ఆ చైనా ప్రాజెక్ట్ తో ఇండియాకు ముప్పా ?

Sharing is Caring...

హిమాల‌యాల్లో ప్ర‌వ‌హించే న‌దుల్లో బ్ర‌హ్మ‌పుత్ర ఒక‌టి. ఈ నది పుట్టింది టిబెట్‌లో. ఈ నదిని  అక్క‌డ యార్లుంగ్ ఝాంగ్బో అంటారు.  టిబెట్‌లోని మిడాగ్ జిల్లాలో ఈ నదిపై భారీ జ‌ల విద్యుత్తు ప్రాజెక్టును చైనా నిర్మించ‌బోతోంది. ఇది అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది.

చైనా పంచ‌వ‌ర్ష ప్ర‌ణాళిక‌లో కూడా ఈ నదిపై సూప‌ర్ డ్యామ్ కోసం బ‌డ్జెట్ కేటాయించింది. భార‌త్‌లో బ్ర‌హ్మ‌పుత్ర ప్ర‌వేశించ‌డానికి ముందే ఈ భారీ డ్యామ్‌ను టిబెట్‌లో చైనా నిర్మిస్తోంది. స‌ముద్ర మ‌ట్టానికి 4900 అడుగుల  ఎత్తులో ప్ర‌వహించే బ్ర‌హ్మ‌పుత్ర ఎగువ‌న చైనా నిర్మిస్తున్న డ్యామ్ ద్వారా ఏడాదికి 300 బిలియ‌న్ల కిలోవాట్ల విద్యుత్తు ఉత్ప‌త్తి చేయాలని ప్లాన్ చేస్తోంది డ్రాగన్.

ప్ర‌స్తుతం చైనాలో ఉన్న అతిపెద్ద డ్యామ్ త్రీ గోర్జెస్‌. ఆ డ్యామ్ క‌న్నా పెద్ద సైజులో ప్ర‌స్తుతం బ్ర‌హ్మ‌పుత్ర‌పై క‌ట్టాల‌ని చైనా సన్నాహాలు చేస్తోంది. త్రీ గోర్జెస్ డ్యామ్ క‌న్నా.. కొత్త‌గా నిర్మించ‌బోయే డ్యామ్ మూడు రెట్లు అధికంగా  విద్యుత్తును ఉత్ప‌త్తి చేస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. దీని కోసం జల విద్యుత్ సంస్థ పవ‌ర్ చైనా తో  చైనా ఒప్పందం కుదుర్చుకుంది. త్రీ గార్జెస్ డ్యామ్ 2020లో 103 బిలియ‌న్ల కిలోవాట్ల విద్యుత్తును ఉత్ప‌త్తి చేసింది.

ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు మాత్రం ఈ డ్యామ్ ను  వ్య‌తిరేకిస్తున్నారు. త్రీ గార్జెస్ నిర్మాణ స‌మ‌యంలో సుమారు 14 ల‌క్ష‌ల మంది నిరాశ్ర‌యుల‌య్యారు. టిబెట్‌లో డ్యామ్ నిర్మాణం వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్యం దెబ్బ‌తినే అవ‌కాశాలు ఉన్న‌ట్లు చెబుతున్నారు.  ఇండియా కూడా ఈ డ్యామ్ నిర్మాణం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తోంది.

బ్రహ్మపుత్ర నది స్వభావం తెలిసిన ఇండియా ఏదైనా విపత్తు సంభవించినపుడు ఘోర ప్రమాదాలు జరిగితే  ఎలా ఎదుర్కోవాలా అని  దిగువ ప్రాంతంగా ఆలోచిస్తోంది. ప్రధానంగా పర్యావరణం దెబ్బతినే అవకాశాలున్నాయి. మిడాగ్  ప్రాంతంలో  కొండచరియలు విరిగిపడటం,  హిమపాతాలు ఏర్పడటం,  ఆకస్మిక వరదలు  సహజం. ఏదైనా అనుకోని విపత్తు సంభవిస్తే అస్సాం ,అరుణాచల్ ప్రదేశ్ లకు ముప్పు పొంచి ఉంటుందని భారత్ ఆందోళన పడుతోంది. ఎప్పటికప్పుడు ఈ విషయాలను చైనా కు తెలియజేస్తున్నది.  అయినా చైనా పట్టించుకోవడం లేదు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!