చైనా లోని అత్యంత ఎత్తైన టవర్స్ లో ఒకటి కాసేపు చిగురుటాకులా వణికింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. టవర్ లోని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు దీశారు. ఈ ఘటన షెంజెన్ నగరంలో జరిగింది. షెంజెన్ దక్షిణ చైనాలో పెద్ద నగరం. ఇది హాంకాంగ్‌కు దగ్గరలో ఉంటుంది. షెంజెన్ లోని ఎస్ ఈ జీ ప్లాజా మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో హఠాత్తుగా అటు ఇటు స్వల్పంగా కదిలింది. బయట నుంచి చూసిన వారు ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో టవర్ లో ఉన్న ప్రజలను బయటకు పంపించారు.
ఈ టవర్ లో ఎలక్ట్రానిక్ షాపులు, ఇతర వస్తువులు విక్రయించే షాపులున్నాయి. ఈ టవర్ ఎత్తు 980 అడుగులు (300 మీటర్లు) ఈ టవర్ నిర్మాణం 2000 సంవత్సరంలో పూర్తి అయింది. ఇదిలాఉంటే ఎమర్జన్సీ మేనేజ్మెంట్ అధికారులు ఎలాంటి భూకంపం సంభవించలేదని చెబుతున్నారు. అయితే టవర్ వణికిన విషయాన్ని గుర్తించామని … టవర్ ఎందుకు వణికింది అనే అంశంపై విచారణ చేస్తున్నామని అంటున్నారు. ప్రమాదం ఏదీ జరగలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించేది.
చైనా లో శరవేగంతో అభివృద్ధి చెందుతున్న నగరాల్లో షెంజెన్ ఒకటి. 12 మిలియన్లకు పైగా జనాభా ఉన్న ఈ నగరం నడిబొడ్డున ఈ ఎత్తు అయిన టవర్ ను నిర్మించారు. ప్రపంచంలో ఎత్తైన టవర్స్ ఐదు చైనాలో ఉన్నాయి.ఇటీవల కాలంలో ఎత్తైన టవర్ల నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదు.