మ‌రో లోకానికి తీసుకెళ్లే ఆ రెండు సినిమాలు !!

Sharing is Caring...

Gr.Maharshi …………………………

Movies that spoil the mood

సినీ అభిమాని సుబ్బారావు జ‌బ్బు ప‌డ్డాడు. వ‌రుస‌గా రెండు సినిమాలు చూసి, అంతు చిక్క‌ని అప‌స్మారక స్థితికి వెళ్లాడు. డాక్ట‌ర్లు గంట‌గంట‌కి బిల్ పెంచుతున్నారు త‌ప్ప‌, వ్యాధిని త‌గ్గించ‌లేక‌పోతున్నారు. తెలివి వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఒక‌సారి ‘క‌ర‌క‌ర వీర‌మ‌ల్లు’ కోహినూర్ తెచ్చాడా? అని, ఇంకోసారి కానిస్టేబుల్ ‘కింగ్‌డ‌మ్’ స్థాపించాడా? అని అడుగుతూ న‌ర్సుల‌ని భ‌య‌భ్రాంతుల్ని చేస్తున్నాడు.

సెలైన్లు ఎన్ని పెట్టినా, ఆన్‌లైన్‌లో డ‌బ్బులు దండ‌గ అని గ్ర‌హించిన కుటుంబ స‌భ్యులు ఇంటికి తీసుకెళ్లి మృత్యుంజ‌య పూజ మొద‌లు పెట్టారు. నుదుట విభూది పెడితే లేచి కూచుని ర‌క్ష‌కుడి రాక కోసం ఎదురు చూస్తున్నాన‌ని పొడ‌గాటి క‌ర్ర సాయంతో నిల్చున్నాడు. లాభం లేద‌నుకుని ఫిల్మ్ న‌గ‌ర్‌లోని తాంత్రికున్ని పిలిపించారు. తెలుగు సినిమాలు చూసి జ‌డుసుకున్న ప్రేక్ష‌కుల‌కి ప్ర‌త్యేక భూత వైద్యం ఆయ‌న స్పెషాలిటీ. సినిమా జాన‌ర్‌ని బ‌ట్టి చికిత్స‌. టీవీ సీరియ‌ళ్ల దీర్ఘ‌కాలిక రోగుల‌కి ప్ర‌త్యేక ప్యాకేజీ కూడా ల‌భిస్తుంది.

సుబ్బారావు క‌ళ్లు చూడ‌గానే ఉప‌ద్ర‌వాన్ని ప‌సిగ‌ట్టాడు తాంత్రికుడు. ఏ సినిమాకైనా ఎనిమానే చికిత్స అని ముందు ఆ ప‌ని చేసాడు. మోష‌న్ పిక్చ‌ర్‌కి ఆయ‌న నిర్వ‌చ‌నం ఇది. నిమ్మ‌ళించి, శాంతించిన‌ సుబ్బారావు నుదుట ర‌క్త వ‌ర్ణ తిల‌కం దిద్ది, చేతికి ర‌క్ష‌మాల క‌ట్టాడు. సంకోచం లేకుండా జ‌రిగింది చెప్ప‌మ‌న్నాడు.

చేత్తో గుండ్రాళ్లు చుట్టి ప్లాష్ బ్యాక్‌ని సింబాలిక్‌గా చూపిస్తుంటే అడ్డుకుని అది బ్లాక్ అండ్ వైట్ నాటి టెక్నిక్‌, ఇప్పుడు క‌థ‌కి ముందువెనుక‌లు అవ‌స‌రం లేద‌ని తాంత్రికుడు స‌ర్ది చెప్పాడు.

ఈలోగా ఐదారుగురు యూట్యూబ్ వాళ్లు పొలోమంటూ చొర‌బ‌డి చొక్కాల‌కి మైకులు త‌గిలించి , కెమెరాలు ఆన్ చేసారు. తాంత్రికుడికి కోపం వ‌చ్చినా, పబ్లిసిటీ అవ‌స‌రం కాబ‌ట్టి త‌మాయించుకున్నాడు.

సుబ్బారావు కొంచెం భ‌యంగానే మొద‌లు పెట్టాడు.

“నేనో సినిమా పిచ్చోన్ని. మొద‌టి ఆట చూడ‌క‌పోతే అదే నా ఆఖ‌రి రోజు. ఎన్ని దెబ్బ‌లు త‌గిలినా మ‌ళ్లీ కోలుకుని వ‌చ్చే వారానికి థియేట‌ర్‌కి వెళ్లిపోతాను. గ‌త వారం క‌ర‌క‌ర వీర‌మ‌ల్లు సినిమా చూసాను. డైలాగ్‌లు ఎక్కువ‌, యాక్ష‌న్ త‌క్కువ‌. పావు వంతు హీరో డూప్ న‌టించాడు. మిగ‌తా పావు గ్రాఫిక్స్‌లో లాగారు. స‌గం సినిమా మాత్ర‌మే హీరోది. దీనికి కూడా పార్ట్ 2 వుంద‌ని స‌గంలో ఆపేశారు.

పాత రోజుల్లో ఎన్టీఆర్ స్టూడియో గుర్రం మీద వెళితే, తెలియ‌క విజిల్స్ వేశాం. ఇప్పుడు కూడా గ్రాఫిక్స్ గుర్రాల‌పై హీరోలు స్వారీ చేయ‌డం న్యాయ‌మా? కోహినూర్ తెస్తాన‌ని వెళ్లిన హీరో, దారిలో గాలి తుపానులో చిక్కుకుని ఔరంగ‌జేబు ఎదురుగా అంత‌రిక్ష యాత్రీకుడిలా వేలాడుతుంటే బుర్ర చెడి, బ‌య‌టికి వ‌చ్చి ఇంటిదారి మ‌రిచిపోయాను. చివ‌రికి ఎవ‌రో ద‌య‌త‌ల‌చి ఇల్లు చేర్చారు.

వారం రోజులు ఉప‌శ‌మ‌నం పొంది, ధైర్యం తెచ్చుకుని రాంగ్‌డ‌మ్‌ అనే సినిమాకి వెళ్లాను. హీరో కానిస్టేబులే అయినా , అండ‌ర్ క‌వ‌ర్‌గా శ్రీ‌లంక వెళితే ఇదేదో బాగుంది అనుకున్నా. అన్న‌ద‌మ్ముల క‌థ‌. అటూఇటూ మెలిక‌లు తిరిగి క‌ర్ర ప‌ట్టుకుని సంస్కృత తెలుగు మాట్లాడే ముస‌లోడి ద‌గ్గ‌ర తేలి, ఎటు చూసినా ర‌క్త‌మే క‌నిపిస్తే మెద‌డువాపు వ్యాధి వ‌చ్చేసింది.

ఇది కూడా స‌గం క‌థే. పాన్ ఇండియా , పార్ట్ 2 పిచ్చిలో ప‌డి ప్రేక్ష‌కుల పార్ట్స్ ఇర‌గ‌దీయ‌డం న్యాయ‌మా? అని ప్ర‌శ్నిస్తున్నాను. టికెట్ ధ‌ర‌తో పాటు , మెడిక‌ల్ బిల్లు కూడా మోప‌డం అన్యాయం కాదా?” అని సుబ్బారావు ముగించాడు.

ఈ తాంత్రికుడు ఇంకో ర‌క్ష రేకు క‌ట్టిన త‌ర్వాత సుబ్బారావు నెమ్మ‌దించాడు. కెమెరాలు స‌ర్దుకుని యూట్యూబ్ వాళ్లు వెళ్లిపోయారు.

ప్రేక్ష‌కున్ని మ‌రో లోకానికి తీసుకెళ్లిన ఆ రెండు సినిమాలు’ అని తంబ్‌నెయిల్స్ పెట్టి వీడియోలు వ‌దిలారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!