Bharadwaja Rangavajhala ……………………………
ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే నాయనా … మరి ఆ యొక్క 1975 మార్చి పదహారో తారీఖున మద్రాసు పాండీ బజార్ లో ఉండి నటువంటి రాజకుమారి సినిమా హాలులో … ఆ యొక్క వైవి రావ్ ఉన్నాడు కదా … దరిమిలా నిర్మాతా … అంతకు ముందు డిటెక్టివ్ నవలల పత్రిక నడిపేవాడూ అతనూ …
రోటీ అని మన్మోహన్ దేశాయ్ తీసిన .. రాజేశ్ ఖన్నా.. ముంతాజూ నటించిన హిందీ సినిమా లేదూ దాన్ని ప్రత్యేక ఆట వేసి చూపించాడు …ఆ ఏమిటో చూపిస్తున్నాడూ చూసేద్దాం … తర్వాత ఎటూ ఏదో చెప్తాడు కదా అనుకున్నాం … వెళ్లాం … జర్నలిస్టులం అందరమూనూ …సినిమా బాగానే ఉంది… అందులో చాలా మంది అంతకు ముందే ఆ సినిమా చూశారు… డెబ్బై నాలుగులోనే వచ్చిందిగా అదీ … ఆ విషయం పక్కన పడేస్తే .
ఇంటర్వెల్లులో … పాప్ కారన్లూ … సమోసాలూ … కూల్ డ్రింకులూ అన్నీ ఫ్రీయేగా … మరి అవన్నీ కూడానూ తాగేసీ పుచ్చేసుకునీ.. మళ్లీ హాల్లోకి వెళ్లేప్పుడు చెప్పారు ..బాబూ సినిమా అయ్యాక … రవి చిత్రా కార్యాలయంలో మరి భోజనం ఏర్పాట్లు కూడా ఉన్నాయావటా అని…సర్లే ఎన్నో చేశాం అది మాత్రం చేయలేమా ఏమిటీ అనుకుని సినిమా చూసేసి అక్కడ భోజనం కూడా కానిచ్చేశాం.. అయిపోయిన తర్వాత … వైవి రావ్ వచ్చి కూర్చున్నాడు. తాంబూలాలు బిగిస్తున్నారు మన మిత్రులు. ఎలా ఉంది సినిమా అని అడిగాడు … అందరినీ ఉద్దేశించి.
ఓ పదిపదిహేను మందిమి ఉంటాం. అన్ని పత్రికలకు సంబంధించిన రిపోర్డర్లమూ కలిపి … అంటే అందులో తెలుగు తమిళం ఇంగ్లీషులతో పాటు డైలీ పేపర్లూ సినిమా మంథ్లీలు వీక్లీలవాళ్లూ కూడానూ కల్పి ఉన్నారులెండి … అయ్యింది కదా … అందరూ కూడానూ సినిమా బాగానే ఉందన్నట్టుగా అభిప్రాయం పడ్డారు. దీన్ని నేను తెలుగులో రీమేక్ చేద్దాం అనుకుంటున్నాను … హీరో మరి మన ఎన్టీఆరే … డైరెక్టర్ లాల్ గారే అన్నారు.
విషయం ఏమిటంటే … ఆయన అంతకు ముందే నిప్పులాంటి మనిషి అనే పేరుతో హిందీ జంజీరుకి తెలుగుపూత పూసి విజయం సాదించిన ఉత్సాహంతో ఉన్నారన్నమాట. అదేదో సామెత చెప్పినట్టు ఫలానా హిందీ సినిమా రీమేకు చేస్తున్నానూ అని తగుదునమ్మా అని టముకేసి చెప్పుకోవడం ఎందుకూ వీరి ఒఘాయిత్యం కూలా … పైగా ఇంతోసిదానికి ఆ సినిమా మాకు చూపించి భోజనాలు కూడా పెట్టడం ఎందుకు బొత్తిగా లౌక్యం లేదు డిటెక్టివ్ నవలల వాడైనప్పటికిన్నీ అని వైవి రావును చూసి తెగ జాలిపడిపోయేసి అడిగేశాను కూడా. .
అప్పుడు ఆయన నవ్వి … ఈ సినిమాను తెలుగులో చేసేప్పుడు ఏఏ మార్పులు చేస్తే బాగుంటుందో సూచిస్తారని మీకు చూపించాను అందుకే భోజనాలు తదితరాలూ … అలాగే ఎవరేనా మార్పులు ప్రతిపాదిస్తే … అవి మాకు సబబు అనిపిస్తే తగిన పారితోషికం కూడా ఉంటుందీ అన్నాడు. ఇంత వివరణ ఇచ్చినప్పటికిన్నీ … నాకెందుకో వైవిరావ్ అమాయకత్వమే కనిపించింది సుమీ . అట్టా ఉండేవారారోజుల్లో నిర్మాతలు … పాపం నిజంగానే నిర్ మాతల్లానే … అంటే అర్దమైంది కదా … తల్లిలేని పిల్లల్లా అనిపించేవారు పాపం …ఏమిటో ఆ రోజులే వేరూ … అని ముగించారో మద్రాసు కాలం నాటి జర్నలిస్టొకాయన ఆ మధ్య కల్సినప్పుడు …