వెయ్యేళ్ళనాటిది ఈ ధేనుపురీశ్వరాలయం !

Sharing is Caring...

Oldeset Temple ………………

ప్రపంచం మొత్తం A.Dలో ఉన్నప్పుడే 3Dలో శిల్పాలు చెక్కిన ఆధునికత మనది. వెయ్యేళ్ళ చరిత్ర గల ధేనుపురీశ్వర ఆలయం చెన్నై లోని మాడంబాకంలో ఉంది. చోళ రాజుల పాలనలో ధేనుపురీశ్వర ఆలయం నిర్మితమైంది. అద్భుతమైన బృహదీశ్వర ఆలయాన్ని కూడా తంజావూరులో అదే సమయంలో కట్టారు.

ఈ ఆలయం అద్భుతమైన ద్రవిడ నిర్మాణ శైలికి అద్దం పడుతుంది. తమిళనాడులోని ఇతర దేవాలయాల మాదిరిగానే, గర్భగుడి నిర్మాణం అర్ధ వృత్తాకారంగా ఉంటుంది. ఇది నిద్రిస్తున్న ఏనుగు వెనుకభాగాన్ని పోలి ఉంటుంది, అది గుడి వెనుక నుంచి ప్రదక్షిణగా వచ్చేప్పుడు కనపడుతుంది.

ఆలయం లోపల కెళితే నిలువెత్తు గంభీరంగా రాజగోపురం దర్శనం ఇస్తుంది.దాటి లోపలి కెళితే పెద్ద రాతి కట్టడంతో దేవాలయం కనిపిస్తుంది. ధ్వజ స్థంభంకు  నమస్కరించి..లోపలకు వెళ్లేముందు..రాతి స్థంభాలతో ముఖ మండపం..ఒక్కోస్థంభం లో ఒక్కో దేవతా మూర్తి దర్శనమిస్తారు.

హనుమంతుడు,ప్రత్యంగిరా,దుర్గ,కాలభైరవ మూర్తులు చెక్కి ఉంటాయి..వాటికి అక్కడే ప్రత్యేక దినాలలో పూజలు చేస్తారు. ఇక్కడే మనం నారసింహ శిల్పాన్ని చూడవచ్చు. ఎంత అద్భుతంగా చెక్కారో నాటి శిల్పులు. అక్కడనుండి గర్భగుడి లోకి కాలు పెడుతూనే..ఇంకో పెద్ద ముఖ మండపం..అక్కడ అమ్మవారి సన్నిధి,నవగ్రహాలు.,పల్లకి..ఉంటాయి. 

ఇక్కడ అమ్మవారిని ధేనుకాంబల్ అని పిలుస్తారు. ఇక శివ సన్నిధిలోకి అడుగుపెట్టగానే ఒక అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతాం. నల్ల రాతి కట్టడం..ఏ హంగులు ఉండవు.. విద్యుత్ ఉన్నా గర్భగుడిలో కేవలం దివిటీ ల వెలుగులోనే స్వామిని..ఎంత జనమున్నా…హాయిగా..కనులారా ..5 అడుగుల దూరం నుండి దర్శించుకోవచ్చు.

ఇక్కడ శివుడు స్వయంభువు. ఆవుగా జన్మించమని శాపం పొందిన కపిల ఋషి ఈ ప్రదేశంలో విముక్తి పొందాడని చెబుతారు. ఋషి తన ఎడమ చేతిని ఉపయోగించి శివుడికి ప్రార్థనలు చేసి శాపగ్రస్తుడయ్యాడు. ఆవుగా జన్మించి మట్టిలో పూడిన శివలింగంపై నిత్యం పాలు పోసి శాప విమోచనం పొందాడట.

ఆయనకిచ్చిన వరం మూలంగా ధేనుపురీశ్వర ఆలయం వెలసింది. మాడంబాకం ఇదివరలో పండితులకు నివాసం గా ఉండేది.  పాత రోజుల్లో ఈ ప్రాంతాన్ని చతుర్వేది మంగళం అని పిలిచేవారు. ఆలయ ప్రాంగణం లో పెద్ద కోనేరు కూడా ఉంది .  చెన్నై వెళ్లిన వారు ఈ క్షేత్రాన్ని చూసి రావచ్చు.

 ———– సుధాక్రిష్  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!