Sacrifices for the country …………………..
సియాచిన్ గురించి తరచుగా మనం వార్తల్లో వింటుంటాం. సముద్ర మట్టానికి దాదాపు 5 వేల మీటర్ల ఎత్తులో ఈ సియాచిన్ ప్రాంతం ఉన్నది. మంచు గడ్డలతో కూడిన ప్రాంతమిది. కారాకోరం పర్వత శ్రేణిలో పెద్ద హిమనీ నదం ఇది. సుమారు 20 వేల అడుగుల ఎత్తయిన ఈ పర్వతం పై కాపలా అంటే మాటలు కాదు.
భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య సరిహద్దుగా ఉన్న ఈ ప్రాంతంలో మన సైనికులు రాత్రింబవళ్ళు కాపలా కాస్తుంటారు. మైనస్ 45 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత, రక్తం గడ్డ కట్టుకుపోయే చలి, తరచుగా మంచు తుపాన్లు వస్తుంటాయి. అయినప్పటికీ ప్రాణాలకు తెగించి భారత్ సైనికులు అప్రమత్తంగా ఉంటూ గస్తీ కాస్తుంటారు.
ఈ సియాచిన్ గ్లేసియర్ వందలాది మంది సైనికులను బలి తీసుకుంది. 1984 నుంచి మన సైనికులు ఈ ప్రాంతంలో కాపలా కాస్తూ దేశాన్ని రక్షిస్తున్నారు. ఏ క్షణంలో పాక్ సైనికులు దాడి చేస్తారో అని నిరంతరం వేయికళ్లతో నిఘా పెడుతుంటారు.
ప్రతినెలా మంచు కొండ చరియలు విరిగి పడటం లేదా హిమపాతాలు ఏర్పడి ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. నెలలో ఇద్దరు ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోతుంటారు. సియాచిన్ లో వాతావరణ పరిస్థితులు ఏ క్షణంలో ఎలా ఉంటాయో అంచనా వేయలేరు.
కొండల నడుమ మంచు కరిగి ప్రవహిస్తుంటుంది. ఈ కొండ నుంచి ఆ కొండ పైకి వెళ్లాలంటే అటు ఇటు స్థంభాలు పాతి తీగలపై పాక్కుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఆక్సిజన్ తక్కువగా లభిస్తుంది. సైనికుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన బట్టలు సరఫరా చేస్తారు. అయిదారు పొరలు కలిగిన ఆ బట్టల్లో కొంత వెచ్చదనం ఉంటుంది.
చేతులకు గ్లౌజులు ధరిస్తారు. కాళ్లకు స్పెషల్ బూట్లు వేసుకుంటారు. ఇవన్నీ ఉంటేనే కానీ అక్కడ ఉండలేరు. ఎక్కువ సేపు ఈ వాతావరణం లో ఉండటం మూలానా సైనికులు బరువు తగ్గిపోతుంటారు. జీర్ణ శక్తి క్షీణించి ఆకలి తగ్గుతుంది. నిద్ర సరిగ్గా పోలేరు. జ్ఞాపక శక్తి తగ్గుతుంది. మాటలో స్పష్టత పోతుంది. బేస్ క్యాంపు నుంచి కాపలా కాయాల్సిన ప్రదేశం దూరంగా ఉంటుంది. అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాలి.
పదిమంది సైనికులు చేతికి తాడు కట్టుకుని ఒకరి తర్వాత ఒకరు జాగ్రత్తగా నడుచుకుంటూ వెళతారు. ఎవరైనా మంచులో కూరుకుపోతే తాడు సహాయంతో పైకి లాగుతారు. ఒకప్పుడు వీరికి టాయిలెట్లు కూడా ఉండేవి కావు.
ఆ కొండల్లోనే దూరంగా కాలకృత్యాలకు వెళ్లే సమయంలో కూడా నలుగురైదుగురు కలసి చేతికి తాడు కట్టుకుని వెళ్లేవారు. ప్రస్తుతం బయో డైజెస్టర్ టాయిలెట్లను ఉపయోగిస్తున్నారు.సియాచిన్ కు సరఫరా అయ్యే జ్యుస్ డబ్బాలు గడ్డకట్టి పోతుంటాయి.వీటిని వేడి చేసి తాగాలి. కోడి గుడ్లు కూడా రాళ్ళలా తయారవుతాయి.
సైనికులు టీ కాచుకోవాలంటే గంటల సమయం పడుతుంది. గడ్డ కట్టిన మంచు కరిగి నీళ్లు వేడెక్కి.. తేయాకు అందులో మరగాలంటే అంత టైం పడుతుంది. మరిగిన తేనీటిని నిమిషంలో తాగకపోతే గడ్డకట్టి పోతుంది. పాలు,సూప్,తదితర ఆహారపదార్ధాలను డబ్బాల్లో అందిస్తారు.
చాకోలెట్, డ్రై ఫ్రూట్ లను కూడా పంపుతారు. నీళ్లు తాగాలంటే మంచు గడ్డను వేడి చేసుకుని తాగుతారు. స్నానం చేయడం మరీ కష్టం. బకెట్ నీళ్లు కావాలంటే గంటల మంచు కరగడానికి గంటల కొద్దీ టైం పడుతుంది. అందుకే అపుడపుడు స్నానం చేస్తుంటారు.
———-KNM