రాక్షసుడు చెరుకూరి రామోజీరావు !

Sharing is Caring...
Taadi Prakash ………………

The Genghis Khan of Telugu Journalism ___________________

రామోజీరావు మార్గదర్శి డబ్బుల్తో ఒక గుర్రం కొన్నాడు. ఆరోగ్యంగా బలిష్ఠంగా ఉన్న ఆ గుర్రంపై ఎగిరి కూర్చుని దూసుకుపోతున్నాడు రామోజీ, ఒక మంగోల్ వీరునిలా! జయించాలి, యుద్ధం చేసన్నా సరే, సాధించాలన్న కాంక్ష అతన్ని కుదురుగా వుండనివ్వడం లేదు. ఎదురుగా వున్న పెద్ద కొండపైకి గుర్రాన్ని పోనిచ్చాడు. ఆ ఎత్తు నుంచి కనిపిస్తున్న సువిశాలమైన ప్రదేశాన్ని పరికించి చూశాడు.

విజయవాడ, హైద్రాబాద్ అనే చోట్ల కొన్ని పురాతన తండాలు వార్తా పత్రికలు పెట్టుకుని బతుకుతున్నాయి. దూరంగా సముద్ర తీరాన వున్న విశాఖలో మండుతున్న నెగళ్ల చుట్టూ ఆటవిక తండాలు! అక్కడ వార్తా పత్రికల సందడిలేదని గుర్తించాడు. వేల సైన్యమూ, విల్లంబులూ లేకుండానే ఆ ప్రాంతాన్ని జయించవచ్చని ఇట్టే పసిగట్టాడు. ఉత్తరాంధ్ర వ్యూహ రచన సిద్ధం చేశాడు. చిన్న సైజు ఆర్మీతో రంగంలో దూకాడు. అది 1974 ఆగస్టు 10వ తేదీ. ‘ఈనాడు’ దినపత్రిక ప్రారంభం అయింది. కొన్ని నెలల్లోనే తొలి విజయం కేక పెట్టింది.

కొట్టాల్సిందిక కుంభస్థలమే అని, రాజధాని హైద్రాబాద్ వైపు గుర్రాన్ని దౌడు తీయించాడు. 1975 డిసెంబరు 17న ఖైరతాబాద్ నుంచి ఈనాడు పబ్లికేషన్ ప్రారంభమైంది. ఎ.బి.కె.ప్రసాద్ అనే సేనాధిపతిని వొదిలించుకున్న రామోజీ, బూదరాజు రాధాకృష్ణ, రాంభట్ల కృష్ణమూర్తి, గజ్జెల మల్లారెడ్డి, రాచమల్లు రామచంద్రారెడ్డి, మోటూరి వెంకటేశ్వరరావు అనే అతిరథుల్ని కదనరంగంలోకి దించాడు. తొలినాళ్ల వొడిదుడుకుల్ని తట్టుకుని పత్రికను నిలబెట్టాడు. After a while it was a sensational victory and the rest is history.

1977 జూలై 19న హైదరాబాద్ ‘ఈనాడు’లో జాయిన్ అయ్యాను. అనువాదం చెయ్యడం చేతకాదు. హైద్రాబాద్ కొత్త. ఏమీ తెలీదు. అపుడు నాకు 19 ఏళ్లు. ‘‘నాతోపాటు ఈనాడులోనే వుండు అన్నారు మోటూరి. మూడో అంతస్తులో లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నారు. పుస్తకాల అల్మరాల మధ్య దుప్పట్లు పరుచుకుని, రగ్గులు కప్పుకుని నిద్రపోయేవాళ్లం. పని చేస్తున్న పెద్దలంతా కమ్యూనిస్టులు. నా నేపథ్యమూ అదే గనక, ప్రేమగా, గారాబంగా చూసుకునేవాళ్లు. (గారాబం ఏమిటో? టీకి తీసుకెళ్లడం, సిగిరెట్ వెలిగించడం, సాయంకాలాలు చల్లని కింగ్ ఫిషర్, ఉల్లిపాయిలూ, మసాలా పల్లీ… ఆ షోకే వేరు!).

అప్పటికి రామోజీ పేరు వినడమే. చూడనే లేదు. ఓ రోజు ఉదయం పదిన్నరకి, ఏమీ తోచక ఈనాడు టెర్రస్ మీదికి వెళ్లాను. రాంభట్ల, మరో వ్యక్తీ మాట్లాడుకుంటున్నారు. సిమెంట్ దిమ్మమీద కాలు పెట్టి, మోకాలి మీద చెయ్యిపెట్టి మాట్లాడుతున్న వ్యక్తి, గోల్డ్ రిమ్ కళ్లద్దాల్లోంచి చటుక్కున చూశాడు. నా లాంటి కుర్రాళ్లు జడుసుకునేలా వుంది ఆ చూపు. తెల్లపాంటూ, తెల్లచొక్కా ఆయనే అని ఇట్టే తెల్సిపోతుంది. రాజీపడటాన్ని సహించలేని రామోజీని చూడ్డం అదే మొదటిసారి.

ట్రైనింగ్ ముగిసి, డెస్క్ వర్క్ పట్టుబడ్డాక విశాఖ పంపించారు. 1978 ఫిబ్రవరి 15 ఉదయం, తాడిచెట్ల వెనక ఎర్రని సూర్యోదయాన్ని చూస్తూ సీతమ్మధార వెళ్లాం. పచ్చని పూలచెట్ల మధ్య ఈనాడు ఆఫీసు. మొదటి నెలల్లోనే గుర్తింపు తెచ్చుకున్నా. హైద్రాబాద్ నుంచి రామోజీ ఎప్పుడన్నా వచ్చేవారు. ఎండీలూ, మేనేజర్లు… ‘‘ఛైర్మన్ గారు వస్తున్నారు, వచ్చేస్తున్నారు’’ అని హడావిడి చేసేవారు.

మాయాబజార్ లో శిష్యగణం సిద్ధం అవుతుంది. చిన్నమయ్య కంట్రోలు చేస్తుంటాడు. పెద్ద ఢంకా మీద వెలుగు… ఆరి మళ్లీ వెలుగు… అదిరిపోయే సంగీతంతో ‘‘ఘటో… ఘటోద్గజ’’ అని విన్పిస్తుంది. నిలువెత్తు ఘటోత్కచుడు భుజమ్మీద గదతో, పద్యంతో ప్రత్యక్షం అవుతాడు. అంత బిల్డప్ వుండేది రామోజీ వస్తున్నాడంటే! ఓ రోజు ఎం.డీ.అప్పారావు పిలిచి, డాల్ఫిన్ హోటల్లో ఛైర్మన్ గారున్నారు, రమ్మన్నారు, వెళ్లండి అన్నారు.

వెళ్లాను. డాల్ఫిన్ ఇంకా నిర్మాణంలో వుంది. నేను కనిపించగానే ‘కమాన్’ అంటూ ఇటుకలూ, ఇసుక, ఇనప చువ్వలూ దాటుకుంటూ రామోజీ గబగబా రెండు అంతస్తులు ఎక్కారు. వెనకే నేను. పక్కనే వున్న ఇసుక తోట అనే స్లమ్ తగలబడిపోతోంది. ‘‘వెళ్లి అదంతా చూసి రాయండి’’ అన్నారు. ఎంతో మంది సీనియర్లు, రిపోర్టర్లూ వుండగా నాకాపని అప్పగించారు. అది మొదటి గుర్తింపు. ఆనాటి ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారు. వందల ఇళ్లు కాలిపోయాయి. వివరంగా వార్త రాశాను.

విశాఖ ఈనాడు ఆఫీసులోనే… ముందు రామోజీ గెస్ట్ హౌస్ వుంటుంది. ఎడిటోరియల్ సిబ్బందితో ఒక రోజు మీటింగ్. పదిహేను, ఇరవై మందిమి రామోజీ ఎదురుగా కూర్చుని వున్నాం. పేపర్ గురించి సాధక బాధకాలు మాట్లాడుతున్నారు. సీతారాంరెడ్డి అనే జర్నలిస్టు సమస్యలు, జీతాల గురించీ చెప్పబోయాడు, వెంటనే రామోజీ ‘‘జాగ్రత్త! తోక కత్తిరిస్తా’’ అని హెచ్చరించారు. నేను ఆశ్చర్యపోయాను.

అప్పట్లో ఈనాడు ఉత్తరాల కాలమ్ నేనే చూసేవాణ్ణి. స్కైలాబ్ భూమ్మీద పడుతుందనీ, విధ్వంసం తప్పదనీ వార్తలు జోరుగా వస్తున్న కాలమది. స్కైలాబ్ ఎక్కడ పడుతుందో? అని ఒక పాఠకుడు లేఖ రాస్తే, నేను దాన్ని మార్చి రాసి, ‘‘అద్వానీ నెత్తిమీద పడితే….’’ అని హెడ్డింగ్ పెట్టాను. ఆ రోజే పబ్లిష్ అయింది. కమ్యూనిస్టు హేంగోవర్ వల్ల అంత బాధ్యతారహితంగా శీర్షిక పెట్టాను. ఉత్తరాల కాలమ్ ఎవరు చూస్తున్నారు?

ఆ హెడ్డింగ్ పెట్టిందెవరు? అని రామోజీ అడిగారు. నేను లేచి నిలబడి, హెడ్డింగ్ పెట్టింది నేనేననీ, పొరపాటు జరిగిందనీ వినయంగా చెప్పాను. ఆయన ‘‘నో…’’ అన్నాడు. హమ్మయ్య అనుకున్నా. రామోజీ చిన్న పాజ్ యిచ్చి, ‘‘పొరపాటు కాదు, Its a blunder” అని అరిచినంత పని చేశారు. నేను బిగుసుకుపోయాను.

ఒంటిచేత్తో ఆంధ్ర ప్రదేశ్ ని జయించగలనని తెలిసిన విజనరీ గనక, రామోజీ పత్రికని పంచ ప్రాణాలు పెట్టి చూసుకునేవాడు. మొదటి పేజీ పెట్టిందెవరు? ఫలానా హెడ్డింగ్ ఎవరిది? ప్రతి విషయం, ప్రతిరోజూ గమనించి, మాకు కామెంట్స్ పంపేవారు. తిరుపతి ఎడిషన్ పెడుతున్నపుడు కె.ఎన్.వై.పతంజలినీ, రెండో వాడిగా నన్నూ పంపించారు. మాకు ప్రమోషన్లు యిచ్చారు. 1982 జూన్ 20న ప్రారంభమైంది తిరుపతి ‘ఈనాడు’ ఎడిషన్. ప్రింటింగ్ మొదలవ్వడానికి 15 రోజుల ముందే రామోజీ రేణిగుంట ఆఫీసుకు వచ్చారు.

వారం పది రోజులు పతంజలి, నాతో కలిసి పని చేశారు. అప్పుడు ఎంతో ఈజీగా, హాయిగా వుండే రామోజీని చూశాను. పతంజలి న్యూస్ ఎడిటర్ సీట్లో వుంటే, ఆయన ఎదురుగా (గెస్టులాగా) రామోజీ కూర్చునేవారు. డెస్క్ ఇంఛార్జి సీట్లో నేనుంటే, అటూ యిటూ సబ్ ఎడిటర్లు కూర్చోడానికి పన్నెండు కుర్చీలయినా వుంటాయి. చిన్న ఉద్యోగిలా నా పక్కనే కూర్చునేవారు. వార్తలు ఏమొస్తున్నాయి? హెడ్డింగులు ఏం పెడుతున్నారు.. ఇన్ టైంలో పేపర్ డెలివర్ చేయగలమా? అన్నీ గమనించేవారు. మాతో మాట్లాడేవారు.

The action packed RamojiRao ఒక రోజు రామోజీ, ఎడిటోరియల్ సెక్షన్ లో నా దగ్గరకొచ్చి, ‘రండి’ అన్నారు. లేచి నించున్నాను, నా ఎడం చెయ్యి పట్టుకుని కొంచెం దగ్గరకి లాక్కుని, భుజమ్మీద చెయ్యేశారు. కార్మికులంతా వుండే పేజీ మేకింగ్ సెక్షన్ వైపు నడుస్తున్నాం. పేపర్ కి సంబంధించిన సంగతులేవో చెబుతున్నారాయన. నెమ్మదిగా కంపోజర్లు, ఇంపోజర్లు, కెమేరా సెక్షన్ సిబ్బంది వుండే హాల్లోకి వెళ్లాము.

రామోజీరావు చెయ్యి నా భుజమ్మీదే వుంది. మొదటి పేజీ పెట్టే చోట ఆగి ‘‘పెట్టండి పేజీ’’ అన్నారాయన. వార్తలు ఎక్కడ ఏవి పెట్టాలో చెబుతున్నా. ‘‘హెడ్డింగులు పెట్టరా’’ అన్నారాయన. ఆయనే కాగితాలిచ్చి, రాయండి అన్నారు. కొన్ని హెడ్డింగులు పెట్టా. మార్చమన్నారు. మళ్లీ రాసిచ్చా. బావున్నాయన్నారు. ఆ బరువైన చెయ్యి యింకా నా భుజమ్మీదే! ఈ కథలో నీతి ఏమిటంటే, పతంజలి గారు ఎడిషన్ ఇన్ ఛార్జి కావొచ్చు.

డే ఇన్ అండ్ డే అవుట్ పని చేసి పేపర్ ప్రొడ్యూస్ చెయ్యాల్సింది నేను. కనుక, రామోజీ అనే బ్రిలియంట్ పెట్టుబడిదారుడు అక్కడి వర్కర్లకి క్లియర్ గా మెస్సేజ్ యిచ్చారు. సాక్షాత్తూ ఛైర్మన్ గారే వీడి భుజమ్మీద చెయ్యేసి, స్నేహితుడిలా మాట్లాడుతున్నాడంటే… ఇక వాళ్లకి ప్రత్యేకించి చెప్పాల్సిందేముంది. ఆ రోజు నుంచీ నేనేం చెప్పినా వర్కర్స్ క్షణాల్లో చేసేసేవారు. రామోజీకి నా మీద కాదు. పేపర్ మీద తనకున్న ప్రేమ అది.

మరో రోజు ఆయన నా సీట్లో కూర్చున్నారు. ఆ వార్త, ఈ వార్త అంటూ హడావుడి పడుతున్నా. ఇంతలో హైద్రాబాద్ నుంచి ఎడిటోరియల్ వచ్చింది. చదివాను. ఆయన చేతికిచ్చాను. రామోజీ చదివి అప్రూవ్ చేసిన తర్వాతే ఎడిటోరియల్ ప్రింటింగ్ కి వెళ్లాలి! ఆ రూలు తప్పడానికి వీల్లేదు. ఎడిటోరియల్ పది పన్నెండు లైన్లు ఎక్కువైంది, కట్ చేయాలని చెప్పాను. నాచురల్ గా నేనే కట్ చేయాలిగా… అయితే ఆయన చదివేసి 12 లైన్లు వున్న ఒక పేరాని కొట్టేశారు.

అది చాలా మంచి ఎడిటింగ్. ఆ పేరా తీసేస్తే ఎడిటోరియల్ కి ఏ యిబ్బందీ లేదు. అనవసరమైన వివరాలనే రామోజీ కట్ చేశారు. అంత షార్ప్ ఆయన. ‘‘తమరి యొక్క కామన్ సెన్స్ తగలడిపోనూ’’ అనుకున్నా నేను. రేణిగుంట ఈనాడు ఆఫీసులోనే పైన ఆయన గెస్ట్ హౌస్ వుంటుంది. పతంజలినీ, నన్నూ పైకి పిలిచారు. వెళ్లి ఆయన ఎదురుగా కూచున్నాం. చాలా రిలాక్స్ డ్ గా, హాయిగా వున్న రామోజీ… ‘‘ఇదిగో, యిలా బక్క పల్చగా, బాగా సన్నగా వున్న మీ యిద్దరినీ నమ్ముకుని రెండు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టా.

నాకు తెలుసు మీ యిద్దరూ కమ్యూనిస్టులని. ఇది తిరుపతి ఎడిషన్. కొండ మీదికి భక్తులు వస్తూనే వుంటారు. వాళ్లు హర్ట్ అయ్యే పనులేమీ చెయ్యకండి. దేవుడి సెంటిమెంటుకి విరుద్ధంగా కామెంట్ చెయ్యడం, వార్తలు వెయ్యడం… వద్దేవద్దు. నిజానికి నేను కూడా నాస్తికుణ్ణే. కానీ మనం ప్రజల సెంటిమెంటును గౌరవించాలి’’ అని చెప్పారు. ఒక రాక్షసుడు తన వ్యాపార ప్రయోజనాల కోసం నిజమైన మానవుడిగా మారిన ఒక స్వచ్ఛమైన దృశ్యాన్ని నేను చూడగలిగాను.

(మిగతాది పార్ట్ 2 లో)  రాక్షసుడు చెరుకూరి రామోజీరావు (పార్ట్ 2)

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!