రియ చేసినప్పుడు , మూత్రాశయ వ్యాధులు, మూత్ర పిండాల వ్యాధులు, (Nephrotic and renal diseases) రాకుండా కాపాడుకోవచ్చు.
3) మణిపూరక చక్రము
ఈ చక్రము నాభి దగ్గర ఉండును, దీనిపై మనస్సు కేంద్రీకరించి, ఉకారముతో పూరక, కుంభక, రేచకమును పాటిస్తూ సాధన చేస్తే నాభి బ్రహ్మదేవుని స్థానమును, కావున ఓంకారంతో , శ్వాసను నియంత్రిస్తే నాభిస్థాన నాడులు శక్తి జనితమగును, బలోపేతమౌను ప్లీహము ( Spleen) ఉండుకము ( Appendix) భాగములు, ఆరోగ్యవంతమగును.
4) అనాహత చక్రము
ఈ చక్రము చాతి కింది భాగము మధ్యలో ఉదరకోశ సమీపాన ఉండును. దీనిని కూడా, ఉకార శబ్ధముతో పూరక, కుంభక, రేచకముతో శ్వాసను నియంత్రిస్తే ఉదరకోశ వ్యాధులు (Digestive Disorders), కాలేయ సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు.
5) విశుద్ధ చక్రము
ఈ చక్రము మన కంఠ స్థానములో ఉండును, ఈ చక్రముపై శ్వాసను కేంద్రీకరించి , నోరు మూసుకొని మకార శబ్దంతో పూరకము, కుంభకము, రేచకము, పాటిస్తూ యోగ క్రియ చేస్తే, థైరాయిడ్, సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు (Lung Diseases) ట్రాన్సిలైటిస్ ఆహార నాళికి, స్వరపేటిక ( Laryngeal &Pharyngeal Diseases ) రాకుండా కాపాడుకోగలం.
6) ఆజ్ఞా చక్రము
ఈ చక్రము మన కనుబొమ్మల మధ్య, తిలక ధారణ స్థలములో ఉండును. దీనిలో కళ్ళు , నోరు మూసుకొని , మకార శబ్ధముతో పూరకము, కుంభకము, రేచకము చేస్తే చక్రాలన్నింటిని నియంత్రిస్తూ శరీరములో ( Auto Immono System) శక్తివంతమగును.
7) సహస్రార చక్రము
ఈ చక్రము ఇది ఎంతో సాధన చేస్తే కానీ దొరకదు. అయితే మనలాంటి సామాన్యులకు అతి కష్టం. గొప్ప సాధకులు, మునులు, రుషులు , తపస్సంపన్నులకు మాత్రమే సాధ్యము. ఇది మన మెదడులోని నాడులను జాగృత పరుస్తుంది.