దివంగత నేత జయలలిత తమిళనాడు సీఎంగా ఉన్నపుడు రూ. 66 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పట్లో ఆమెపై కేసులు నమోదు అయ్యాయి. తమిళనాడులో ఈ కేసును విచారణ చేయకూడదని డీఎంకే కోర్టును ఆశ్రయించింది. 2003 లో ఇందుకు స్పందించిన సుప్రీం కోర్టు కేసు విచారణను బెంగళూరుకి బదిలీ చేసింది. అప్పటినుంచి కేసు విచారణ కర్ణాటకలో జరిగింది. 12 సంవత్సరాల పాటు కేసు విచారణ జరిగింది. ఈ 12 ఏళ్లలో కేసుల విచారణ కోసం కర్ణాటక ప్రభుత్వం రూ. 5.11 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ మొత్తాన్ని హోమ్ శాఖ అప్పట్లోనే ప్రకటించింది. ఆతర్వాత సుప్రీం కోర్టు కెళ్ళినపుడు మరింత ఖర్చు పెట్టింది. ఆ ఖర్చుల తాలూకూ లెక్కలు ఆలస్యంగా బయటకొచ్చాయి.
అక్రమ ఆస్తులకేసులో ఇరుక్కున్న జయలలితకు వ్యతిరేకంగా వాదించేందుకు కర్ణాటక సర్కార్ భారీ పారితోషకాలను లాయర్లకు సమర్పించుకుంది.
జయలలిత పై ఉన్న ఆరోపణలను నిరూపించేందుకు సీనియర్ న్యాయవాదులను ప్రభుత్వం నియమించింది. ఇందుకోసం పెద్ద మొత్తాలనే లాయర్లకు ఫీజు రూపంలో చెల్లించింది. ఇందులో నిజం ఎంత అన్న విషయంపై అధికారిక సమాచారం లేదు. దీంతో బెంగళూరు నగరానికి చెందిన సామాజిక కార్యకర్త టి. నరసింహ మూర్తి ఆర్టీఐ కింద ఈ కేసులో సుప్రీం లో వాదించడానికి కర్ణాటక ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో వివరాలు ఇవ్వాలంటూ దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత మెల్లగా వివరాలు బయటకొచ్చాయి.
అప్పట్లో అక్రమ ఆస్తుల కేసు విచారణకు కర్ణాటకలో సీబీఐ ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసింది. ఈ కోర్టులో విచారణ దరిమిలా జయలలితను కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ తీర్పుపై జయ హైకోర్టు కి వెళ్లడంతో అక్కడ జయలలితను నిర్దోషిగా ప్రకటించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కి వెళ్ళింది. అక్కడ జయకు వ్యతిరేకంగా వాదించేందుకు వీలుగా కర్ణాటక ఈ కేసును సీనియర్ న్యాయవాదులకు అప్పగించింది. ఈ సందర్భంగానే కోట్ల రూపాయల ఫీజు ను లాయర్లకు చెల్లించింది. జయలలిత కు వ్యతిరేకంగా సుప్రీం లో వాదించిన బీవీఆచార్య కు అందరికంటే ఎక్కువ చెల్లించారు. ఆయనకు ఇచ్చిన ఫీజు మొత్తం రూ.10686018. మాత్రమే. ఈ కేసులో నిందితులైన శశికళ ,ఇళవరసి , సుధాకరన్ లు జైలుకి వెళ్ళడానికి కారణమైన సీనియర్ న్యాయవాది ఆచార్య కంటే మిగిలిన న్యాయవాదులకు చెల్లించిన ఫీజులు తక్కువే. న్యాయవాదులు దుశ్యంత్ దవే కి రూ.9516500, అరిస్టాటిల్ కి రూ.3201070, సందీప్ చౌతేకు రూ.4223643 , మధుసూదన్ నాయక్ కు రూ.243657 మొత్తాన్ని చెల్లించినట్టు ప్రభుత్వం తెలియజేసింది.
కాగా అక్రమ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న జయలలిత అండ్ కో ను దోషులుగా నిరూపిస్తూ వాదనలు వినిపించిన లాయర్లకు మొత్తంగా ఖర్చు పెట్టింది రూ.2.79 కోట్లుగా లెక్క తేలింది. ఈ మొత్తాన్ని తమిళ నాడు ప్రభుత్వం నుంచి వసూలు చేయనున్నట్టు అప్పట్లో కర్ణాటక హైకోర్టు అడ్వొకేట్ జనరల్ కార్యాలయం ప్రకటించింది. ఈ సమాచారం 2018 లో బయటకొచ్చింది.
ఈ కేసులో న్యాయస్థానం తీర్పును రిజర్వ్ లో పెట్టింది. తీర్పు రాకుండానే జయలలిత కన్ను మూసారు. తీర్పు వచ్చాక మిగతా వారు జైలుకెళ్లారు.
జయలలితను దోషిగా ప్రకటించబోమని సుప్రీం స్పష్టం చేసింది. దీంతో ఆమె నిర్దోషిగానే మరణించినట్టు అయింది. కర్ణాటక ప్రభుత్వం రివ్యూ పిటీషన్ వేసినప్పటికీ జయలలిత మరణించడంతో ఆమెను దోషిగా ప్రకటించలేమని సుప్రీం బెంచ్ తేల్చి చెప్పింది. అయితే ఆమెకు రూ.100 కోట్ల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని ఆస్తుల జప్తు ద్వారా రాబట్టారు. మొత్తం మీద పదిహేనేళ్లలో సీబీఐ కోర్టు నుంచి సుప్రీం వరకు జరిగిన విచారణకు అయిన ఖర్చు 8 కోట్లు. తెర వెనుక జరిగే ఈ తతంగమంతా బయటి వారికి తెలీదు. ఇక ఇపుడు కూడా ప్రభుత్వాలు పలు కేసుల్లో ప్రైవేట్ లాయర్లను పెట్టుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నాయి.
——————- KNMURTHY
రాను రాను కోర్టులు తమ ‘విలువ ‘ పోగొట్టుకుంటున్నాయ్….కొన్ని ప్రభుత్వాలు/ప్రతిపక్షాలు వాటిని డబ్బుతో, అక్కడ క్కడ, మచ్చిక చేసుకుంటున్నాయ్ !