డిసెంబర్ 23 , 2020న కేరళ సీబీఐ కోర్టు సిస్టర్ అభయ కేసు లో సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. 1992 లో జరిగిన సిస్టర్ ‘అభయ మర్డర్ కేసు’ లోని కొన్ని పాయింట్లు ఆధారం చేసుకుని 1999 లో మలయాళంలో “క్రైమ్ ఫైల్ ” పేరిట ఒక సినిమా తీశారు. సురేష్ గోపి హీరో. కథ లో ఇతరత్రా అంశాలను జొప్పించి ఆసక్తికరంగా మార్చారు.
కేరళ రాష్ట్రంలో అత్యంత సంచలనాత్మక కేసులలో ఇది ఒకటి. ఈ సినిమా కథాంశం కాన్వెంట్ ప్రక్కనే ఉన్న బావిలో చనిపోయిన సిస్టర్ అమల హత్య చుట్టూ తిరుగుతుంది. ఎ.కె సజన్ స్క్రిప్ట్ అందివ్వగా , కె మధు డైరెక్ట్ చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. బలమైన కథ, కథనం, సన్నివేశాలు, పంచ్ డైలాగులు ఉన్నాయి, మలయాళం , తెలుగు డబ్బింగ్ వెర్షన్లు కూడా యూట్యూబ్ లో ఉన్నాయి. సినిమాను ఆసక్తికరంగా .. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందించారు.
ఇక అభయ కేసు ఏమిటంటే ………
కేరళలోనే కాక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ కేసులో సీబీఐ కోర్టు ఫాదర్ థామస్ కొట్టూర్, నన్ సెఫీలను దోషులుగా తేల్చింది.ఫాదర్ థామస్ కొట్టూర్, నన్ సెఫీకి సీబీఐ కోర్టు జీవిత ఖైదు విధించింది. దాంతో పాటు చెరో ఐదు లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. ఈకేసు దాదాపు 28 ఏళ్ల పాటు కొనసాగింది.
1993లో కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఘటన జరిగిన 12 ఏళ్ల తర్వాత సెయింట్ పియస్ కాన్వెంట్‌లో అధ్యాపకులుగా పనిచేస్తున్న థామస్ కొత్తూర్, జోస్ పుత్రుక్కయిల్‌తో పాటు ఓ సిస్టర్‌ను అరెస్ట్ చేసింది. అభయకు న్యాయం జరగాలని పోరాడిన ఆమె తలిదండ్రులు నాలుగేళ్ల క్రితమే మరణించారు. కోర్టు తీర్పుతో వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని స్నేహితులు భావిస్తున్నారు.
ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఆమె సోదరుడు బిజు థామస్ ఈ తీర్పుపట్ల సంతోషం ప్రకటించారు.ఇక సీబీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. మార్చి 27,1992న తెల్లవారుజామున 4.15గంటలకు సిస్టర్ అభయ తన హాస్టల్ గది నుంచి కిచెన్ వైపు వెళ్లింది. అక్కడ దోషులు థామస్ కొత్తూర్, క్రైస్తవ సన్యాసిని సెఫీ తో అభ్యంతరకర రీతిలో కనిపించారు.
ఈ విషయం అభయ బయటపెడుతుందోమోనన్న భయంతో ఆమెపై దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. అనంతరం మృతదేహాన్ని కాన్వెంట్ ప్రాంగణంలోని బావిలో పడేశారు. ప్రమాదవశాత్తు అభయ బావిలో పడి మరణించి ఉండవచ్చునని పోలీసులు తొలుత నిర్ధారించారు. కాగా సాక్ష్యాలు లేనందున జోస్ పుత్రుక్కయిల్ పై కేసు కొట్టేశారు.
మానవ హక్కుల కార్యకర్త జోమోన్ పుతెన్‌పురక్కల్ ఈ కేసును కోర్టులో సవాల్ చేయడంతో సీబీఐ విచారణ జరిగింది . ఆ విచారణలో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. దోషులను అరెస్ట్ చేశారు.
————–KNM