దొంగ స్వామి నిత్యానందుడు దేశం నుంచి పారిపోయి అటు ఇటుగా ఏడాది అవుతోంది. అంతకుముందు ఇండియాలో ఉండి కూడా పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరిగాడు.నిత్యానందుడు మారువేషంలో విదేశాలకు వెళ్ళాడేమో అన్న సందేహాలు కూడా లేకపోలేదు. ఎలా వెళ్ళాడు ? ఎక్కడికి వెళ్ళాడు ? అనే విషయం పై సరైన సమాచారం లేదు.ఇప్పటివరకు ఆయన ఎక్కడున్నాడో ఎవరికి తెలీదు.
మన పోలీసులు ఇంకా పరిశోధన చేస్తున్నామంటున్నారు కానీ ఆనుపానులు మాత్రం కనిపెట్టలేకపోతున్నారు.తాను కైలాస దేశం సృష్టించుకుని అక్కడ ఉంటున్నానని నిత్యానందుడు ప్రకటించుకున్నప్పటికీ ఆమాటలు నమ్మబుద్దికావడం లేదు.
అయితే అతగాడు మరెక్కడున్నాడు ? అదే మిస్టరీ. నిత్యానంద చెబుతున్న మాటలన్నీ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ బ్యాంక్ పెట్టడం , కరెన్సీ రిలీజ్ చేయడం అంత సులభమైన విషయం కాదు. అసలు ఈక్వెడార్ ప్రాంతంలో దీవి ఎవరికి అమ్మలేదని ఆ దేశపు అధికారులు కూడా ప్రకటించారు.
ఓ చిన్న ద్వీపంలో తనకు తానుగా ఓ దేశాన్ని సృష్టించుకోవడం అంత సులభమా ? అందుకు తగ్గట్టు చట్టాలు, ఇతరత్రా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం సాధ్యమేనా ? అనే సందేహం కలగకమానదు. నిత్యానంద సృష్టించిన కైలాస దేశం అనేది నిజమా?అబద్ధమా ? అక్కడికి పోయి చూసినవారు లేరు. ఆయన అనుచరులు ఎక్కడో కూర్చుని చేస్తున్న ప్రకటనల ద్వారానే సమాచారం బయటకు వస్తోంది .
కనీసం ఈ అనుచరులు ఎక్కడనుంచి సమాచారం మీడియాకు పంపుతున్నారో కూడా తెలియడం లేదు.
ప్రాగ్జి సర్వర్స్ ద్వారా వీడియోలను నిత్యానంద కానీ ఆయన అనుచరులు కానీ విడుదల చేస్తున్నారని పోలీసులు తేల్చారు.
అహ్మదాబాద్ పోలీసులు నిత్యానంద ఈక్వెడార్ ,ట్రినిడాడ్ ,టొబాగో పరిసరాల్లో సంచరిస్తున్నారని అనుమానిస్తున్నారు.
అలాగే మలేషియా కూడా వెళ్లి ఉండొచ్చని అంటున్నారు .
అక్కడ నుంచే వెబ్సైటు రూపొందించి సమాచారాన్ని ప్రపంచానికి విడుదల చేస్తున్నారని చెబుతున్నారు.
గతంలో నిత్యానంద ఒక యూనివర్శిటీ నెలకొల్పేందుకు మలేషియా తో ఒప్పందం కుదుర్చుకున్నారు .
ఆ ఒప్పందం క్రమంలో ఈ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయిదేళ్ల క్రితం సినీనటి రంజితతో సరససల్లాపాల్లో మునిగి తేలిన నిత్యానందుడు వీడియోల సాక్షిగా అడ్డంగా దొరికిపోయాడు. అతడి వద్ద దాదాపు 15 వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఆ కేసులో నుంచి పూర్తిగా బయట పడకముందే గుజరాత్ ఆశ్రమం కు మకాం మార్చాడు .
ఇతగాడిపై కర్ణాటకతో సహా, ఇండియాలో పలుచోట్ల క్రిమినల్ కేసులున్నాయి . ఓ రేప్ కేసులోనూ ప్రధాన నిందితుడు . మొత్తం మీద నిత్యానంద పోలీసుల కళ్ళు గప్పి ఇండియా వదిలి పోయాడు. ఎప్పటికైనా పోలీసులకు చిక్కుతాడా ? చట్టానికి దొరుకుతాడా ? చూద్దాం ఏమి జరుగుతుందో ?
మూర్తి గారి నేతృత్వంలో చూపుడు వేలు అన్యాయాల వైపు చూపిస్తూ
సమస్య పరిష్కారానికి దారి చూపే కర దీపిక గా నిలుస్తోంది.
యు.వి.రత్నం
ఒంగోలు