Neela Kurinji Flowers ……………………………
పై ఫొటోలో కనిపించే పూలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి కదా. ఫొటోలోనే అంత అందంగా ఉన్న పూలను దగ్గర నుంచి చూస్తే ఆ ఫీలే వేరుగా ఉంటుంది.ఈ పూల పేరు నీల కురింజి. ఈ పూల గురించి చాలామందికి తెలియదు. ఈ పూలు పన్నెండేళ్లకు ఒక మారు మాత్రమే పూస్తాయి. అపుడు మాత్రమే వాటిని చూడగలం.
ప్రపంచంలోనే అరుదైన పువ్వులలో ఈ నీల కురింజి ఒకటి. దేశంలోని కేరళ,కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రతి 12 సంవత్సరాలకు ఈ పూలు ఒక్కసారి పూస్తుంటాయి. ఈ పూలు కొండలను అద్భుతమైన వైలెట్ రంగులో కప్పేస్తాయి.నీలకురింజి పూలు కొన్ని చోట్ల నీలం రంగులో కూడా ఉంటాయి
పర్యాటకులు ..ప్రకృతి ప్రేమికులు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. పూలను చూసి పులకించిపోతుంటారు. కొండ ప్రాంతాలన్నీఈ నీలిరంగు/ వైలెట్ పూలతో కొత్త అందాలను సంతరించు కుంటాయి. ఆ దృశ్యాలన్నీ కళ్ళకు అద్భుతమైన విజువల్ ట్రీట్ ఇస్తాయి.
మలయాళం … తమిళంలో నీలకురింజి .. కురింజి అని పిలుచుకునే ఈ పూల శాస్త్రీయ నామం స్ట్రోబిలాంథెస్ కుంథియానా.ఈ జాతికి చెందిన 46 రకాల నీలకురింజిలు ఉన్నాయి. ఈ వైవిధ్యాలలో నీలం, ఊదా, ఎరుపు, మెరూన్ షేడ్స్ ఉన్నాయి.
ఈ పూలను చూడాలంటే కేరళ లోని మున్నార్ సమీపంలో ఎరవికులం జాతీయ ఉద్యానవనంకు వెళ్లాల్సిందే. అక్కడ ఈ పూల అందాలను చూడవచ్చు. అలాగే కర్ణాటక లోని చిక్కమగళూరు సమీపంలో బాబా బుడంగిరి కొండలు ఈ పువ్వులు వికసించే మరొక ప్రదేశం. కొడగు సమీపంలోని మండలపట్టి కొండలు నీలకురింజి పూలకు ప్రసిద్ధి గాంచాయి.
తమిళనాడులోని నీలగిరి కొండలలో కూడా ఈ పూలను చూడవచ్చు. ఇక్కడ 2018 లో ఈ పూలు పూచాయి. మళ్ళీ 2030 లో మాత్రమే పూస్తాయి. ఏరియా ను బట్టి సంవత్సరం మారవచ్చు.. పూలు వికసించే సీజన్ లో పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు..
ఈ పూలు సాధారణంగా అనేక వారాల పాటు వికసిస్తాయి, ఇదొక అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది. ఆ కొండలపై పెరిగే ఒక రకమైన పొదల్లో ఈ పూలు పూస్తాయి . నీలగిరి కొండలపైన పొదలలో ఈ పూలు పూస్తాయి. కాబట్టి వీటిని నీలంకురింజి పూలు అంటారు. వీటినే బ్లూ ఫ్లవర్స్ అని కూడా పిలుస్తారు.