వివాదాలు — విడుదల కష్టాలు !

Sharing is Caring...

“గంగూభాయి కతియావాడి” సినిమా విడుదల మరో మారు వాయిదా పడింది. గత ఏడాది సెప్టెంబర్ లో ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కరోనా వల్ల షూటింగ్ బాగా ఆలస్యం అయింది. ఈ క్రమంలో ఈ ఏడాది జులై 30 న విడుదల అవుతుందని ప్రకటించారు. సెకండ్ వేవ్ కరోనా కారణంగా ఇంకా దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. అన్ని రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ కాలేదు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి.

గంగూ భాయి కథ కల్పితం కాదు.. నిజ జీవిత కథే. 1960 వ దశకంలో ముంబై రెడ్ లైట్ ఏరియా కామాటిపురా లో ఈ గంగూ భాయి ఓ వెలుగు వెలిగింది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ గంగూ భాయి జీవిత కథ పట్ల ఆకర్షితులై సినిమా తీశారు.  గంగూభాయి గా ఆలియా నటించింది. సంజయ్ లీలా భన్సాలీ ఈ ప్రాజెక్టు టేకప్ చేసినప్పటి నుంచి వివాదాలు కూడా తలెత్తాయి. గంగూ భాయ్ పెంపుడు కుమారులు కోర్టు కెళ్ళారు. ఇక కరోనా కారణంగా షూటింగ్ కూడా వాయిదా పడింది. చివరికి విడుదల తేదీ కూడా మార్చుకున్నారు. ఓటీటీ లో రిలీజ్ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే సంజయ్ లీలా భన్సాలీ మాత్రం ఓటీటీ లో రిలీజ్ కి సుముఖంగా లేరని అంటున్నారు.

ఇక గంగూబాయి ది గుజరాత్ లోని  కతియావాడి. సినిమాలంటే గంగూభాయి కి  విపరీతమైన పిచ్చి. ఆ పిచ్చిలో ఉండగానే తండ్రి దగ్గర పనిచేస్తున్న కుర్రాడితో ప్రేమలో పడింది.ఇంట్లో చెప్పకుండా, వెనుకా ముందూ చూడకుండా అతగాడితో బొంబాయి పారిపోతుంది. బొంబాయి వచ్చాక కొన్నాళ్ళు ఆ ఇద్దరు కలసి కాపురం చేశారు. అంత పెద్ద నగరం  గంగూబాయికి బాగా నచ్చగా, ఆ కుర్రాడు మాత్రం భయపడిపోయాడు. చేతిలో డబ్బుల్లేవు. పోషణ కష్టమైంది. ఒక రోజు గంగూబాయికి మాయ మాటలు చెప్పి తీసుకెళ్లి ఆమెను ఒక వేశ్యాగృహంలో 500 రూపాయలకు అమ్మేసి పారిపోతాడు. 

అప్పటినుంచి గంగూ భాయి జీవితం అనూహ్యమైన మలుపులు తిరుగుతుంది. తొలుత వ్యభిచార వృత్తి చేసేందుకు గంగూ ఒప్పుకోలేదు. ఏడ్చింది ..మొత్తుకుంది..చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో వృత్తిని అంగీకరించింది. ఒక సారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే  అందగత్తె గంగూ.దానికి తోడు కొంచెం చదువు ఉండటంతో గంగూ ను ఆ వ్యభిచారగృహ నిర్వాహకులు పెద్ద పెద్ద క్లయింట్ల దగ్గరకు మాత్రమే పంపేవారు.

అలా ఆమె కోసం వచ్చే వారిలో నేరగాళ్లు కూడా ఉండేవారు. దాంతో ఆమెకు ముంబాయి మాఫియా గురించి తెల్సింది. అప్పట్లో కరీం లాలా బొంబాయిలో పెద్ద డాన్. అతని మాటకు తిరుగులేదు. ఈ కరీం లాలా కు చెందిన వ్యక్తి గంగూలీ పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒకరోజు నమాజు కి వెళ్లి వస్తున్న కరీం లాలా ను కలసి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పింది. అతనికి గంగూ మాట్లాడే విధానం బాగా నచ్చుతుంది. ఆమెను ఓదార్చుతాడు. ఆమె రాఖీ కడితే కట్టించుకుంటాడు. ఆమెకు అండగా ఉంటానని అభయం ఇస్తాడు. కామాటి పురాలో గంగూ జోలికి ఎవరొచ్చినా ఊర్కోబోను అంటాడు. అంతే .. గంగూ తన తెలివి తేటలతో మకుటం లేని మహారాణిగా ఎదుగుతుంది.

గంగూ బలవంతపు వ్యభిచారాన్ని ప్రోత్సహించలేదు. కామాటి పురా లో వృత్తిగా స్వీకరించడానికి ఇష్టపడేవాళ్లే ఉండాలని స్పష్టం చేసింది. ఎవరైనా ఈ కూపం నుంచి బయట పడాలనుకుంటే వెళ్లి పొమ్మనేది. అక్కడ ఉన్న వేశ్యల బాగోగులతోబాటు, వారికి పుట్టిన బిడ్డల బాగోగులు కూడా గంగూ చూసేది.దీంతో ఆమె కు అక్కడ మంచి పేరు వచ్చింది. కథలో మరెన్నో మలుపులు కూడా ఉన్నాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. హుస్సేన్ జైదీ రాసిన పుస్తకం “మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై ” ఆధారంగా ఈ బయోపిక్ తీశారు. రచయిత  పుస్తకం రాసేముందు తమను కలవలేదని … అనుమతి తీసుకోలేదని గంగూ కుమారుల అభియోగం.

 
—————–KNMURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!