Child activist………………………………… ఈ ఫోటోలో కనిపించే కుర్రోడి పేరు ఇక్బాల్ మసీహ్. బాలల హక్కుల కోసం పోరాడిన ఒక పాకిస్తానీ బాలుడు. ఇతని పేరు మీద ‘ఇక్బాల్ మసీహ్ అవార్డ్ ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్’ అనే అవార్డును యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ప్రారంభించింది. మరెన్నో అవార్డులు .. రివార్డులు పొందాడు.
ఎందరికో స్ఫూర్తి గా నిలిచాడు. కానీ మనిషి మన మధ్య భౌతికంగా లేడు. 12 ఏళ్ళ వయసులోనే హత్యకు గురయ్యాడు. కార్పెట్ మాఫియా అతగాడి ప్రాణాలు తీసింది.ఇక్బాల్ మసీహ్ 1983లో పాకిస్తాన్‌లోని లాహోర్ శివార్లలోని ఒక చిన్న గ్రామంలో పుట్టాడు. అతని తండ్రి పేద కూలీ. తల్లి నాలుగిళ్ళలో పనిచేసేది. ఇక్బాల్ తండ్రి అతగాడిని నాలుగేళ్ళ వయసులోనే ఒక కార్పెట్ కంపెనీలో పనికి పెట్టాడు.
తన అన్నపెళ్లి వేడుకలకు డబ్బు అవసరం కావడంతో స్థానిక కార్పెట్ సంస్థ యజమాని నుండి 600 రూ. తీసుకున్నారు. ఆ అప్పు తీర్చేందుకు ఇతగాడిని పనిలో పెట్టారు. వారంలో 6 రోజులు రోజుకు 14 గంటలపాటు పనిచేసినప్పటికీ … జీతం చాలా తక్కువ కావడంతో అప్పు తీరలేదు. ఒకటి రెండు సార్లు తప్పించుకోవడానికి ప్రయత్నించగా యజమాని గొలుసులతో బంధించాడు.
ఇక్బాల్ 10 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, పాకిస్తాన్ సుప్రీం కోర్టు బాలలను కార్మికులుగా మార్చడం చట్టవిరుద్ధమని ప్రకటించింది. అపుడే మరో సారి తప్పించుకునే ప్రయత్నం చేసాడు. బయట ప్రపంచంలోకి వచ్చిన అతగాడిని పోలీసులు పట్టుకుని తిరిగి యజమానికి అప్పగించారు. అతని రెండవ ప్రయత్నం విజయవంతమైంది.
ఇక్బాల్‌కు చదవాలనే కోరిక ఉంది. ఎలాగో కష్టపడి బాండెడ్ లేబర్ లిబరేషన్ ఫండ్ స్కూల్‌లో అడ్మిషన్ సంపాదించాడు. అతను చాలా తెలివైన విద్యార్థి కావడంతో ప్రతి ఉపాధ్యాయుడిని ఆకట్టుకున్నాడు. చదువుకుంటూనే తోటి పిల్లల సాయంతో ఇక్బాల్ 3000 మంది బాల కార్మికులకు మెరుగైన జీవితాన్నిఅందించడానికి కృషి చేసాడు.
బానిసత్వం నుండి విముక్తి పొందేందుకు సహాయం చేశాడు. నాటి నుంచి అతని పేరు అందరి దృష్టిలొ పడింది. పలు సంస్థల ఆహ్వానం పై వివిధ దేశాల్లో కూడా ప్రసంగాలు చేసాడు. బాల కార్మికుడిగా తన అనుభవాలను వివరించేవాడు. బానిస వ్యవస్థను నిర్మూలించాలని కోరే వాడు. చిన్న వయసులోనే ఎన్నో చేసాడు.
ఎన్నో మార్లు బెదిరింపులు కూడా వచ్చాయి. కానీ లెక్క చేయలేదు. ఏప్రిల్ 16, 1995న, తన కుటుంబంతో కలిసి ఈస్టర్ వేడుకలకు వెళ్లి వస్తుండగా ఇక్బాల్‌ను పాకిస్తాన్‌లోని మురిద్కే వద్ద ముహమ్మద్ అష్రాఫ్ అనే వ్యక్తి కాల్చి చంపాడు. అప్పట్లో అతని హత్య పెద్ద సంచలనమే సృష్టించింది.
ఇక్బాల్ మసీహ్ బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడి ఒక ఐకాన్ గా నిలిచి పోయాడు.2014లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నప్పుడు, కైలాష్ సత్యార్థి అతన్ని అమరవీరుడు అని పిలిచారు.ఇక్బాల్ పేరు మీద ‘ఇక్బాల్ మసీహ్ అవార్డ్ ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్’ అనే అవార్డును యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ప్రారంభించింది. ప్రతి ఏటా బాలల హక్కుల కోసం పనిచేసే బాలలకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు.