“ఝండా ఊంచా రహే హమారా” అన్నందుకు జైల్లో పెట్టారు !

Sharing is Caring...

Flag song  story ……………………………………………

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా ఆ గీతం వింటుంటే ఒళ్ళు పులకిస్తుంది. ఇప్పటికీ ఎప్పటికీ దేశభక్తి ని రగిలిస్తూనే ఉంటుంది. అదే..’ఝండా ఊంచా రహే హమారా.. విజయీ విశ్వ తిరంగా ప్యారా..’ గీతం. కోట్ల మంది భారతీయుల హృదయాలను ఉప్పొంగించిన ఆ గీతాన్ని రాసింది ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ కి చెందిన శ్యామ్ లాల్ గుప్తా ప్రసాద్.

1924లో ఆయన ఈ గీతాన్ని రాశారు. 1923లో ఫతేపూర్ జిల్లా కాంగ్రెస్ సమావేశంలో ఆధునిక త్రివర్ణ పతాకం  రూపాన్ని నిర్ణయించారు. రెపరెపలాడే పతాకాన్నిపట్టుకున్నపుడు జనాలకు స్ఫూర్తి కలిగించేలా ఒక మోటివేషనల్ సాంగ్ ఉంటే బాగుంటుందని అప్పటి నాయకులు అనుకున్నారు.

ఆ విషయం శ్యామ్‌లాల్ గుప్తాకు చేరడంతో ఆ రాత్రంతా కూర్చొని “ఝండా ఊంచా రహే హమారా” గీతాన్ని రాసాడు. తానే స్వయంగా పాటను కంపోజ్ చేశాడు. అనంతరం ఈ గీతం స్వాతంత్య్ర ఉద్యమంలో ఒక భాగంగా మారింది. జలియన్ వాలాబాగ్ అమరవీరుల జ్ఞాపకార్థం శ్యామ్ లాల్ 1924 మార్చి 3న కాన్పూర్ ఫూల్ బాగ్ మైదానంలో జవహర్‌లాల్ నెహ్రూ సమక్షంలో తొలిసారి ఆలపించారు.

వెంటనే నెహ్రూ.. శ్యాంలాల్ ను కౌగిలించుకుని ఈ గీతం దేశచరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అభినందించారు.ఈ గీతాన్ని రాసినందుకు శ్యామ్ లాల్ కు బ్రిటిష్ ప్రభుత్వం జరిమానా విధించి జైలుకు పంపింది. స్వాతంత్య్రం వచ్చాక ఎర్రకోట నుంచి ఈ జాతీయ గీతాలాపన జరిగింది. అప్పటి నుంచి దీనికి ఫ్లాగ్ సాంగ్ పేరు స్థిరపడిపోయింది. 1952 ఆగస్టు 15న ఎర్రకోట వద్ద శ్యామ్ లాల్ స్వయంగా ఈ గీతాన్ని ఆలపించారు.

ఆయన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 1973లో పద్మశ్రీతో సత్కరించింది.ఆయన జిల్లా పరిషత్ లో ఉపాధ్యాయుడిగా చేసారు.అప్పటి ప్రభుత్వం మూడేళ్లు కాంట్రాక్టు పై సంతకం చేయమంటే ఉద్యోగం వదిలేసారు. మరోసారి కూడా అలాగే జరిగింది. 15 ఏళ్ల వయసులో శ్యామ్‌లాల్ రచనలు మొదలు పెట్టాడు.

తర్వాత కాలంలో అన్ని ఉద్యమాలలో పాల్గొన్నాడు. 8 సార్లు జైలుకెళ్లి మొత్తం 6 ఏళ్ళు జైలులో గడిపారు. దేశానికి విముక్తి లభించే వరకు చెప్పులు వేసుకోనని ప్రతిజ్ఞ చేసాడు. 1973లో పద్మశ్రీ అవార్డు అందుకోవడానికి శ్యామ్‌లాల్ గుప్తాను ఢిల్లీకి పిలిచినప్పుడు, అరువు తెచ్చుకున్న ధోతీ ధరించి వేదికపైకి వచ్చారు.

నిజాయితీకి మరో పేరు అయిన శ్యామ్‌లాల్‌ పరిస్థితి చూసి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఉద్వేగానికి లోనయ్యారు. ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇవ్వగా శ్యామ్‌లాల్ అందుకు అంగీకరించలేదు. 10 ఆగస్టు 1977 రాత్రి, 81 సంవత్సరాల వయస్సులో శ్యామ్‌లాల్ గుప్తా కాన్పూర్‌లోని జనరల్‌గంజ్ ప్రాంతంలో ఒక చిన్న ఇంట్లో  ప్రపంచానికి వీడ్కోలు పలికారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!