సుదర్శన్ .టి ……………
Siachen Glacier ప్రపంచంలో అత్యంత ఎత్తయిన, అతిశీతల యుద్ధభూమి.. ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 52°లకు పడిపోతుంది. 1987 లో ఇండియా, టిబెట్ బోర్డర్లో చైనాతో పోట్లాడుతున్న సమయం చూసి పాక్ సియాచిన్ మీద దాడిచేసి స్వాధీనం చేసుకుంది. అక్కడ అన్నింటికంటే ఎతైన శిఖరం మీద మిలిటరీ పోస్ట్ కూడా ఏర్పాటు చేసుకుంది.
ఆ పోస్ట్ పాక్ కు ఎంత ముఖ్యమైనదంటే దానికి Quaid Post అని పేరు పెట్టుకున్నారు. పాకిస్థాన్ జాతిపిత జిన్నాను Quaid-e-Azam అంటారు.ఈ పోస్ట్ నుండి పాక్ సైన్యం భారత ఆర్మీ పోస్టులను స్పష్టంగా చూడగలుగుతుంది.. సప్లై లైన్స్ మీద కాల్పులు జరుపగలుగుతుంది. పాక్ ప్రభుత్వం కూడా తమ దేశంలోకి వచ్చే పర్యాటకులకు సియాచిన్ విజిట్ పర్మిట్లు ఇవ్వడం మొదలెట్టింది.
దీనితో సియాచిన్ మొత్తం పాక్ భూభాగం అనే సందేశం ప్రపంచానికి వెళుతోంది. Quaid post ను వెంటనే తిరిగి స్వాధీనం చేసుకోవడం ఇండియాకు అనివార్యం. రెక్కీ కోసం లెఫ్టినెంట్ రాజీవ్ ఆధ్వర్యంలో వెళ్లిన ఒక దళాన్ని పాక్ సైనికులు హతమార్చారు. 6 మంది సైనికులు చనిపోయారు. వారి మృతదేహాలు కొన్ని వారాల తర్వాత కానీ తీసుకురాలేక పోయారు.
ఈసారి బాధ్యతను మేజర్ వరేందర్ సింగ్ కు అప్పగించారు. అంతకు ముందు జరిగిన ఒక ఘటనలో శత్రు సైనికుల కాల్పుల్లో ఒక బుల్లెట్ ఈయన ఛాతీలో దిగింది. ఈసారి పాక్ సైనికుల వెనుక వైపు ఏకంగా 1500 అడుగుల ఎత్తు నిటారుగా ఉన్న మంచు గోడ మీద పైకి పాక్కుంటూ వెళ్ళాలని అదీనూ మామూలుగా ఊపిరి ఆడని 19,200 అడుగుల ఎత్తున ఉన్న మన సైనిక స్థావరం నుండి మొదలు పెట్టాలని నిశ్చయించారు.
ఈ do or die మిషన్ కు ఇదే ఆపరేషన్ లో ప్రాణాలు అర్పించిన లెఫ్టినెంట్ రాజీవ్ పేరు మీద ఆపరేషన్-రాజీవ్ అని పేరు పెట్టారు.మేజర్ వరేందర్ ఆధ్వర్యంలో ఒక సైనిక దళం జూన్ 23న పొద్దున 8 గంటలకు 90° నిటారుగా ఉన్న మంచు గోడ మీద పైకి పాకడం మొదలెట్టారు. కానీ విపరీత ప్రకృతి పరిస్థితుల కారణంగా మరుసటి రోజు పొద్దున 4 గంటల వరకూ కూడా కేవలం 150 మీటర్లు ముందుకు సాగ గలిగారు.
సైనిక దళాన్ని వెనక్కు వచ్చేయమని చెప్పడం జరిగింది అయినా సైనికులు ఒప్పుకోలేదు. పైనున్న పాక్ స్థావరాన్ని చేరుతాము లేదా ప్రాణాలతో తిరిగి రాము అని స్పష్టం చేశారు. ఓపిక కూడగట్టుకోవడం కోసం కొన్ని చాక్లెట్లు తిని టీతాగి మొక్కవోని ధైర్యంతో మళ్ళీ పైకిపాకడం మొదలెట్టారు.
సుబేదార్ సత్నాం సింగ్ కొంతమంది సైనికులతో పాక్ పోస్ట్ మీద లీడ్ ఎటాక్ చేశారు కానీ పైనుండి పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. తర్వాత సుబేదార్ సన్సార్ చంద్ కొందరు సైనికులతో దాడి చేశారు కానీ కొంత సేపటికే వారితో కాంటాక్ట్ కట్ అయిపోయింది.ఈసారి Naib Subedar Bana Singh ఇంకో ఇద్దరు సైనికులతో దాడికి దిగారు.
కానీ పైకి వెళుతుండగా ఇద్దరు సైనికుల అరోగ్య పరిస్థితి బాగా విషమించడంతో వారిని వెనక్కు పంపారు. మరుసటి రోజు మళ్లీ ఇంకో 5 మంది సైనికులు వచ్చే వరకూ సుబేదార్ బనా సింగ్ వెనక్కు తగ్గలేదు.అప్పటికే ఈ దళంలోని ఆరు మంది పూర్తిగా అలసిపోయి వున్నారు, శరీరంలో ఏమాత్రం సత్తువ లేదు కానీ లెఫ్టినెంట్ రాజీవ్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలి. శత్రుసైనికుల తూటాల వర్షం ఆగట్లేదు.
నలువైపులా దట్టంగా మంచు కమ్ముకుని ఉంది. పైనున్న సైనికులు కనబడడం లేదు కానీ ఆ దట్టమైన మంచు నుండి తూటాలు దూసుకు వస్తున్నాయి. పైనున్న పాక్ సైనికులకు ఎవరూ కనబడడం లేదు. కాబట్టి కింద ఉన్న మంచులోకి ఆపకుండా బుల్లెట్లు షూట్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బనాసింగ్ ఇంకా ఆ ఐదుగురు సైనికులు మళ్లీ మంచు గోడమీద పైకి పాకడం మొదలెట్టారు.
అలా పాకుతుంటే మంచుగోడల్లో ఇరుక్కుపోయి గడ్డకట్టిన మన తొమ్మిదిమంది సైనికుల మృతదేహాలు కనబడ్డాయి. ఈసారి భయం కంటే పగ ఎక్కువయ్యింది. శత్రువులకు అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా పైకి పాకారు. ఒకసారి పైకి చేరగానే ఏమాత్రం ప్రాణభయం లేకుండా ఏకంగా ఫైరింగ్ వస్తున్న దిశగా దూసుకెళ్లారు.
కాల్పులు జరుపుతూ గ్రనెడ్లు విసురుతూ అక్కడున్నపాక్ సైనికులతో పోరాటానికి దిగారు ఒక ఇద్దరి గొంతుల్లో కత్తులు దింపారు. అలా బంకర్ చేరి బనాసింగ్ స్వయంగా బంకర్ లోకి గ్రనేడ్ విసిరి తలుపు మూసేశారు. ఆ ప్రేలుడులో గదిలోని ఆరు మంది పాక్ సైనికులు హతమయ్యారు. వారు పాకిస్థాన్ elite Special Services Group షాహిన్ కంపెనీకి చెందినవారని తర్వాత తెలిసింది.
పోరు ముగిసింది, high altitude warfer లో ఒక అధ్యాయం సృష్టించబడింది. అంతవరకూ దక్షిణ దిశగా భారత్ సైనికుల వైపు ఎక్కుపెట్టబడివున్న మెషీన్ గన్నులు ఉత్తరాన పాక్ వైపు తిప్పారు. పోస్టు మీద భారత్ జెండా ఎగరేసారు. తర్వాత అక్కడే ఉన్న పాక్ సైనికుల స్టవ్ మీద కొంచెం అన్నం వండుకుని తిన్నారు. మూడు రోజుల్లో ఇదే వారు చేసిన మొదటి భోజనం.
ఈ విజయం ఎంత గొప్పదంటే అంత వరకూ పాక్ జాతిపిత పేరు ఉన్న Quaid పోస్టుకు భారత ప్రభుత్వం బనాపోస్ట్ అని పేరు మార్చింది. భారత్ సైనిక చరిత్రలో ఒక సైనికునికి దక్కిన అరుదైన గౌరవం ఇది. తర్వాత సుబేదార్ బనా సింగ్ కు అత్యున్నత యుద్ధకాల శౌర్య పురస్కారం పరం-వీర్-చక్ర ప్రదానం చేశారు.
అండమాన్, నికోబార్ దీవుల్లోని 21 అనామక దీవులకు పరమ వీర చక్ర గ్రహీతల పేర్లను పెట్టింది. అందులో ఒక ద్వీపానికి ‘బనా సింగ్ ద్వీపం’ అని పేరు పెట్టారు.ఆయన భారత సైన్యంలో నాయబ్ సుబేదార్గా చేరి, సుబేదార్ మేజర్ హోదాలో పదవీ విరమణ చేశారు. ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ‘గౌరవ కెప్టెన్’ (Honorary Captain) హోదాను దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన పరమ వీర చక్ర పొంది జీవించి ఉన్న ముగ్గురు భారతీయులలో ఒకరు.

